
టోర్నమెంట్ లో బలమైన ముంబై ఇండియన్స్ ను సైతం ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ భయంకరంగా కనిపిస్తోంది. అలాంటి బలమైన జట్టుతో ఈరోజు మొదటి మూడు మ్యాచ్ లు ఓడి నాలుగో మ్యాచ్ ను గెలిచిన సన్ రైజర్స్ తలపడబోతోంది. మరి ఢిల్లీని హైదరాబాద్ ఎదుర్కొంటుందా? ఓడిస్తుందా? అన్నది చూడాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ టోర్నమెంట్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి టోర్నీని పేలవంగా ప్రారంభించింది. అయితే, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చివరి గేమ్‌లో విజయం సాధించి వారు తిరిగి ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీ ఈ రాత్రి చెన్నైలో ఢిల్లీ క్యాపటల్స్ తో తలపడుతోంది. ఈ సీజన్ లో ఢిల్లీ వారి నాలుగు మ్యాచ్ లలో మూడింటిని గెలిచి ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరుగబోతోంది. అన్ని జట్లను భయపెడుతున్న చెన్నై పిచ్ లో ఈ సీజన్ లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో అందరూ ఇక ఈ పిచ్ బాధ నుంచి విముక్తి పొందుతారు.
-బౌలర్లపైనే ఆధారపడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్
మొదటి మూడు మ్యాచ్ లలో సన్ రైజర్ బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమైనప్పటికీ, బౌలర్లు మాత్రం నిరాశపరచలేదు. కెకెఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్ ను మినహాయించి, మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ వారు గట్టిగా బౌలింగ్ చేశారు. మరోసారి సన్ రైజర్స్ వారి బౌలర్లపై ఆధారపడుతోంది. కీలక యార్కర్ కింగ్ బౌలర్ నటరాజన్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నందున ఖలీల్ అహ్మద్ అతడి స్థానంలో ఆడుతున్నాడు. మిగతా అన్ని మ్యాచ్ లలో అతడు పాల్గొంటాడని తెలుస్తోంది. సన్‌రైజర్స్‌కు భువనేశ్వర్ మరియు రషీద్‌లాంటి మంచి అంతర్జాతీయ బౌలర్లున్నారు. వార్నర్, బెయిర్‌స్టో మరియు విలియమ్సన్ రూపంలో హైదరాబాద్ ఫ్రాంచైజీకి బలమైన బ్యాటింగ్ విభాగం కూడా తోడైంది.
-ఢిల్లీకి పాయింట్ల పట్టికలో అగ్రస్థానమే లక్ష్యం
ఈ ఆటను ఢిల్లీ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి వెళ్లేందుకు మంచి అవకాశాలు ఉంటాయి. ఓపెనర్లు శిఖర్ ధావన్ -పృథ్వీ షా ఈ సీజన్‌లో సూపర్ ఫామ్ లో ఉన్నారు. వారి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లకు పెద్ద భారం ఇవ్వడం లేదు. ఢిల్లీ వారి టాప్-ఆర్డర్‌ను ప్రారంభంలో కోల్పోతే వారి మిడిల్ ఆర్డర్ ఎలా ఎదుర్కొంటుందనేది మనం చూడాలి. మరోసారి ఈ పిచ్‌లో అమిత్ మిశ్రా, రవిచంద్రన్ అశ్విన్ పెద్ద పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు.
ఐపీఎల్ చరిత్ర: ఈ రెండు టీంలో ఒకదానితో ఒకటి తలపడిన 18 మ్యాచ్‌లలో సన్ రైజర్స్ 11, ఢిల్లీ క్యాపిటల్స్ 7 విజయాలు సాధించాయి..
మ్యాచ్ వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై.
మ్యాచ్ సమయం: సాయంత్రం 07.30 PM