
ఐపీఎల్ పండుగకు వేళైంది. రేపటి నుంచి క్రికెట్ ప్రేమికులు ఇక తనివి తీరా తమ ప్రాంత ఐపీఎల్ టీంకు మద్దతుగా టీవీలకు అతుక్కుపోవచ్చు. ఐపీఎల్ మ్యాచ్ లకు ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో ఈసారికి టీవీల్లోనే చూసేయాలి.
ఐపీఎల్ 14వ సీజన్ ఈసారి కరోనా నిబంధనలతో బయో బబూల్ లో జరుగనుంది. ధోని, కోహ్లీ, రోహిత్ లాంటి హేమాహేమీలతోపాటు విదేశీ స్టార్లతో క్రికెట్ పండుగ దేదీప్యమానంగా వెలుగొందనుంది.
గత ఏడాది క్రికెట్ కు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి సీజన్ అని.. ఐపీఎల్ టైటిల్ గెలిచి వీడ్కోలు పలకాలని ధోని నిర్ణయించుకున్నారని ప్రచారం సాగుతోంది. ముంబై తర్వాత అత్యధిక టైటిల్స్ గెలిచిన చెన్నై విజయాల్లో ధోని కీరోల్ పోషించాడు. గత ఏడాది మాత్రం చెన్నై లీగ్ దశలోనే నిష్క్రమించి నిరాశపరిచింది.
ఇక ఇప్పటిదాకా బెంగళూరు కెప్టెన్ గా ఒక్క టైటిల్ ను గెలవని విరాట్ కోహ్లీపై ఈసారి పెను భారం ఉంది. తొలిసారి బెంగళూరును విజేతగా నిలపాలన్న కసి అతడిపై ఉంది.
అందరికంటే బలంగా ముంబై ఇండియన్స్ ఉంది. రోహిత్ అద్భుత కెప్టెన్సీ ఆ టీంకు బలం. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, పాండ్యా బ్రదర్స్, పోలార్డ్ , బుమ్రా లాంటి అరవీర భయంకర ఆటగాళ్లు ఆ టీం సొంతం. ఈసారి ముంబైనే ఫేవరేట్ అంటున్నారు.
ఇక డార్క్ హార్స్ గా పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఫైనల్ రేసులో ఉన్నాయి. ఈ రెండు జట్లు కూడా యువ ఆటగాళ్లు భీకర టీ20 ప్లేయర్లతో ఉన్నాయి.
మొత్తం ఈసారి ఐపీఎల్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. చివరిక్షణం వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని ఈ టోర్నీ రేపటి నుంచి అభిమానులను అలరించనుంది.

