
తెలుగు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ బరిలో ఈరోజు దిగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడబోతోంది. చెన్నై వేదికగా జరిగే ఈ తొలి మ్యాచ్ లోనే గెలిచి శుభారంబం చేయాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021లో మూడో మ్యాచ్ సమఉజ్జీలుగా పరిగణించబడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు మొదలు కానుంది. రెండు జట్లు బలాబలాలు చూస్తే సమతూకంగానే కనిపిస్తోంది. హైదరాబాద్, కోల్ కతా రెండూ బలమైన ఆటగాళ్లతో సమతుల్యంగా కనిపిస్తాయి. రెండు జట్లు ఈ సీజన్‌ను విజయంతో మొదలు పెట్టాలని.. చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకుంటాయి. సన్ రైజర్స్ ప్రతీ టోర్నమెంట్ లో చూస్తే ప్లేఆఫ్‌లోకి రావడానికి నిలకడగా రాణిస్తోంది. ఇక కోల్ కతా ప్లే ఆఫ్స్ లోకి ప్రతీసారి రావడానికి తెగ కష్టపడుతోంది. కాబట్టి ఈ సీజన్‌లో కనీసం ప్లే-ఆఫ్‌లు చేరాలనే ఒత్తిడితో ఆ జట్టు ఆడుతుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ 2018 నుంచి ప్లేఆఫ్ కు చేరలేదు. ఈ జట్టు ప్రధానంగా ఆల్ రౌండర్లు సునీల్ నరైన్ మరియు ఆండ్రీ రస్సెల్‌పై ఆధారపడుతోంది. కానీ ఇద్దరూ గత సీజన్‌లో నిరాశ పరిచారు. దినేష్ కార్తీక్, శుభ్ మన్ గిల్, పాట్ కమ్మిన్స్, మరియు షకీబ్ అల్ హసన్ ఆధారపడదగిన ఇతర ప్రధాన ఆటగాళ్ళు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు ఇది పూర్తి స్థాయి కెప్టెన్‌గా కోల్ కతాకు మొదటి సీజన్ నడిపిస్తున్నాడు. కమలేష్ నాగర్‌కోటి, శివం మావితోపాటు ప్రతిభావంతులైన వరుణ్ చక్రవర్తి వంటి ముగ్గురు కీలక దేశీయ బౌలర్లు ఆ జట్టు సొంతం.. అయితే సన్ రైజర్స్ కు ఉన్న బలమైన బౌలింగ్ త్రయాన్ని ఎదుర్కోవడం కోల్ కతాకు అంత సులభం కాదు.
భువనేశ్వర్ కుమార్ తిరిగి ఫామ్‌లోకి రావడంతో ఎస్‌ఆర్‌హెచ్ వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు.. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ బ్యాట్స్ మెన్ లను పెద్ద స్కోరు చేయకుండా అరికడుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్ఆర్.హెచ్ మిడిల్ ఆర్డర్ ఎల్లప్పుడూ ఆందోళన కలిగిస్తుంది. కాని డేవిడ్ వార్నర్ దానిని ఎలా పరిష్కరించబోతున్నారో మనం చూడాలి. వార్నర్, విలియమ్సన్, బెయిర్‌స్టో, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, మరియు ప్రియామ్ గార్గ్‌లతో జట్టు బాగా కనిపిస్తోంది. కానీ ఎస్‌ఆర్‌హెచ్ లోని ప్రధాన సమస్య అయిన మిడిల్ ఆర్డర్ వల్లనే ఆ టీం ప్రతీసారి ఓడిపోతోంది. ఈసారి మిడిల్ ఆర్డర్ సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నది వేచిచూడాలి.
ఐపిఎల్ చరిత్రలో:
ఎస్‌ఆర్‌హెచ్, కెకెఆర్ కలిసి 19 మ్యాచ్‌లు ఆడారు. కెకెఆర్ 12 మ్యాచుల్లో గెలవగా.. ఎస్‌ఆర్‌హెచ్ 7 మ్యాచ్ లను గెలిచింది.