RR Vs MI IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠ గా సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం మరో రసవత్తర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. జైపూర్ వేదికగా రాజస్థాన్, ముంబై జట్లు తలపడునున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ జట్టు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు అద్భుతమైన విజయాలతో సత్తా చాటుతోంది. మరోవైపు ముంబై జట్టు ప్రయాణం కింద, మీద పడుతూ సాగుతోంది. అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ జట్టు ఆశించినత స్థాయిలో సత్తా చాటడం లేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ రాజస్థాన్ కంటే ముంబై జట్టుకు అత్యంత ముఖ్యంగా మారింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిస్తేనే ముంబై జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి.
ముంబై
ముంబై జట్టు బ్యాటింగ్ లైనప్ బాగున్నప్పటికీ.. కీలక సమయాల్లో ఆ జట్టు ఆటగాళ్లు ఆశించినత స్థాయిలో ఆడటం లేదు. రోహిత్ శర్మ, కిషన్ పర్వాలేదనిపిస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ స్థిరమైన ఇన్నింగ్స్ ఆడటం లేదు. నిలబడితే హాఫ్ సెంచరీ, లేకుంటే డక్ ఔట్ అన్నట్టుగా అతని ఆట తీరు సాగుతోంది. తిలక్ వర్మ, నమన్ ధార్ కుదురుకోలేకపోతున్నారు. హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్ ఆశించినంత స్థాయిలో ప్రదర్శన కొనసాగించలేకపోతున్నారు. ఇక బౌలింగ్లో ఆకాష్ మద్వాల్, కోయేట్జీ మెరుగ్గా బంతులు వేయలేకపోతున్నారు. రోమారియో షెఫర్డ్ సత్తా చాటాల్సి ఉంది. బుమ్రా మాత్రమే పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో ముంబై జట్టు వీక్ గా ఉంది. దీనిని సరిదిద్దుకున్న దానిపైనే ఈ మ్యాచ్లో విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
రాజస్థాన్
ఈ టోర్నీలో అప్రతిహతంగా దూసుకుపోతోంది ఈ జట్టు. కెప్టెన్ సంజు సాంసన్, జోస్ బట్లర్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. రియాన్ పరాగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.. దీంతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ భాగంలో యజువేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్డ్ కీలకంగా ఉన్నారు. ప్రత్యర్థి ఆటగాళ్లను తమ పదునైన బంతులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ రాజస్థాన్ సమష్టి ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో ముంబై పై జరిగే మ్యాచ్ లోనూ అదే స్థాయిలో ఆడాలని భావిస్తోంది. అయితే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో కొంతమంది పై మాత్రమే కాకుండా.. మిగతావారు కూడా టచ్ లోకి రావాలని జట్టు భావిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్, కేశవ్ మహారాజ్, బర్గర్, కులదీప్ సేన్ వంటి ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ జట్లు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో 12సార్లు రాజస్థాన్, 16 సార్లు ముంబై జట్టు గెలిచింది. ట్రాక్ రికార్డు పరంగా ముంబై ముందు వరసలో ఉంది. అయితే సోమవారం నాటి మ్యాచ్ లో ఎటువంటి ఫలితం వస్తుందో చూడాల్సి ఉంది.
జట్ల అంచనా ఇలా
రాజస్థాన్
సంజు (కెప్టెన్), రియాన్ పరాగ్, యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, శుభం దుబె, పావెల్, హిట్మేయర్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, జోస్ బట్లర్.
ముంబై
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, బుమ్రా, తిలక్ వర్మ, నమన్ ధార్, సూర్య కుమార్ యాదవ్, పీయూష్ చావ్లా, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్.
గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలిచేందుకు 52, ముంబై గెలిచేందుకు 48 శాతం అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.