
IPL Mumbai Indians: ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం ఎంపికైన టీమిండియాలో సగం మంది ‘ముంబై ఇండియన్స్ ఆటగాళ్లే’(Mumbai Indians). ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి మొదలుపెడితే ‘సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, రాహుల్ చాహర్ లు సత్తా గల ఆటగాళ్లు. వీళ్లందరూ కూడా భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. వీరే కాదు.. ముంబై ఇండియన్స్ లో ఉన్న ‘కీరన్ పోలర్డ్’ వెస్టిండీస్ టీ20 కెప్టెన్. ఇక డికాక్.. సౌతాఫ్రికా కెప్టెన్ గా మొన్నటివరకు చేశాడు. ఇక న్యూజిలాండ్ నంబర్ 1 బౌలర్ ట్రెంట్ బౌల్ట్ లాంటి వారు ముంబై ఇండియన్స్ అమ్ములపొదిలో అస్త్రాలుగా ఉన్నారు.
మొత్తంగా ఒక ప్రపంచ సూపర్ జట్టునే ముంబై ఇండియన్స్ కు ఉంది. ఐదు సార్లు ముంబైకి కప్ ను అందించిన రోహిత్ శర్మ కెప్టెన్సీలో రాటుదేలి ఉంది. అలాంటి ముంబై ఇండియన్స్ ఎందుకు ఓడుతోంది. ఐపీఎల్ రెండో సగం ప్రారంభమయ్యాక మొదటి మ్యాచ్ లో చెన్నై చేతిలో చిత్తైన ముంబై.. ఇప్పుడు నిన్న కోల్ కతా చేతిలో పరుగులు చేయలేక ఓడిపోయింది. సునాయాసంగా ముంబైని కోల్ కతా ఓడించింది. కోల్ కతా బ్యాట్స్ మెన్ రెచ్చిపోయి ఆడి ఆ జట్టును గెలిపించారు. ఐపీఎల్ లోనే అత్యంత బలమైన ముంబై ఇండియన్స్ ను అంత చిత్తుగా ఓడించడం చూసి అంతూ అవాక్కయ్యారు.
ఈ దారుణ ఓటములపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. ‘అప్పుడప్పుడు ఇలాంటి ఓటములు ఎదురవుతాయని’ కవర్ చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ సరిగ్గా చేయలేకపోయామని చెప్పుకొచ్చాడు. ముందుకు సాగాలంతే.. నేను, డికాక్ శుభారంభం చేశాక మిడిలార్డర్ వైఫల్యం కొంప ముంచింది. దీని మీద దృష్టి సారిస్తాం.. పాయింట్ల పట్టికలో వెనుకబడ్డామన్న దానిపై ఆలోచించం.. మిగతా మ్యాచుల్లో పోరాడి వరుస విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నాం అని రోహిత్ శర్మ కవర్ చేసే ప్రయత్నం చేశాడు.
నిజానికి ముంబైలో అంతా తోపు ఆటగాళ్లే. అయితే రాణించినంత వరకూ వారిది సాగింది. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో కీలకమైన సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, కీరన్ పోలార్డ్ లు ఫాం కోల్పోయి పరుగులు చేయడానికి ఆపసోపాలుపడుతున్నారు. అదే ముంబై ఇండియన్స్ కొంప ముంచుతోంది.
ముఖ్యంగా సూర్యకుమార్, ఇషాన్ కిషన్ ల వైఫల్యం టీమిండియాను కలవరపెడుతోంది. ఎందుకంటే వీరిద్దరూ టీమిండియా మిడిల్ ఆర్డర్ సభ్యులు. మొత్తంగా ముంబై ఓటమికి మిడిల్ ఆర్డర్ వైఫల్యమే కారణమంటున్నారు. ఇది టీమిండియాకు శరాఘాతమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.