IPL 2024 – RCB vs CSK : కేజీఎఫ్ – 1 సినిమా చూశారా.. అందులో హీరో రాఖీ.. నారాచీలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా పరిస్థితులు మారిపోతాయి. చివరికి గరుడను చంపి.. ఆ ప్రాంతానికి సుల్తాన్ అవుతాడు.. సరిగ్గా.. కేజీఎఫ్ పుట్టుకకు కారణమైన బెంగళూరు కూడా ఐపీఎల్ లో అలాగే ఆడుతోంది. ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్లలో ఏడు ఓటములు ఎదుర్కొంది. ” గాయపడ్డ బెబ్బులి నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది” అనే మాటను నిజం చేసి చూపిస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచి తన సత్తా ఏమిటో చాటుతోంది.. సరిగ్గా 2016లో ఎలా అయితే ఆడిందో.. అలాంటి ఆటను మరోసారి బెంగళూరు తన అభిమానులకు రుచి చూపిస్తోంది.. ఆ సీజన్ లో మొదటి ఏడు మ్యాచ్లలో బెంగళూరు కేవలం రెండు మాత్రమే గెలిచింది.. ఆ తదుపరి ఏడు మ్యాచ్లలో ఆరు విజయాలు అందుకొని.. ప్లే ఆఫ్, ఫైనల్ వెళ్ళింది.. ఫైనల్ లో ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది.
ఆరంభంలో అధ్వానం..
ఈ సీజన్ లోక్ బెంగళూరు ఆట తీరు అత్యంత అధ్వానంగా ఉంది. తొలి స్పెల్ లో 8 మ్యాచ్లు ఆడితే.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ క్రమంలో బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్లాలంటే కచ్చితంగా మిగతా అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ జట్టు వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది. కచ్చితంగా ప్లే ఆఫ్ వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్లో, చెన్నై పై విజయం సాధించింది. అయితే బెంగళూరు ఈ స్థాయిలో గేమ్ చేంజర్ కావడానికి ప్రధాన కారణం ఆ జట్టు ఆటగాళ్లు తమను తాము ఆవిష్కరించుకున్న తీరు..
అప్పటినుంచి ఆట మారింది
హైదరాబాద్ జట్టు 288 పరుగులు చేసినప్పుడు.. చేజింగ్ లో బెంగళూరు ఆటగాళ్లు 262 రన్స్ చేశారు. ఇక అప్పటి నుంచి వారు తమ తదుపరి మ్యాచ్లలో 11.37 రన్ రేట్ ను కొనసాగిస్తున్నారు.. మొదటి ఆరు మ్యాచులలో వారి రన్ రేట్ 8.94 గానే ఉండేది. బెంగళూరు రన్ రేట్ పెరగడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2016లో అతడు ఏకంగా 973 రన్స్ చేశాడు. అప్పట్లో 4 సెంచరీలు కూడా బాదాడు. ఇప్పటికీ ఆ రికార్డులు అలాగే ఉన్నాయి.. అయితే ఆ పరుగులకు ఈ సీజన్లో అతడు దూరంగా ఉన్నప్పటికీ.. ఆరెంజ్ క్యాప్ విభాగంలో ముందు వరుసలో ఉన్నాడు. ఇక ఇటీవలి వరుస ఐదు మ్యాచ్లలో బెంగళూరు విజయం సాధించగా.. అందులో విరాట్ కోహ్లీ బ్యాట్ తో వీర విహారం చేశాడు. తన చివరి ఏడు మ్యాచ్లలో 193 స్ట్రైక్ రేట్ ను కొనసాగించాడు.. ఈ ఐపిఎల్ సీజన్లో అతని మొత్తం పవర్ ప్లే స్ట్రైక్ రేట్ 163 గా ఉందంటే.. బ్యాటింగ్ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.. అయితే ఇంతలా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ స్పిన్ బౌలింగ్ వచ్చేసరికి.. తేలిపోతాడని విరాట్ కోహ్లీపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే అతడు వాటికి తన బ్యాటింగ్ తోనే సమాధానం చెప్పాడు. ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్లలో స్పిన్ బౌలర్ల బౌలింగ్లో విరాట్ కోహ్లీ ఆడినప్పుడు అతని స్ట్రైక్ రేట్ 123. 57 గా ఉండేది. ఆ తర్వాత దానిని తదుపరి నాలుగు మ్యాచ్లలో అతడు167.69కి పెంచుకున్నాడు. ధర్మశాలలో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 47 బంతుల్లో 92 పరుగులు చేసిన తర్వాత కోహ్లీ మాట్లాడాడు..” ఇది నా బ్యాటింగ్ లో వృద్ధికి సంబంధించిన ప్రక్రియ. నేను స్పిన్నర్ లను దీటుగా ఎదుర్కొనేందుకు సరికొత్త స్లాగ్ స్వీప్ ను తెరపైకి తీసుకొచ్చాను. గతంలో నేను ఈ ఆటను ఆడాను. ఇప్పుడు ప్రాక్టీస్ చేయకుండానే తెరపైకి తీసుకొచ్చానని” కోహ్లీ వ్యాఖ్యానించాడు.
వారిని పక్కన పెట్టిన తర్వాత..
ఇక బెంగళూరు వరుస విజయాలు సాధించడం వెనక అనేక కారణాలు ఉన్నాయి.. అందులో ప్రధానమైనది గ్లెన్ మ్యాక్స్ వెల్ ను పక్కన పెట్టడం.. ఎందుకంటే అతడు తన మొదటి ఆరు మ్యాచ్లలో 32 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో జట్టు మేనేజ్మెంట్ అతని పక్కన పెట్టింది. ఆ తర్వాత విల్ జాక్స్ కు అవకాశం కల్పించింది. జట్టు మేనేజ్మెంట్ కల్పించిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. కోల్ కతా తో జరిగిన మ్యాచ్లో 32 బంతుల్లో 55 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో రజత్ పాటిదర్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఆకట్టుకుంది.. వీరిద్దరూ తమ బ్యాటింగ్ ద్వారా మిడిల్ ఆర్డర్ అంటే ఎలా ఉండాలో చేతల్లో చూపించారు.. ఆ తర్వాత రజత్ తదుపరి మ్యాచ్లలో అద్భుతంగా ఆడటం మొదలుపెట్టాడు. ఏకంగా ఐదు అర్థ సెంచరీలు చేసి, బెంగళూరు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఐతే జాక్స్ .. పాటి దార్ లాగా రాణించలేకపోయినప్పటికీ.. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఆ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు. చివరికి జాతీయ జట్టు కోసం ఆడేందుకు ఇంగ్లాండు వెళ్లిపోయాడు. ఫలితంగా చెన్నై జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్ కు అతడు దూరమయ్యాడు.
వారి వంతు పాత్ర పోషిస్తున్నారు
ఫాఫ్ డూ ప్లెసిస్, గ్రీన్, దినేష్ కార్తీక్.. వంటి వారు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అందువల్లే బెంగళూరు వరుస విజయాలు సాధిస్తోంది. ఇక బౌలింగ్ భాగంలో మహమ్మద్ సిరాజ్ తన పూర్వపు లయను అందుకున్నాడు. సీజన్ ప్రారంభంలో ఆడిన ఎనిమిది మ్యాచ్లలో అతడు 10.8 ఎకానమీ రేట్ కొనసాగించాడు. ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. అయితే ఒక మ్యాచ్ కు అతడిని దూరం పెట్టడంతో.. తన బౌలింగ్ లైను మార్చుకున్నాడు.. చివరి ఐదు మ్యాచ్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి ఎకానమీ రేట్ ను తగ్గించడమే కాకుండా.. వికెట్లు కూడా పడగొట్టడం మొదలుపెట్టాడు. సిరాజ్ గత ఐదు మ్యాచ్లలో 7 వికెట్లు తీశాడు. సిరాజ్ మాత్రమే కాదు మిగతా బౌలర్లు కూడా తమ పూర్వపు లయను అందుకున్నారు. అందువల్లే బెంగళూరు చివరి ఐదు మ్యాచ్లలో 41 వికెట్లు పగడగొట్టింది. వారి సగటు కూడా 20.5 తో అత్యుత్తమంగా ఉంది. అత్యుత్తమమైన బౌలింగ్ జాబితాలో కోల్ కతా 14 స్ట్రైక్ రేట్ తో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
స్పిన్ బౌలర్లు కూడా..
బౌలింగ్ మారినప్పటికీ.. బెంగళూరు జట్టు పేస్ బౌలర్ల మీదే ఆధారపడుతోంది. ఎందుకంటే మాయాంక్ డాగర్, కర్ణ శర్మ, మ్యాక్స్ వెల్ వంటి వారు సత్తా చాట లేకపోవడంతో.. జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో బెంగళూరు 33 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ ను ఆశ్రయించాల్సి వచ్చింది. అతడు గత సీజన్లో లక్నో జట్టు తరఫున రెండు మ్యాచ్లు ఆడినా, వికెట్లు ఏమి తీయలేకపోయాడు. అయితే హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో స్వప్నిల్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. మార్క్రం, క్లాసెన్ ను అవుట్ చేశాడు. యశ్ దయాళ్, గ్రీన్ వంటి వారు కూడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు.. ముఖ్యంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో యశ్ దయాళ్ 20 పరుగులకు మూడు వికెట్లు తీశాడు..గ్రీన్ 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు. వారి బౌలింగ్ ప్రదర్శన ఢిల్లీపై బెంగళూరుకు విజయాన్ని మాత్రమే కాదు, నెట్ రన్ రేట్ పెరుగుదలలోనూ ఉపకరించింది. ఇలా బెంగళూరు జట్టు తన ఆట తీరు మార్చుకోవడంతో.. ఏకంగా ప్లే ఆఫ్ వెళ్లిపోయింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Ipl 2024 rcb royal challengers bangalore bounce back after seven straight losses to reach playoffs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com