https://oktelugu.com/

Yash Dayal: గేలి చేసిన వారికి.. బౌలింగ్ తో సమాధానం..ఆర్సీబీ ఓవర్ నైట్ స్టార్ యష్ జర్నీ తెలుసా?

యష్ దయాళ్ గత సీజన్లో రింకూ సింగ్ చేతిలో బలయ్యాడు. ఐదు బంతులకు ఐదు సిక్సులు ఇచ్చి.. మానసికంగా డీలా పడిపోయాడు.. అలాంటి క్రమంలో అతడిని బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 19, 2024 / 05:07 PM IST

    Yash Dayal

    Follow us on

    Yash Dayal: ఓ ఎండ్ లో మహేంద్ర సింగ్ ధోని కాచుకుని ఉన్నాడు. మరో ఎండ్ లో రవీంద్ర జడేజా ఆవురావూరు మంటూ ఎదురుచూస్తున్నాడు.. అప్పటికి ధోని కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బెంగళూరు కెప్టెన్ డూ ప్లెసిస్ నమ్మకంతో అతడికి బౌలింగ్ అందించాడు. తొలి బంతి వేయడమే ఆలస్యం ధోని అమాంతం స్టేడియం అవతలికి పంపించాడు. దీంతో ఎంపైర్లు కొత్త బంతిని అందించారు. బెంగళూరు అభిమానులు మునివేళ్ల మీద నిలబడ్డారు. ధోని ఏమైనా అద్భుతం చేస్తాడా అంటూ.. భయపడుతూ కళ్ళు మూసుకున్నారు. కానీ, కళ్ళు తెరిచి చూసేలోగా చెన్నై ఓడిపోయింది.. బెంగళూరు గెలిచింది.. ఒకే ఓవర్ లో ఐదు సిక్సులు ఇచ్చి.. మానసికంగా కుంగిపోయిన ఓ బౌలర్.. అదే స్థాయిలో రాటు తేలాడు . అంతకుమించి అనే సామెత లాగా రాకెట్ లాగా దూసుకొచ్చాడు. బెంగళూరు జట్టును గెలిపించాడు.. తను కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.

    యష్ దయాళ్ గత సీజన్లో రింకూ సింగ్ చేతిలో బలయ్యాడు. ఐదు బంతులకు ఐదు సిక్సులు ఇచ్చి.. మానసికంగా డీలా పడిపోయాడు.. అలాంటి క్రమంలో అతడిని బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతనికి ఆడే అవకాశం కల్పించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న యష్.. 13 మ్యాచ్ లలో 15 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ప్లే ఆఫ్ కు అత్యంత కీలకమైన చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్ లో అత్యంత పొదుపుగా బౌలింగ్ వేసి, ధోనిని పెవిలియన్ పంపించాడు. కన్నడ అభిమానుల పాలిట దేవుడయ్యాడు.. గత ఏడాది యష్ గుజరాత్ జట్టులో ఆడాడు. రింకూ సింగ్ బ్యాటింగ్ దెబ్బకు అతడు ఏడ్చినంత పని చేశాడు. ఆ సమయంలో యష్ ప్రతిభను బెంగళూరు మేనేజ్మెంట్ గుర్తించింది. అతడిని తుది జట్టులోకి తీసుకుంది. కీలక బౌలర్ గా మార్చింది.. రాజస్థాన్ వద్దనుకున్న అతడిని.. తను దగ్గరికి తీసుకొని రాటు తేలేలా చేసింది. ప్లే ఆఫ్ కు వెళ్లే మ్యాచ్లో.. అది కూడా చివరి ఓవర్ వేసే బాధ్యతను డూ ప్లెసిస్ యష్ కు ఇచ్చాడంటేనే అతనిపై ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా యష్ బౌలింగ్ వేశాడు. చెన్నై జట్టు ఆశలపై నీళ్లు చల్లుతూ.. బెంగళూరును గెలిపించాడు.

    చివరి ఓవర్ వేసే క్రమంలో.. ధోని భారీ సిక్సర్ కొట్టిన తర్వాత.. యష్ స్కోర్ బోర్డు వైపు చూడలేదట. తను అత్యంత ఆత్మవిశ్వాసంతో బంతులు సంధించాడట. బౌలింగ్ వేసేటప్పుడు బెంగళూరు జట్టు తనకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని పదేపదే తలచుకున్నాడట. దీనివల్ల అతడిలో సానుకూల దృక్పథం పెరిగిందట. మొదటి బంతి భారీ సిక్సర్ గా వెళ్లినప్పటికీ.. అతడు ఏమాత్రం భయపడలేదట. బౌలింగ్ వేస్తున్న సమయంలో వేగాన్ని నియంత్రించుకుంటూ.. బంతులు సంధించాడట. అందువల్లే రవీంద్ర జడేజా లాంటి పంచ్ హిట్టర్ బ్యాట్ ఝళిపించలేక పోయాడట. ఇదే విషయాన్ని మ్యాచ్ ముగిసిన అనంతరం యష్ విలేకరులతో పంచుకున్నాడు. కాగా, చివరి ఓవర్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి, బెంగళూరుకు అద్భుతమైన విజయాన్ని అందించిన యష్ ను కన్నడ అభిమానులు వెయ్యినోళ్ల పొగుడుతున్నారు. సోషల్ మీడియాలో అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.