Nilesh Kulkarni: క్రికెట్ ఆడే వాళ్ళందరికీ అవకాశాలు రావు.. అవకాశాలు రావాలంటే అదృష్టం కూడా తోడు కావాలి. కానీ ఈ ఆటగాడికి క్రికెట్లో అపారమైన నైపుణ్యం ఉంది. కానీ అదృష్టం లేకపోవడంతో క్రికెట్ మొత్తానికి దూరం కావలసి వచ్చింది. అలాగని అతడు నిరాశ పడలేదు. తనకు అవకాశాలు రాకపోయినప్పటికీ.. కొత్త విధానాన్ని సృష్టించుకున్నాడు. తద్వారా కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు.
నీలేష్ కులకర్ణి.. టెస్ట్ క్రికెట్లో భారత జట్టు తరఫున ఇతడు ఆరంగేట్రం చేశాడు. ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్లోనే తొలి బంతికే వికటి తీసి.. సంచలనం సృష్టించాడు. ఈ ఘనత అందుకున్న తొలి ఇండియన్ బౌలర్ గా అతడు ఆవిర్భవించాడు. శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో 70 ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. అయితే వికెట్ మాత్రం సాధించలేకపోయాడు. ఇదే క్రమంలో ఐపీఎల్లో అతడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళాడు. అక్కడ కూడా అవకాశం లభించకపోవడంతో వెనక్కి వచ్చాడు.
ఐపీఎల్ లో అవకాశం రాకపోయినప్పటికీ.. జాతీయ జట్టులో చోటు లభించకపోయినప్పటికీ కులకర్ణి ఏమాత్రం భయపడలేదు. అంతేకాదు, తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్లోనే తాడోపేడో తేల్చుకోవాలని అనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలను రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగానే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ international institute of sports and management (IISM) అనే సంస్థను ఏర్పాటు చేశాడు. తద్వారా కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.. క్రికెట్లో అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నప్పటికీ.. అవకాశాలు లభించకపోయినప్పటికీ.. ఇష్టమైన క్రీడల్లోనే అపారమైన అవకాశాలు ఉన్నాయని.. అందులో బ్రహ్మాండంగా సంపాదించవచ్చని నిరూపించాడు కులకర్ణి.
మొదట్లో ఇతడు ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు అందరూ ఎగతాళి చేశారు. అయినప్పటికీ కులకర్ణి ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అంతేకాదు, స్పోర్ట్స్ లో మేనేజ్మెంట్ ప్రాధాన్యతను సరికొత్తగా ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మనదేశంలో వివిధ క్రీడలు అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. దానికి మేనేజ్మెంట్ అవసరాలు కూడా పెరిగిపోయాయి. దీంతో కులకర్ణి వ్యాపారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లింది.
“నేను మొదట్లో మేనేజ్మెంట్ వ్యాపారం లోకి వచ్చినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. ఇష్టానుసారంగా మాట్లాడారు. కొందరైతే చేతులు కాల్చుకుంటున్నావని హెచ్చరించారు. ఏదైతే అది అయిందని అనుకున్నాను. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందించుకున్నాను. చివరికి ఈ స్థాయికి వచ్చానని” కులకర్ణి చెబుతున్నాడు. నాడు జట్టులో ఎవరైతే ఇతడికి అవకాశం ఇవ్వలేదో.. ఇప్పుడు వారే ఇతడి మేనేజ్మెంట్ వ్యవహారాన్ని చూసి సెల్యూట్ చేస్తున్నారు.