IPL 2024 : ఈ సీజన్లో ఢిల్లీ ప్రయాణం పడి లేచిన కెరటంలాగా కొనసాగుతోంది.. మొదట్లో వరుస ఓటములు ఎదుర్కొన్న ఆ జట్టు.. కీలకమైన ప్లే ఆఫ్ దశ ముందు బొక్కాబోర్లా పడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ 17వ సీజన్లో 12 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ .. ఆరింట్లో గెలిచింది. ప్లే ఆఫ్ వెళ్లాలంటే మిగిలిన రెండు మ్యాచ్లను ఢిల్లీ గెలవాలి. ఆదివారం బెంగళూరు తో, మంగళవారం లక్నోతో ఢిల్లీ జట్టు తలపడాలి. ఇంతటి కీలక సమయంలో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కు ఐపీఎల్ నిర్వాహకులు కోలుకోలేని షాకిచ్చారు. ఏకంగా ఒక మ్యాచ్ నిషేధం విధించారు. దీంతో ఆదివారం బెంగళూరు జట్టుతో జరిగే మ్యాచ్ లో రిషబ్ పంత్ ఆడే అవకాశం కోల్పోయాడు.
ప్లే ఆఫ్ చేరుకోవాలంటే ఢిల్లీ జట్టు కచ్చితంగా గెలవాలి. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ దూరం కావడం.. ఢిల్లీ జట్టుకు కోలుకోలేని దెబ్బ. పంత్ దూరమైన నేపథ్యంలో ఢిల్లీ జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారు అనేది సస్పెన్స్ గా మారింది. స్లో ఓవర్ రేట్ కారణంగానే రిషబ్ పంత్ నిషేధం ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఢిల్లీ జట్టు ఈ సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ కొనసాగించింది.
ఇటీవల రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఆ జట్టు స్లో ఓవర్ రేట్ కొనసాగించింది. ఐపీఎల్ నిబంధనలు అతిక్రమించిన ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కు 30 లక్షల జరిమానా తో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా ఐపీఎల్ నిర్వాహక కమిటీ ప్రకటించింది.. దీంతో ఆదివారం బెంగళూరు జట్టుతో జరిగే మ్యాచ్ కు రిషబ్ పంత్ నాయకత్వం వహించే అవకాశం లేకుండా పోయింది.
రోడ్డు ప్రమాదానికి గురై.. సంవత్సరంన్నర పాటు రిషబ్ పంత్ మైదానానికి దూరమయ్యాడు. గోడకు కొట్టిన బంతిలాగా తనను తాను ఆవిష్కరించుకున్నాడు. చివరికి ఐపీఎల్ 17వ సీజన్ ద్వారా మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టాడు. తన అనితర సాధ్యమైన బ్యాటింగ్ ద్వారా రేసులో లేని ఢిల్లీ జట్టును ప్లే ఆఫ్ ముందుకు తీసుకొచ్చాడు. అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్ లో అదరగొట్టాడు. 12 మ్యాచ్లలో 156 స్ట్రైక్ రేట్ తో 413 పరుగులు చేశాడు. ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు మరొకరు లేరంటే.. అతడి ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు ఐదవ స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం బెంగళూరు, మంగళవారం గుజరాత్ జట్లతో జరిగే మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ వెళ్లాలని ఢిల్లీ భావిస్తోంది. కీలకమైన ఈ దశలోనే రిషబ్ పంత్ నిషేధానికి గురికావడం ఢిల్లీ జట్టుకు కోలుకోలేని దెబ్బ అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. రిషబ్ పంత్ పై నిషేధం విధించిన నేపథ్యంలో కొత్త కెప్టెన్ గా అక్షర్ పటేల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నియమించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో అక్షర్ పటేల్ సిద్ధహస్తుడు.