Homeక్రీడలుIPL 2023 Playoff Scenarios: ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ రెండు జట్లు నిష్క్రమించినట్టేనా.?

IPL 2023 Playoff Scenarios: ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ రెండు జట్లు నిష్క్రమించినట్టేనా.?

IPL 2023 Playoff Scenarios: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ లో దాదాపు అన్ని మ్యాచ్ లు హోరా హోరీగా సాగుతున్నాయి. ప్లే ఆప్స్ సమీపిస్తున్న కొద్ది అన్ని జట్లు తెగించి ఆడుతున్నాయి. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో అనేక జట్లు ఉండడంతో ధీటుగా పోరాడుతున్నాయి.

ఈ ఏడాది ఐపీఎల్ లో అనేక మ్యాచ్ లు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగాయి. గతానికి భిన్నంగా ఈ సీజన్ లో అనేక జట్లు 200కిపైగా భారీ స్కోర్లను అనేక సార్లు నమోదు చేశాయి. ప్లే ఆఫ్ దగ్గర పడుతున్న కొద్ది మ్యాచ్ లు మరింత ఆసక్తికరంగా సాగుతున్నాయి. పలు జట్లు ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నాయి. గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో రాజస్థాన్ రాయల్స్ చెలరేగిన తీరే దీనికి నిదర్శనం. 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు 13.1 ఓవర్లలోనే చేరుకొని ఘన విజయాన్ని సాధించింది. దీన్ని బట్టి చూస్తే ఆ జట్టు ఎంతగా చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు.

పూర్తిగా తడబడిపోయిన కోల్ కతా బ్యాటర్లు..

కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు తమ హోమ్ పిచ్ పై తడబడ్డారు. రాజస్థాన్ రాయల్స్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో ఘోరంగా విఫలం అయ్యారు బ్యాటర్లు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ అర్థ సెంచరీతో రాణించాడు. 57 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు లో పూర్తిగా చేతులెత్తేయడంతో ఆశించిన స్థాయిలో స్కోర్ చేయలేకపోయింది కోల్ కతా జట్టు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 13.1 ఓవర్లలోనే 151 పరుగులు చేసింది. ఒక్క వికెట్ నష్టానికి లక్ష్యాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్ మరోసారి అద్భుతంగా ఆడాడు. 62 బంతుల్లో ఐదు సిక్సులు, 12 ఫోర్లతో 98 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ సంజు సాంసన్ 48 పరుగులతో అతనికి తన వంతు సహకారాన్ని అందించాడు.

ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టతరం..

ఈ ఓటమి తరువాత కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు ఐదు శాతానికి క్షీణించాయి. 95 శాతం మేర ఆ జట్టు ఈ టోర్నమెంట్ నుంచి అవుట్ అయినట్టే. ఇప్పటి వరకు 12 మ్యాచ్ లను ఆడిన ఈ టీమ్.. ఏడు మ్యాచ్ ల్లో ఓడింది. ఐదు మ్యాచ్ ల్లో గెలిచి పది పాయింట్లుతో పాయింట్లు పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు మరో రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది. ఈ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, 20 న లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడాల్సి ఉంది కోల్ కతా. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఓడిపోయినా ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. చెన్నై స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలుస్తుందనే అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి.

నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకుంటే తప్ప అవకాశం లేనట్టే..

చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ పై భారీ తేడాతో నెగ్గి.. నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంటే తప్ప.. ప్లే ఆఫ్ కు చేరలేకపోవచ్చు కోల్ కతా నైట్ రైడర్స్. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దాదాపుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏడింటిలో ఓడింది. నాలుగు విజయాలతో ఎనిమిదో స్థానంలో పాయింట్ల పట్టికలో కొనసాగుతోంది. ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది ఆ జట్టు. పంజాబ్ కింగ్స్ తో రెండు, చెన్నై సూపర్ కింగ్స్ తో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. మిగిలిన అన్ని మ్యాచ్ ల్లో నెగ్గినప్పటికీ ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు దాదాపు లేనట్టే. భారీ తేడాతో నెగ్గడం, నెట్ రన్ రేట్ ను మెరుగుపరచుకోవడం పైనే ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్లే ఆప్స్ చేరే అవకాశాలు ఉన్న జట్ల జాబితాలో గుజరాత్ టైటాన్స్ టాప్ లో ఉంది. ఈ జట్టుకు ఉన్న ఛాన్సులు 99.6 శాతం. 98 శాతంతో రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. 61 శాతంతో ముంబై ఇండియన్స్ మూడో స్థానానికి చేరింది. రాజస్థాన్ రాయల్స్ 45 శాతంతో నాలుగో స్థానానికి చేరుకుంది. లక్నో జట్టు 43 శాతం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 22 శాతం, పంజాబ్ కింగ్స్ 14 శాతం, సన్రైజర్స్ హైదరాబాద్ 13 శాతం, కోల్ కతా నైట్ రైడర్స్ ఐదు శాతం, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు శాతాలతో ఈ లిస్టులో ఉన్నాయి. ఈ జాబితాలో చివర నుంచి ఒకటి రెండు స్థానాల్లో ఉన్న ఢిల్లీ, కేకేఆర్ జట్లు దాదాపు ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Exit mobile version