Akash Madhwal IPL 2023: ఇంజినీర్ క్రికెటర్ గా ఆకాష్ ఎలా ఎదిగాడు.. ముంబై బౌలర్ ప్రస్థానమిదీ

ఐపీఎల్ తాజా సీజన్ లో ఎలిమినేటర్ మ్యాచ్ లో సత్తా చాటింది ముంబై ఇండియన్స్ జట్టు. అద్భుతమైన ఆట తీరుతో లక్నో జట్టును చిత్తు చేసింది. ఈ విజయంలో ముంబై బౌలర్ ఆకాశ్ మద్వాల్ ది కీలకపాత్ర.

Written By: BS, Updated On : May 25, 2023 3:44 pm

Akash Madhwal IPL 2023

Follow us on

Akash Madhwal IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్ ఎలిమినేటర్ మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ తో అదరగొట్టాడు ఆకాశ్ మద్వాల్. బుల్లెట్ల అలాంటి బంతులను సంధించి లక్నో జట్టును ఓడించడంలో ఈ ముంబై బౌలర్ కీలక పాత్ర పోషించాడు. అతని క్రికెట్ ప్రస్థానం చూస్తే అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ముంబై జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించడంలో ఈ యంగ్ ప్లేయర్ పాత్ర ఎనలేనిది. ఈ యువ క్రికెటర్ జర్నీ ఏంటో చూసేద్దాం.

ఐపీఎల్ తాజా సీజన్ లో ఎలిమినేటర్ మ్యాచ్ లో సత్తా చాటింది ముంబై ఇండియన్స్ జట్టు. అద్భుతమైన ఆట తీరుతో లక్నో జట్టును చిత్తు చేసింది. ఈ విజయంలో ముంబై బౌలర్ ఆకాశ్ మద్వాల్ ది కీలకపాత్ర. కేవలం 5 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి సంచలన బౌలింగ్ చేశాడు ఈ యువ క్రికెటర్. దీంతో అందరి దృష్టి ఈ బౌలర్ పై పడింది. ఇంతకీ అతడు ఎవరు అని వెలికితీయగా మద్వాల్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.

ఐదేళ్ల కిందటి వరకు టెన్నిస్ బాల్ తోనే ప్రాక్టీస్..

ఐదేళ్ల కిందటి వరకు కేవలం టెన్నిస్ బాల్ తోనే ఆట ఆడాడు ఈ యువ క్రికెటర్. ఉత్తరాఖండ్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి అడుగుపెట్టిన తొలి బౌలర్ గా రికార్డు సృష్టించాడు. దేశవాళీ క్రికెట్ లో సుబ్ మన్ గిల్ వంటి బ్యాటర్లకు బంతులేసిన అనుభవం ఈ క్రికెటర్ సొంతం. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం మానేసి క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవడంపై బంధువులు నుంచి ఉచిత సలహాలు వచ్చాయి. అయినా, వాటిని లెక్క చేయకుండా దీన్నే కెరియర్ గా ఎంచుకుని రాణిస్తున్నాడు. రూర్కీలో 1993లో జన్మించిన ఆకాశ్ సివిల్ ఇంజనీరింగ్ ను పూర్తి చేశాడు. సాధారణంగా క్రికెటర్ కావాలని కోరుకుంటే చిన్నప్పటి నుంచే దానిని కెరీర్ గా స్వీకరిస్తారు. కానీ, ఆకాశ్ మాత్రం ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం చేసిన తర్వాత క్రికెటర్ గా మారాడు.

జాఫర్ చొరవతో అవకాశాలు అందిపుచ్చుకొని..

పాతికేళ్ల వయసులో ఆకాశ్ మద్వాల్ 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడేందుకు తొలిసారి ఉత్తరాఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ ఏడాదే ఉత్తరాఖండ్ కు ఆడే అవకాశం మొదటిసారి లభించింది. అప్పటి వరకు టెన్నిస్ బంతితోనే ఆడిన ఆకాశ్ తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే రెడ్ బాల్ ను చేతబట్టాడు. టీమిండియా మాజీ ఆటగాడు, ఉత్తరాఖండ్ కు కోచ్ గా పనిచేసిన వసీం జాఫర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రయిల్స్ లో పాల్గొనడం ఆకాశ్ కు కలిసి వచ్చింది. జాఫర్ చొరవ చూపించి మద్దతుగా నిలవడంతో తన సత్తా ఏంటో మద్వాల్ నిరూపించుకున్నాడు. దీంతో ఐపీఎల్ ఎంట్రీకి తలుపులు తెరుచుకున్నాయి.

మద్వాల్ ప్రదర్శన పట్ల ఆసక్తి చూపించిన ముంబై ఇండియన్స్..

కీలక ఆటగాళ్లను, ప్రతిభ కలిగిన క్రీడాకారులను తెచ్చుకోవడంపై దృష్టి సారించే ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. ఆకాశ్ మద్వాల్ ప్రదర్శనను గమనించింది. రూ.20 లక్షల రూపాయలకు సొంతం చేసుకుని అవకాశం కల్పించింది. గత ఏడాది సీజన్ లో ఒక్క మ్యాచ్ లోనూ ఆడలేక పోయాడు. ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా సూర్యకుమార్ గాయపడడంతో అతని స్థానంలో ఆకాశ్ జట్టులోకి వచ్చాడు. ఒక్క మ్యాచ్ ఆడకపోయినా నెట్ బౌలర్ గా నాణ్యమైన ప్రదర్శనతో యాజమాన్యం దృష్టిలో పడ్డాడు. ఈ సీజన్ లో బుమ్రా లేకపోవడంతో అవకాశం లభిస్తుందని భావించినప్పటికీ.. దక్కలేదు. కానీ, ఆర్చర్ కూడా దూరం కావడంతో ఛాన్స్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్న ఈ క్రికెటర్.. ఈ సీజన్లోనే ఇప్పటి వరకు అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్ లో ఏడు మ్యాచ్ ల్లోనే 13 వికెట్లు తీసి సత్తా చాటాడు.

పంత్ గురువు వద్ద నేర్చుకుని..

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రిషన్ పంత్.. ఆకాశ్ మద్వాల్ సహచరుడే. ఇద్దరూ ఒకే ప్రాంతం నుంచి వచ్చారు. అలాగే, పంత్ కు కోచింగ్ ఇచ్చిన అత్వార్ సింగ్ వద్దే ఆకాశ్ కూడా శిక్షణ తీసుకున్నాడు. దేశవాళీలో ఆకాశ్ ఆట తీరుకు అతడిని కెప్టెన్సీ వరించింది. ఉత్తరాఖండ్ జట్టుకు సారధిగా నియమిస్తూ క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఆకాశ్ లో స్పెషల్ అదే..

ముంబై ఇండియన్స్ బౌలర్ ఆకాశ్ మద్వాల్ లో ప్రత్యేకత ఉంది. బంతిని తక్కువ బౌన్స్ తో జారవిడిచేలా వేయడం ఆకాశ్ ప్రత్యేకత. లీగ్ దశలో హైదరాబాద్ పై నాలుగు వికెట్లు తీసిన ఆకాశ్.. ఈసారి మాత్రం మరింత కట్టుదిట్టంగా బంతులను సంధించాడు. అత్యంత తక్కువ ఎకానమీతో బౌలింగ్ వేసిన బౌలర్ గా మారాడు. లక్నోపై 3.3 ఓవర్లలో కేవలం ఐదు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. లక్నో బ్యాటర్ బదోనిని క్లీన్ బౌల్డ్ చేసిన తరువాత బంతికే డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్ ను బోల్తా కొట్టించాడు. టెస్టుల్లో మాత్రమే చూసే తక్కువ లెంగ్త్ బంతిని సంధించి వికెట్లు రాబట్టాడు. ఈ యువ క్రికెటర్ పై సీనియర్ క్రికెటర్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.