https://oktelugu.com/

Aman Sehrawat: ఆప్యాయతను పంచడానికి అమ్మ లేదు.. అనురాగం కురిపించడానికి నాన్న లేడు.. కంటనీరు తెప్పిస్తున్న ఒలింపిక్ కాంస్య విజేత అమన్ జీవిత గాథ

పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తుందనుకున్న వినేశ్ ఫొగాట్ బరువు సమస్య వల్ల ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. దీంతో మొన్నటి వరకు రెజ్లింగ్ విభాగంలో మెడల్ వస్తుందనుకునే ఆశ లేదు.. ఈ నేపథ్యంలో అమన్ శరావత్ సత్తా చాటాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 10, 2024 / 09:57 AM IST

    Aman Sehrawat

    Follow us on

    Aman Sehrawat: మనకు ఏదైనా కష్టం వస్తే అమ్మ పక్కన ఉంటే బాగుంటుంది అనుకుంటాం. మనకి ఏదైనా బాధ అనిపిస్తే చెప్పుకోవడానికి నాన్న తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుందనుకుంటాం. ఆ సందర్భాలు మాత్రమే కాదు, అనేక అసంఘటనల్లో మనం గెలిచినప్పుడు లేదా ఓడినప్పుడు, కన్నీళ్లు పెట్టినప్పుడు, కళ్ళల్లో నీరు ఉబికి వచ్చే సంతోషం కలిగినప్పుడు తల్లిదండ్రులు వెంట ఉంటే బాగుంటుంది. కానీ ఇతడికి ఆ అవకాశం లేదు. ఆత్మీయంగా పలకరించడానికి అమ్మ లేదు. భుజం తట్టడానికి నాన్న లేడు. అంతటి దుఃఖంలోనూ.. గుండెలు బద్దలయ్యే బాధలోనూ అతడు తన లక్ష్యాన్ని దూరం పెట్టలేదు. భౌతికంగా లేకపోయినప్పటికీ.. అమ్మా నాన్న మానసికంగా నాతోనే ఉన్నారని భావిస్తూ ముందుకు సాగాడు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించి భారత్ పరువు నిలబెట్టాడు. అతి చిన్న వయసులోనే మెడల్ సాధించిన అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు అమన్ శరావత్. మంగళవారం జరిగిన తన సెమీఫైనల్ బౌట్ లో టాప్ సీడ్ రెజ్లర్, జపాన్ దేశాన్ని చెందిన రీ హిగుచి పై ఓడిపోయాడు.

    పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తుందనుకున్న వినేశ్ ఫొగాట్ బరువు సమస్య వల్ల ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. దీంతో మొన్నటి వరకు రెజ్లింగ్ విభాగంలో మెడల్ వస్తుందనుకునే ఆశ లేదు.. ఈ నేపథ్యంలో అమన్ శరావత్ సత్తా చాటాడు. ఏకంగా కాంస్య పతకం సాధించాడు. ఇప్పుడే కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో భారత్ క్రమం తప్పకుండా మెడల్స్ సాధిస్తోంది. అమన్ మెడల్ సాధించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అతనిపై ప్రత్యేకమైన చర్చ నడుస్తోంది.. అమన్ నేపథ్యం గురించి నెటిజన్లు గూగుల్ లో శోధిస్తున్నారు.

    అమన్ అండర్ -23 రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్ గా రికార్డు సృష్టించాడు. ఆ మెడల్ సాధించడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. హర్యానా రాష్ట్రం జుజ్జర్ జిల్లా బిరోహర్ గ్రామంలో 2003 జూలై 16న పుట్టాడు. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఆ తర్వాత అతని తాతయ్య వద్ద పెరిగాడు. చిన్నప్పటినుంచి దృఢంగా ఉండడంతో పది సంవత్సరాలకే కుస్తీ పోటీల్లోకి దిగాడు. అందులో అద్భుతాలు సృష్టించాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్ తరఫున మెడల్ సాధించిన అత్యంత చిన్న వయసు అథ్లెట్ గా రికార్డు సృష్టించాడు. 21 సంవత్సరాలకే తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించాడు.

    2012 ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ సుశీల్ కుమార్ కూడా రెజ్లింగ్ విభాగంలో రజత పతకం సాధించాడు. అతడిని ఆదర్శంగా తీసుకొని అమన్ పది సంవత్సరాలకి ఉత్తర ఢిల్లీలోని చత్రస్థాయి మైదానంలో తన పేరును ఎంట్రీ చేయించుకున్నాడు. అక్కడి నుంచి పారిస్ ఒలింపిక్స్ దాకా అమన్ కుస్తీ పోటీ అప్రతిహతంగా సాగింది. 2021లో తొలి నేషనల్ ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం చేసుకున్న అమన్.. ఆ తర్వాత వెను తిరిగి చూడలేదు.

    2022 అండర్ 23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. అండర్ 23 వరల్డ్ ఛాంపియన్షిప్ లో మరో మెడల్ సొంతం చేసుకున్నాడు. 2023 ఏప్రిల్ లో జరిగిన ఆసియా రెజ్లింగ్ పోటీలలో పసిడి పతకం సాధించాడు. 2024 జనవరిలో ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్ లో 57 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. టర్కీ లోని ఇస్తాంబుల్ లో జరిగిన 2024 వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో సత్తా చాటాడు. ఫలితంగా పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. 57 కిలోల విభాగంలో ప్యూర్టోరికో రెజ్లర్ క్రూజ్ పై 13-5 తేడాతో గెలిచి కాంస్యం సొంతం చేసుకున్నాడు.