Lamine Yamal: అతడి వయసు 16 సంవత్సరాలు. నూనూగు మీసాలు కూడా రాలేదు. కానీ దిగ్గజాలతో తలపడుతున్నాడు. తలపండిన ఆటగాళ్లతో పోటీ పడుతున్నాడు. ఎదురుగా ఎవరున్నా పెద్దగా లెక్క చేయడం లేదు. ప్రత్యర్థి ఆటగాళ్లు గోడలా నిలబడ్డప్పటికీ ఖాతరు చేయడం లేదు. అలాగని అతడు మారడోనా వారసుడు కాదు. పీలే లాగా ఘనమైన నేపథ్యం లేదు. మెస్సి లాగా బలమైన సామర్థ్యం లేదు. అయినప్పటికీ వారందరినీ మరిపిస్తున్నాడు. సిసలైన ఆటతీరుతో అలరిస్తున్నాడు.. ఇంతకీ ఆ ఆటగాడి పేరేంటంటే..
యామాల్.. యూరో కప్ లో స్పెయిన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. కీలకమైన సెమీస్ మ్యాచ్ లో బలమైన ఫ్రాన్స్ జట్టుపై కీలక సమయంలో గోల్ చేసి.. స్పెయిన్ జట్టును ఫైనల్ తీసుకెళ్లాడు. అద్భుతమైన పరిణతి, బలమైన మానసిక దృక్పథం తో యమాల్ ఆడుతున్న తీరు తోటి ఆటగాళ్లను సైతం నివ్వెర పరుస్తోంది. కేవలం 16 సంవత్సరాల వయసులోనే ఈ స్థాయిలో విధ్వంసమా అనుకునేలా చేస్తోంది..” మారడోనా మైదానంలో చిరుత పులిలాగా ఆడేవాడు. మెస్సి కూడా ఫుట్ బాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించాడు. యమాల్ మాత్రం వారందరీ రికార్డులను కచ్చితంగా బద్దలు కొడతాడు” అంటూ జర్మనీ దిగ్గజ ఆటగాడు లోథర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు యమాల్ విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో. వాస్తవానికి యమాల్ ను దిగ్గజ ఆటగాళ్లతో పోల్చడం కాస్త అతి అనిపించినప్పటికీ.. అతని ఆట తీరు చూస్తే అలా సరిపోల్చడం సలబే అనిపిస్తుంది..
యూరో కప్ చరిత్రలో అత్యంత చిన్న వయసులో గోల్ చేసిన ఆటగాడిగా యమాల్ రికార్డు సృష్టించాడు. మైదానంలో పాదరసంలాగా కదలడం యమాల్ కిక్ తో పెట్టిన విద్య. ప్రత్యర్థి ఆటగాళ్లకు అతడు ఏ మాత్రం చిక్కడు. ప్రత్యర్థి గోల్ పోస్ట్ పై ఖచ్చితమైన అవగాహన కలిగి ఉంటాడు. లిప్త పాటు కాలంలో బంతిని గోల్ పోస్టులోకి పంపిస్తుంటాడు. బంతిపై అద్భుతమైన నియంత్రణ కలిగి ఉంటాడు కేవలం 30 గజాల దూరం నుంచి బంతిని గోల్ పోస్ట్ లోకి అత్యంత సులువుగా పంపిస్తాడు. కుడి కాలును చాకచక్యంగా వాడుతూనే.. ఎడమకాలును అత్యంత బలంగా ఉపయోగిస్తాడు. యూరో కప్ లో ఇప్పటికే మూడు గోల్స్ చేశాడు.
యమాల్ బార్సిలోనా క్లబ్ తరఫున 51, అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీలలో భాగంగా స్పెయిన్ జట్టు తరఫున 13 మ్యాచ్ లు ఆడాడు. యమాల్ ఓవైపు ఫుట్ బాల్ మ్యాచ్ లు ఆడుతూనే.. మరోవైపు చదువు కొనసాగిస్తున్నాడు. యమాల్ స్పెయిన్ దేశంలో పుట్టాడు. అతడికి మూడు సంవత్సరాల వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో అతడి తల్లితో కలిసి గ్రానోల్సర్ నగరానికి వెళ్ళాడు. అక్కడ అతడు స్థానిక క్లబ్ లో ఫుట్ బాల్ ఆడటం మొదలుపెట్టాడు. యమాల్ కు ఆరు సంవత్సరాల వయసు రాగానే బార్సిలోనా క్లబ్ అతడి ప్రతిభను గుర్తించింది. దీంతో అతడి జాతకం మారిపోయింది.. ఆ తర్వాత బార్సిలోనా యూత్ అకాడమీ ఆధ్వర్యంలో నడిచే లామేసియా లో శిక్షణ పొందాడు. జూనియర్ స్థాయిలో జరిగిన పోటీలలో సత్తా చాటాడు.. తనకంటే ఎక్కువ వయసు ఉన్న వారితో ఆడి.. ప్రతిభకు సాన పెట్టుకున్నాడు. గత ఏడాది బార్సిలోనా సీనియర్ జట్టు తర్పణ ఎంట్రీ ఇచ్చాడు. ఏకంగా ఐదు గోల్స్ సాధించాడు. అంతకుముందు స్పెయిన్ అండర్ -15 జట్టులో ఆడాడు. చివరికి సీనియర్ జట్టుకు వచ్చేసాడు. బార్సిలోనా క్లబ్, స్పెయిన్ జట్టుకు ఆడి..గోల్ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. స్పెయిన్ జట్టు తరఫున మూడు గోల్స్ చేసిన చరిత్ర యమాల్ ది.
2007లో మెస్సి ఆధ్వర్యంలో నిధుల సేకరణ చేశారు. అప్పట్లో మెస్సి స్పెయిన్ లోని బార్సిలోనా పర్యటించాడు. ఆ సమయంలో ఆరు నెలల వయస్సు ఉన్న యమాల్ ను ఎత్తుకొని అతడు ఫోటో దిగడం విశేషం..యమాల్ తో ఇతర ఆటగాళ్లు కూడా ఫోటో షూట్ నిర్వహించడం విశేషం. బార్సిలోనా క్లబ్ తరఫున మెస్సి వారసత్వాన్ని కొనసాగిస్తున్న యమాల్.. అంతర్జాతీయ ఫుట్ బాల్ లో తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సెమీఫైనల్ లో యమాల్ దూకుడు వల్ల ఫైనల్ చేరిన స్పెయిన్ కప్ దక్కించుకోవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. సెమీఫైనల్ లో సంచలన విజయం అందించిన యమాల్.. ఫైనల్ మ్యాచ్ లోనూ అదే స్థాయిలో సత్తా చాటాలని కోరుకుంటున్నారు.