IPL 2024 : అనుమానాలు పటాపంచలయ్యాయి. ఊహగానాలు చెల్లాచెదురయ్యాయి. విశ్లేషణలు గాలికి కొట్టుకుపోయాయి. కలవరు, కలవడానికి అవకాశం లేదు, ముంబై జట్టుకు కష్ట కాలమే, ఐపీఎల్ గెలవలేదు, పోటీలో నిలవలేదు.. ఇన్ని పుకార్ల షికార్ల మధ్య.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కలిసిపోయారు. బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు.. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాలను ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
వాస్తవానికి ముంబై ఇండియన్స్ జట్టు ఆట తీరు గత రెండు సీజన్లలో ఏమాత్రం బాగోలేదు. ఆ రెండు సీజన్లు మినహాయిస్తే దాదాపు ఐదుసార్లు ముంబై ఇండియన్స్ జట్టు ఐపిఎల్ విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ ఆధ్వర్యంలో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది. రోహిత్ శర్మ సీనియర్ కావడం, గత రెండు సీజన్లలో జట్టు ఆట తీరు బాగా లేకపోవడంతో.. మేనేజ్మెంట్ దీనిపై సీరియస్ గా దృష్టి సారించింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టును ఆరంభ సీజన్లోనే హార్దిక్ పాండ్యా విజేతగా ఆవిర్భవించేలా చేశాడు. గత ఏడాది రన్నరప్ గా నిలిపాడు.
ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పై ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం సంప్రదింపులు జరిగింది. అతడు కూడా ఒకప్పుడు ముంబై జట్టుకు ఆడిన వాడే. రోహిత్ ఆధ్వర్యంలో నడిచిన వాడే. కానీ ముంబై జట్టుతో ఏర్పడిన చిన్న విభేదాల వల్ల అతడు గుజరాత్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లినా అతని మనసు మొత్తం ముంబై జట్టు చుట్టే తిరిగింది. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం తనతో సంప్రదింపులు జరపడం.. దానికి హార్దిక్ పాండ్యా ఓకే అనడంతో.. ముంబై జట్టుకు కొత్త కెప్టెన్ గా అతడు వచ్చాడు. ఇది సహజంగానే రోహిత్ శర్మకు నచ్చలేదు. తన అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశాడు. తర్వాత ఆ పోస్ట్ డిలీట్ చేశాడు. అతడి భార్య రితిక మాత్రం తన భర్తకు కావాలని అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది. మరోవైపు హార్థిక్ పాండ్యా కెప్టెన్ గా రావడం ముంబైలోని కొంతమంది ఆటగాళ్లకు నచ్చలేదు. వారు కూడా తమ అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కారు.
ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ముంబై జట్టు వెనక్కి తగ్గలేదు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ నుంచి తొలగించేది లేదన్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. కోచ్ మార్క్ బౌచర్ తో కలిపి విలేకరుల సమావేశం నిర్వహించింది. ఆ సందర్భంలో హార్దిక్ పాండ్యా “నేను ఇంతవరకు రోహిత్ శర్మతో మాట్లాడలేదని” వ్యాఖ్యానించాడు. దీంతో ఒక్కసారిగా రోహిత్ అభిమానులు రెచ్చిపోయారు. సోషల్ మీడియా వేదికగా హార్దిక్ పాండ్యాను విమర్శించారు.
ఇన్ని పరిణామాల మధ్య హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్ గా విజయవంతమవుతాడా? చీలికలు, పీలికలుగా మారిన జట్టును ఎకతాటిపై నడుపుతాడా? అనే అనుమానాలు ఉండేవి. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ బుధవారం హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ కలిసి ప్రాక్టీస్ చేశారు. ఇద్దరూ సరదాగా సంభాషించుకున్నారు. హార్దిక్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. రోహిత్ శర్మ మైదానం నలుమూలలా ఎడా పెడా షాట్లు బాదాడు. దీంతో మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని వారిద్దరూ సంకేతాలు ఇచ్చారు. అటు రోహిత్ అభిమానులే హార్దిక్ ను విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారు. వారిద్దరూ కలిసిపోయిన తర్వాత ఇప్పుడు వారు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో? అందుకే అంటారు అభిమానం తలకు ఎక్కకూడదని..
ROHIT SHARMA HARDIK PANDYA.
– A beautiful moment at Wankhede.pic.twitter.com/GepZVS57si
— Johns. (@CricCrazyJohns) March 20, 2024