IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కష్టాలు కొనసాగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైన ముంబై జట్టు, తాజాగా అహ్మదాబాద్‌లో శనివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓటమి చవిచూసి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూ.12 లక్షల జరిమానా విధించింది. ప్రస్తుత సీజన్‌లో ఇలాంటి జరిమానాను ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఇదిలా ఉండగా, గత సీజన్ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోవలసి వచ్చింది. దాంతో హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు గుజరాత్ మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్యాపై జరిమానా పడటం గమనార్హం.
Also Read : ఐపీఎల్‌లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన ప్లేయర్లు వీరే
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ చేసిన తొలి తప్పిదం ఇది కావడంతో, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధించామని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్త ఐపీఎల్ నిబంధనల ప్రకారం, స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే ఆ జట్టు కెప్టెన్‌పై వేటు పడదు. అయితే, అతడికి జరిమానా విధించడంతో పాటు డీమెరిట్, సస్పెన్షన్ పాయింట్లను కేటాయిస్తారు.
గత సీజన్ చివరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యా ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడలేకపోయాడు. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో ముంబై ఆడిన చివరి మ్యాచ్‌లో ఇది జరిగింది. అప్పటికే రెండుసార్లు స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యా జరిమానా ఎదుర్కొన్నాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్, లక్నోతో ఆడిన మ్యాచ్‌లలో పాండ్యాకు వరుసగా రూ.12 లక్షలు, రూ.24 లక్షల జరిమానా పడింది. ఇక లక్నోతో జరిగిన రెండో మ్యాచ్ అనంతరం మళ్లీ పాండ్యాకు జరిమానా పడడంతో పాటు ఒక మ్యాచ్ నిషేధం కూడా ఎదుర్కోవలసి వచ్చింది. అప్పటికే ఆ సీజన్‌లో ముంబై అన్ని మ్యాచ్‌లు ముగియడంతో, ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో అతను నిషేధం కారణంగా ఆడలేకపోయాడు. ఈ సీజన్ ఆరంభంలోనే హార్దిక్ స్లో ఓవర్ రేట్‌కు పాల్పడటం చూస్తుంటే, రాబోయే మ్యాచ్‌లలో అతను ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తాడో చూడాల్సి ఉంది.
Also Read : ఇండియా తరుపున హిట్ మ్యాన్.. ముంబై తరుఫున ఫ్లాప్ మ్యాన్