https://oktelugu.com/

MS Dhoni Birthday: జార్ఖండ్ యువకుడు.. ఇండియన్ క్రికెట్ కు బ్రాండ్ ఎలా అయ్యాడు?

ఎక్కడో మారుమూల జార్ఖండ్ రాష్ట్రంలో పుట్టిన ధోని.. ఈ స్థాయి దాకా రావడం వెనక ఎన్నో కష్టాలు పడ్డాడు. మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ వాటన్నిటిని తన విజయానికి దారులుగా మలుచుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 7, 2024 / 08:29 AM IST

    MS Dhoni Birthday

    Follow us on

    MS Dhoni Birthday: మనదేశంలో సినీ హీరోలకు భారీ కటౌట్లు పెడతారు. కానీ తొలిసారిగా ఆ రికార్డును బ్రేక్ చేశాడు ధోని. ఏకంగా 100 అడుగుల కటౌట్ ఏర్పాటుచేసే అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. ప్రతి ఏడాది ఆ కటౌట్ ఎత్తు పెరుగుతోంది తప్ప.. తగ్గడం లేదు. టీమిండియా కు ధోని గుడ్ బై చెప్పి చాలా రోజులే అవుతున్నప్పటికీ.. అభిమానులు ఇంకా తగ్గలేదు. మొన్నటికి మొన్న జరిగిన ఐపీఎల్లో “తలా ఫర్ ఏ రీజన్” అనే నినాదం ఏ స్థాయిలో మార్మోగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒక మాజీ క్రికెటర్ కు ఈ స్థాయిలో గౌరవం లభించింది అంటే అది ధోని ఒక్కడికే కావచ్చు.

    ఎక్కడో మారుమూల జార్ఖండ్ రాష్ట్రంలో పుట్టిన ధోని.. ఈ స్థాయి దాకా రావడం వెనక ఎన్నో కష్టాలు పడ్డాడు. మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ వాటన్నిటిని తన విజయానికి దారులుగా మలుచుకున్నాడు. టీమిండియా క్రికెట్లో స్వర్ణ యుగాన్ని సృష్టించాడు. వర్ణించడానికి సాధ్యం కాని విజయాలు అందించాడు. ప్రస్తుతం చాలామంది యువ ఆటగాళ్లు దిగ్గజాలుగా మారి.. టీమ్ ఇండియాకు విజయాలు అందిస్తున్నారంటే అది ముమ్మాటికి ధోని చలవే. ప్రశాంతంగా బ్యాటింగ్ చేయడం.. కూల్ గా కెప్టెన్సీ నిర్వర్తించడం.. బౌలర్లకు నింపాదిగా సలహాలు ఇవ్వడం.. ఇవన్నీ కూడా ఆధునిక క్రికెట్ ప్రపంచానికి ధోని నేర్పిన పాఠాలు.

    టీమిండియాలోకి దూకుడు బ్యాటింగ్ శైలి తీసుకొచ్చిన ఘనత మహేంద్రసింగ్ ధోనిదే. టీమిండియా జట్టుకు వెన్నెముకగా మారిన అతడు.. ఆ తర్వాత నాయకుడిగా అనేక పాత్రలను పోషించాడు. 2007లో టి-20 వరల్డ్ కప్ ప్రారంభ ఎడిషన్లో టీమ్ ఇండియాను విజేతగా నిలిపాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు సొంతం చేశాడు. టెస్టుల్లో టీమిండియాలో నెంబర్ వన్ గా నిలిపాడు. తన నాయకత్వంలో చాలా చేశానని చెప్పి.. చేయడానికి ఏమీ లేదని చూపించి వెళ్లిపోయాడు. 1981 జూలై 7న జన్మించిన మహేంద్ర సింగ్ ధోని ఆదివారం 43వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ ధోని తన శకాన్ని కొనసాగించాడు. చెన్నై జట్టును తిరుగులేని స్థాయిలో నిలిపాడు. ఏకంగా “తలా” గా ఆవిర్భవించాడు. తన హయాంలో చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపాడు. 2008లో ఐపీఎల్ మొదలైన నాటి నుంచి 2023 వరకు చెన్నై జట్టుకు ధోని కెప్టెన్ గా కొనసాగాడు. 2024లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రుతు రాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ అప్పగించాడు. ఇటీవల సీజన్లో సోషల్ మీడియాలో తలా ఫర్ ఏ రీజన్ అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యిందంటే.. ధోని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.