Zomato: ఆ 20 గంటలు చుక్కలు కనిపించాయి.. లేకుంటే జొమాటో భవితవ్యం ఏమయ్యేదో?

వెజ్ ప్లీట్ విధానంలో భాగంగా కేవలం శాఖాహారాన్ని మాత్రమే సప్లై చేస్తామని జొమాటో ప్రకటించింది. ఫుడ్ డెలివరీ బాయ్స్ కోసం ప్రత్యేకంగా గ్రీన్ కలర్ యూనిఫామ్ కూడా ఇచ్చింది. ఇది వివాదానికి తెరలేపడంతో జొమాటో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 24, 2024 6:12 pm

Zomato

Follow us on

Zomato: “తిండికి కులాన్ని ఆపాదిస్తారా? మతాన్ని ముడిపెడతారా? మళ్లీ పురాతన చాందసవాదాన్ని మా నెత్తి మీద రుద్దుతారా? ఇదెక్కడి పద్ధతి? ఇదెక్కడి వ్యవహారం? సరికొత్తగా ఇప్పుడే దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి?” ఆ మధ్య జొమాటో ప్యూర్ వెజ్ ప్లీట్ ను తెరపైకి తీసుకువచ్చినప్పుడు.. ఒక సెక్షన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలే వినిపించాయి. ఆహారాన్ని వ్యాపార వస్తువుగా మార్చిన జొమాటో.. వెజ్ ప్లీట్ విధానం వల్ల ఇంతటి వివాదం చెలరేగుతుందని ఊహించి ఉండదు.. ఇంకేముంది పోటీ సంస్థలైన స్విగ్గి, ఊబర్ చంకలు గుద్దుకున్నాయి..జొమాటో కు మంచి పనయిందంటూ సంబరపడ్డాయి.. వివాదానికి కారణమైన వెజ్ ప్లీట్ పై జొమాటో సరికొత్త నిర్ణయం తీసుకుంది.

వెజ్ ప్లీట్ విధానంలో భాగంగా కేవలం శాఖాహారాన్ని మాత్రమే సప్లై చేస్తామని జొమాటో ప్రకటించింది. ఫుడ్ డెలివరీ బాయ్స్ కోసం ప్రత్యేకంగా గ్రీన్ కలర్ యూనిఫామ్ కూడా ఇచ్చింది. ఇది వివాదానికి తెరలేపడంతో జొమాటో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. గ్రీన్ కలర్ యూనిఫామ్ కాకుండా అందరికీ ఎరుపు రంగు దుస్తులు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది..వెజ్ ప్లీట్ ప్రారంభించేందుకు ముందు తాము ఎలాంటి కసరత్తు చేసామో జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ వివరించారు. ఒక వార్తా సంస్థతో ఆయన ఈ వివరాలు పంచుకున్నారు. ” ప్యూర్ వెజ్ ఫ్లైట్ ప్రారంభానికి ముందు మేము ఒక సర్వే నిర్వహించాం. జొమాటో నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు. మరిన్ని ఆర్డర్లు చేయాలంటే మీకు ఎలాంటి సౌకర్యాలు మేము కల్పించాలి” అని పలు ప్రశ్నలు సంధించారు. శాఖాహారుల కోసం ఏమైనా చేయండి అంటూ ఎక్కువమంది కస్టమర్లు సూచనలు చేశారు. దీనిపై సుదీర్ఘ కసరత్తు అనంతరం జొమాటో ప్యూర్ వెజ్ ప్లీట్ సేవలు ప్రారంభించింది. అయితే అది వివాదానికి కారణమైంది. ఒక సెక్షన్ ప్రజలు ప్యూర్ వెజ్ ప్లీట్ విధానాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ప్రారంభించారు. జొమాటోను ఏకిపారేయడం మొదలుపెట్టారు. “ఇలా తిండిని వర్గీకరించే బాధ్యత ఎవరిచ్చారంటూ” జొమాటోను విమర్శించడం ప్రారంభించారు.

విమర్శలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జొమాటో సంస్థ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.”వాస్తవానికి మా సంస్థలో సభ్యులకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. అలాంటి ఆలోచన రాలేదు. సోషల్ మీడియాలో వివాదం తలెత్తిన తర్వాతే అసలు విషయం అర్థమైందని”జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ అన్నారు. ప్యూర్ వెజ్ ప్లీట్ వివాదం నేపథ్యంలో 20 గంటల పాటు జొమాటో లోని ఉన్నత ఉద్యోగులతో సంస్థ అధిపతులు జూమ్ కాల్ లో మాట్లాడారు. అనేక రకాలుగా మంతనాలు జరిపారు. ఆ 20 గంటలు జొమాటో ఉన్నతాధికారులకు చుక్కలు కనిపించాయి.. అప్పుడు వారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సరిపోయింది.. లేకుంటే జొమాటో భవితవ్యం ఏమయ్యేదో? చివరికి ఆకుపచ్చ రంగు యూనిఫామ్ తొలగించాలనే నిర్ణయానికి వచ్చారు. ఎరుపు రంగు యూనిఫామ్ కొనసాగుతుందని ప్రకటించారు. అయితే దీని వెనక ఎటువంటి ఉద్దేశాలు లేవని, రాజకీయపరంగా, మతపరంగా ఎవరి ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. తమ సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.