ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోని ప్రధాన అంశాల్లో వైసీపీ-టీడీపీ వార్ ఒకటి. పసుపు పార్టీపై వైసీపీ పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శిస్తోందంటున్న విశ్లేషకులు.. జగన్ దూకుడుకు టీడీపీ బెంబేలెత్తిపోతోందని అభిప్రాయపడుతున్నారు.
పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురవడంతో డీలాపడిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. వైసీపీ పెంచిన దాడి తీవ్రతతో ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడి నుంచి మొదలు పెడితే.. నిన్నటి ధూలిపాళ్ల వరకు ఐదారుగురు నేతలు టార్గెట్ అయ్యారు. వీరిలో కొందరు జైలుకు వెళ్లినవారి జాబితాలో చేరిపోయారు.
అయితే.. టీడీపీ నేతలు పాతపాటే పాడుతున్నారు. అనుకూల మీడియా కూడా అవే కథనాలు ప్రసారం చేస్తోంది. తమను టార్గెట్ చేశారని, రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోందని అంటున్నారు. ఆయన జైలుకు వెళ్లొచ్చాడు కాబట్టి.. వీళ్లను కూడా జైలుకు పంపించాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంతకు మించి మరేమీ చేయలేకపోతున్నారు.
అటు వైసీపీ నేతలు మాత్రం ఆధారాల్లేకుండా అరెస్టులు చేయట్లేదని చెబుతున్నారు. వాళ్ల అవినీతి ఆధారంగానే కేసులు నమోదవుతున్నాయని అంటున్నారు. అవినీతి జరుగుతుంటే.. చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు. అందుకే.. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతోందని చెబుతున్నారు. అయితే.. ఇలా ఎంతదాకా వెళ్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకూ జరిగింది సరే.. రేపు ఇంకా ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయన్నదే టీడీపీ శ్రేణులను తీవ్రంగా కలవరపెడుతోంది. అయితే.. ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన వాటన్నింటికీ.. బదులు తీర్చుకునే ప్రయత్నం కొనసాగుతోందని అంటున్నారు. అయితే.. టీడీపీ నేతలపై ఉన్న ఆరోపణలు వైసీపీ చేతికి దండాన్ని అందిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
ఇంకా మూడేళ్ల కాలం జగన్ చేతిలో ఉంది. అప్పటి వరకూ టీడీపీ శ్రేణులు చూస్తూ కూర్చోవడం.. టార్గెట్ చేస్తున్నారని అనడం మినహా.. చేయగిలిగింది ఏమీ కనిపించట్లేదు. రాబోయే మూడు సంవత్సరాల్లో రాజకీయంగా టీడీపీని సాధ్యమైనంత మేర దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ కాలంలో.. ఇంకా ఎంత మంది నేతలు జైలు పాలు కావాల్సి వస్తుందోననే ఆందోళన పార్టీ నేతలను వేధిస్తోంది. చివరకు పెద్ద తలకాయలతోనూ ఊచలు లెక్కపెట్టించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరి, ఏం జరుగుతుందన్న దానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.