Homeక్రీడలుRohit Sharma IPL 2023: భారత జట్టు భవిష్యత్తు ఆశా కిరణాలు ఆ ఇద్దరు ఆటగాళ్లు..!

Rohit Sharma IPL 2023: భారత జట్టు భవిష్యత్తు ఆశా కిరణాలు ఆ ఇద్దరు ఆటగాళ్లు..!

Rohit Sharma IPL 2023: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడిన తిలక్ వర్మ, నేహల్ వధేరా అద్భుతమైన ఆట తీరుతో అదరగొట్టారు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి కీలక ఇన్నింగ్స్ ఆడి మెరుగైన స్కోర్ చేసేలా చేశారు ఈ ఇద్దరు ఆటగాళ్లు. ఆటలో వేగంతోపాటు మంచి టెక్నిక్ ఉండడంతో భవిష్యత్తు భారత జట్టు ఆశాకిరణాలుగా కనిపిస్తున్నారనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి గురించి ఇండియా, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏంటో మీరు చూసేయండి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఇద్దరు యువ ఆటగాళ్లు అదరగొట్టారు. కీలక ప్లేయర్లు చేతులెత్తేసిన దశలో కూడా ఆ ఇద్దరు ఆటగాళ్లు అదరగొట్టడంతో ముంబై ఇండియన్స్ జట్టు అనేక మ్యాచ్ ల్లో విజయం సాధించింది. వాళ్లే తిలక్ వర్మ, నేహాల్ వధేరా. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల ప్రతిభను చూసిన ఎంతో మంది క్రికెటర్లు ఇండియా జట్టు తలుపు తడతారని, మంచి స్టార్లుగా ఎదుగుతారని ప్రశంసించారు. తాజాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు వీరిపై కురిపించాడు.

ఇండియా తరఫున స్టార్లుగా ఎదుగుతారన్న రోహిత్ శర్మ..

ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున అదరగొట్టిన తిలక్ వర్మ, నేహాల్ వధేరాకు మంచి భవిష్యత్తు ఉందని ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ తోపాటు టీమిండియా తరఫున స్టార్లుగా ఎదుగుతారని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ” బుమ్రా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు ఆడేందుకు మా జట్టు సహాయ బృందం ఎంతో శ్రమించింది. ఆ తరవాత వాళ్ళు సూపర్ స్టార్లుగా తయారయ్యారు. వారి బాటలోనే వీళ్ళిద్దరూ ఎదుగుతారు. వచ్చే రెండేళ్లలో వాళ్లు ముంబై ఇండియన్స్ కు మాత్రమే కాదు.. భారత జట్టు సూపర్ స్టార్స్ గా ఎదుగుతారు” అని రోహిత్ శర్మ వివరించాడు.

ఆ తరహా ఆటకు కాలం చెల్లిందన్న రోహిత్..

ఈ సందర్భంగా మాట్లాడిన రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓవర్లకు ఓవర్లు క్రీజులో నిలబడి ఇన్నింగ్స్ నిర్మించే యాంకర్ పాత్రకు టి20 క్రికెట్లో కాలం చెల్లిందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఈ రోజుల్లో టి20 క్రికెట్ ఆడుతున్న విధానం చూస్తుంటే యాంకర్ పాత్ర అవసరం లేదని స్పష్టం చేశాడు. ఒకవేళ 20 పరుగులకే మూడు వికెట్లు లేదా నాలుగు వికెట్లు పడితే అప్పుడు అవసరం ఉంటుందేమో అని వెల్లడించాడు. కానీ, ప్రతిరోజు అలా జరగదని, ఎప్పుడో ఒకసారి ఓ ఆటగాడు ఇన్నింగ్స్ నిర్మించి మంచి స్కోర్ తో ముగిస్తాడేమో కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. చాలా కాలం నుంచి ఈ ఫార్మాట్ ఆడుతున్నానని, ఇప్పుడు విభిన్నమైన ఆట తీరు ప్రదర్శించాలని చూస్తున్నానని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

RELATED ARTICLES

Most Popular