IPL 2024 : వెంట్రుకవాసిలో రనౌట్.. శభాష్ సంజూ.. ధోనిని గుర్తుకు తెచ్చావ్

ఈ మ్యాచ్లో పంజాబ్ ఆటగాడు లివింగ్ స్టోన్ ను సంజు నో లుక్ విధానంలో రనౌట్ చేశాడు. సాధారణంగా ఇలాంటి పద్ధతిని మహేంద్ర సింగ్ ధోని అవలంబిస్తాడు. క్లిష్ట సమయంలో రనౌట్ చేయాలనుకున్నప్పుడు ధోని వికెట్ల వైపు చూడకుండానే బంతితో వాటిని గిరాటేస్తాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 14, 2024 10:40 am

IPL 2024: Sanju Samson

Follow us on

IPL 2024 : ధ్వని వేగంతో స్టంప్ అవుట్ చేయడం.. వాయువేగంతో రనౌట్ చేయడం.. మెరుపు వేగంతో క్యాచ్ లు పట్టడం.. ఈ ఉపమానాలు చదువుతుంటే ఎవరు గుర్తుకు వస్తారు? ఇంకెవరు “తల” మహేంద్ర సింగ్ ధోని.. అతడి కీపింగ్, వికెట్ల వెనుక అడ్డుగోడలా ఉండే విధానం.. ఈ తరానికి స్ఫూర్తి పాఠం. శనివారం రాత్రి పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్, వికెట్ కీపర్ సంజు సాంసన్.. ధోనిని గుర్తుకు తెచ్చాడు. అద్భుతమైన కీపింగ్ తో శభాష్ అనిపించాడు.

ఈ మ్యాచ్లో పంజాబ్ ఆటగాడు లివింగ్ స్టోన్ ను సంజు నో లుక్ విధానంలో రనౌట్ చేశాడు. సాధారణంగా ఇలాంటి పద్ధతిని మహేంద్ర సింగ్ ధోని అవలంబిస్తాడు. క్లిష్ట సమయంలో రనౌట్ చేయాలనుకున్నప్పుడు ధోని వికెట్ల వైపు చూడకుండానే బంతితో వాటిని గిరాటేస్తాడు. వికెట్లపై, బంతిపై ఎంతో స్పష్టమైన అవగాహన ఉంటే తప్ప అలా చేయడం కష్టం. అయితే అలాంటి పద్ధతినే శనివారం రాత్రి సంజు చేసి చూపించాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పంజాబ్ ఇన్నింగ్స్ నేపథ్యంలో రాజస్థాన్ బౌలర్ యజువేంద్ర చాహల్ 18 వ ఓవర్ వేశాడు. ఇందులో భాగంగా 5 బంతిని ఫుల్ టాస్ వేశాడు.. స్ట్రైకర్ గా ఉన్న ఆశుతోష్ శర్మ డీప్ మిడ్ వికెట్ దిశగా బంతిని కొట్టాడు. అయితే లివింగ్ స్టోన్ డబుల్ రన్ కోసం ప్రయత్నించాడు. అయితే ఫీల్డర్ బంతిని అందుకోవడం చూసిన అశుతోష్ శర్మ రెండో పరుగు కోసం నిరాకరించాడు. దీంతో మధ్య మైదానం వరకు వచ్చిన లివింగ్ స్టోన్ వెంటనే వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని తనుష్కోటియన్ త్రో వేయగా.. సంజు అద్భుతంగా అందుకున్నాడు. వికెట్ల వైపు చూడకుండానే దానిని విసిరేశాడు. ఆ బంతి నేరుగా వికెట్లను తగలడంతో లివింగ్ స్టోన్ వెంట్రుక వాసి తేడాలో అవుట్ అయ్యాడు. ధోని తరహాలోనే వికెట్ల వైపు చూడకుండానే సంజు బంతిని విసిరి వేశాడు.

లిప్తపాటు కాలంలో లివింగ్ స్టోన్ ను సంజు రనౌట్ చేయడం పట్ల రాజస్థాన్ అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఈ రనౌట్ పంజాబ్ జట్టు కొంపముంచింది. అప్పటిదాకా దూకుడుగా ఆడిన లివింగ్ స్టోన్ ఇంకా కొంచెం సేపు క్రీజులో ఉంటే పంజాబ్ భారీ స్కోరు చేసి ఉండేదేమో. దురదృష్టవశాత్తు అతడు రనౌట్ కావడంతో పంజాబ్ ఆశలు గల్లంతయ్యాయి.