IPL 2024 GT Vs MI: Indian premier league 17వ సీజన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. శనివారం రాత్రి హైదరాబాద్, కోల్ కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన టీ -20 మజా అందించింది.. రసవత్తరంగా సాగిన ఆ మ్యాచ్ లో కోల్ కతా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ టెన్షన్ మ్యాచ్ ను మర్చిపోకముందే.. మరో హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఆదివారం రాత్రి జరిగే ఐదో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, ఐదు సార్లు ఛాంపియన్ ముంబై జట్టుతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ కోసం లక్షలాది మంది అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. గత సీజన్ వరకు గుజరాత్ జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించాడు. ప్రస్తుతం అతడు ఆ జట్టును వదిలిపెట్టి ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. గుజరాత్ కెప్టెన్ గా యువ ఆటగా శుభ్ మన్ గిల్ వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ రెండు జట్లు కూడా కొత్త కెప్టెన్ల ఆధ్వర్యంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమవుతుంది.
2022లో గుజరాత్ జట్టు ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన తొలి సంవత్సరంలోనే కప్ దక్కించుకుంది. గత ఏడాది రెండవసారి ఫైనల్ వెళ్ళింది. ఇదే సమయంలో గత రెండు సీజన్లలో ముంబై జట్టు దారుణమైన ఆటలు ప్రదర్శించింది. గత ఏడాది రెండవ క్వాలిఫైయర్ లో భాగంగా ముంబై జట్టును గుజరాత్ 62 పరుగుల తేడాతో మట్టికరిపించింది. గుజరాత్ జట్టుకు గిల్ కొత్త కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్లో అతడు 890 పరుగులు చేశాడు. ఈ సీజన్ లోనూ అదే స్థాయిలో ఆడేందుకు ప్రణాళికలు రూపొందించాడు. మరోవైపు గత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ముంబై జట్టులో ఒక ఆటగాడిగానే మిగిలిపోయాడు. అతడు కెప్టెన్సీ భారం నుంచి తొలగిపోయింది. దీంతో రోహిత్ ఈ మ్యాచ్లో మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. అతడికి ఏమాత్రం అవకాశం దొరికినా ఆకలిగొన్న పులిలాగా బౌలర్ల మీద విరుచుకుపడతాడు. సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టేస్తాడు. ఇక ముంబై ఇండియన్స్ జట్టులో మరో కీలక ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ కు ఇంకా నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి ఫిట్ నెస్ కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అతడు ఈ మ్యాచ్ ఆడేది ఒకింత అనుమానమే. తిలక్ వర్మ, కిషన్ వంటి వారి నుంచి ముంబై జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.
షమీ కి గాయం కావడంతో అతడు ఈ టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో గుజరాత్ జట్టు.. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు, 24 సంవత్సరాల అజ్మతుల్లా ఒమర్ జాయ్ ని తీసుకుంది. అతడు కొద్దిరోజుల క్రితం ఐర్లాండ్ జట్టుపై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 9 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు..గిల్ ఈసారి కెప్టెన్ గా ఉండడంతో.. మరింత ఒత్తిడి అతనిపై ఉండే అవకాశం ఉంది. మరి ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్లో అతడు ఆ ఒత్తిడిని ఎలా జయిస్తాడనేది చూడాల్సి ఉంది.
ఈ మైదానం పేస్ బౌలర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్ చెబుతున్నారు. ఇక్కడ స్పిన్నర్లకు పెద్దగా అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అలాంటప్పుడు రెండు జట్లు కూడా చెరో స్పిన్నర్ తోనే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ హై వోల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో గూగుల్ ఒక సర్వే నిర్వహించగా.. 56 శాతం మంది ముంబై గెలుస్తుందని.. 44 శాతం మంది గుజరాత్ విజయం సాధిస్తుందని తెలిపారు. అయితే మ్యాచ్ ఇలానే సాగుతుందని కచ్చితంగా చెప్పలేం.