IPL 2024 PBKS Vs DC: ఇదేం బ్యాటింగ్ రా నాయన.. ఒక్క ఓవర్ లో 25 పరుగులా?

శనివారం ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా చండీగఢ్ లో పంజాబ్, ఢిల్లీ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు 19 ఓవర్ వరకు 149 పరుగులు చేసింది. ఎనిమిది టికెట్లు కోల్పోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 23, 2024 6:54 pm

IPL 2024 PBKS Vs DC

Follow us on

IPL 2024 PBKS Vs DC: సుడిగాలి అనాలా? దూకుడు అనాలా? బీభత్సం అనాలా? దానికి ఏం పేరు పెడతారో తెలియదు గాని.. అతడు ఆడిన ఇన్నింగ్స్ మాత్రం న భూతో.. న భవిష్యత్.. బ్యాట్ తో శివతాండవం ఆడాడు. మైదానంలో చెలరేగిపోయి ఆడాడు. కుదిరితే సిక్స్.. లేకుంటే ఫోర్ అన్నట్టుగా అతడు బ్యాట్ తో బంతిపై దండయాత్ర చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ జట్టు స్కోరు పరుగులు పెట్టింది. దీంతో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు సరికొత్త క్రీడా అనుభూతి కలిగింది. ఒకే ఓవర్ లో ఆటగాడు 25 పరుగులు పిండుకోవడంతో ఆ బౌలర్ తన పేరు మీద అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఆరు బంతుల్లో చివరి బంతికి సింగిల్ తీశాడు కాబట్టి సరిపోయింది. ఆ బంతిని ఫోర్ లేదా సిక్స్ గా మలచి ఉంటే ఏకంగా 30కి దగ్గర దగ్గరగా పరుగులు వచ్చేవి.

శనివారం ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా చండీగఢ్ లో పంజాబ్, ఢిల్లీ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు 19 ఓవర్ వరకు 149 పరుగులు చేసింది. ఎనిమిది టికెట్లు కోల్పోయింది.. చివరి ఓవర్ లో మహా అయితే 160 పరుగులు చేస్తుంది కావచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ స్ట్రైకర్ గా ఉన్న అభిషేక్ పోరెల్ మాత్రం గట్టిగా బాదాలని అనుకున్నాడు.. అదే దిశగా బ్యాట్ తో కసితీరా బాదుడు మొదలుపెట్టాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో.. మొదటి బంతిని ఫోర్ గా మలిచాడు. రెండవ బంతిని భారీ సిక్సర్ కొట్టాడు. మూడవ బంతిని ఫోర్ గా మళ్ళించాడు. నాలుగో బంతిని మళ్ళీ ఫోర్ కొట్టాడు. ఐదవ బంతిని సిక్సర్ గా మలిచాడు. చివరి బంతిని హర్షల్ తెలివిగా వేయడంతో సింగిల్ మాత్రమే వచ్చింది. మొత్తానికి ఒక్క ఓవర్ లో అభిషేక్ పొరెల్ ఢిల్లీ రాతను మార్చేశాడు.. 25 పరుగులు రావడంతో ఢిల్లీ స్కోరు 174కు చేరుకుంది.

అంతకుముందు ఢిల్లీ బ్యాటింగ్ ఆశించినంత స్థాయిలో దూకుడుగా మొదలు కాలేదు. హోప్(33), పారెల్(32), వార్నర్(29),అక్షర్ పటేల్ (21) మాత్రమే రాణించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రిషబ్ పంత్ (18) నిరాశపరచాడు. ఇక పంజాబ్ బౌలర్లలో ఆర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. రబాడా, బ్రార్, చాహర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. 175 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు 1.2 ఓవర్లకు 24 పరుగులు చేసింది.. శిఖర్ ధావన్ 13, బెయిర్ స్టో 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.