Raj Limbani: టాలెంట్ ఎవడబ్బసొత్తు కాదు.. కృషి, పట్టుదల ఉంటే.. ఏ రంగంలో అయినా రాణించవచు‍్చ. అందుకు మోడల్‌గా నిలిచాడు రాజ్ లింబానీ. ప్రస్తుతం అండర్ – 19 వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకి వస్తున్న క్రికెటర్లలో రాజ్ లింబానీ ఒకరు. సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ – 19 వరల్డ్ కప్‌లో ఈ కుర్రాడు సంచలన ప్రదర్శనతో దుమ్మురేపుతున్నాడు. ఆతిథ్య జట్టుతో మంగళవారం జరిగిన సెమీ ఫైనల్‌లో ఫైనల్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టీమిండియాను ఫైనల్‌కు చేర్చడంతో కీలకంగా వ్యవహరించాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాటింగ్‌లో కీలక సమయంలో 4 బంతుల్లో 13 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఉత్కంఠగా మారిన మ్యాచ్‌లో ఓ భారీ సిక్స్‌తో విజయానికి బాటలు వేశాడు. విన్నింగ్ షాట్ బౌండరీ బాది భారత్ విజయాన్ని లాంఛనం చేశాడు.
రైతు బిడ్డగా..
రాజ్‌లిబానీ పాకిస్తాన్‌కు 27 కిలోమీటర్ల దూరంలోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలోని దయాపర్ జిల్లాలో జన్మించాడు. సాధారణ రైతు కుటుంబం నుంచి అండర్ – 19 క్రికెటర్‌గా ఎదిగాడు. రాజ్‌కు అతని తండ్రి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. తన మిగతా సోదరుల్లా అహ్మదాబాద్ లేదా సూరత్‌కు వెళ్లి చదువుకోవాలని సూచించాడు. కాదంటే వ్యవసాయంలో తనకు సహాయంగా ఉండాలని తెలిపాడు. కానీ రాజ్.. ఈ రెండు ఆప్షన్లను కాదని క్రికెటర్ కావాలనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు బరోడాకు చేరుకున్నాడు. తన ఊరికి 557 కిలోమీటర్ల దూరంలో బరోడా ఉన్నా.. ఇష్టమైన ఆట కోసం ఇంటిని వదిలేశాడు. క్రికెటర్ అవుతానన్న రాజ్‌లింబానీకి అతని తండ్రి అండగా నిలిచాడు. క్రికెట్‌లో విఫలమైతే ఇంటికి వచ్చేసి వ్యవసాయం చేసుకోవాలని చెప్పాడు.
నేపాల్‌తో మ్యాచ్‌లో సత్తా..
నచ్చిన ఆట కోసం బరోడాకు చేరుకున్న రాజ్ లింబానీ కోచ్‌ల పర్యవేక్షణలో క్రికెట్ నేర్చుకున్నాడు. కొన్నిసార్లు తప్పులు చేసినా.. విఫలమైనా కోచ్‌ల సహకారంతో అండర్ – 19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ మెగా టోర్నీకి ముందు జరిగిన అండర్ – 19 ఆసియాకప్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. రైట్ హ్యాండ్ స్వింగ్ బౌలర్ అయిన లింబానీ కొత్త, పాత అనే తేడా లేకుండా స్వింగ్ రాబట్టడంతో దిట్ట. ఆసియా కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు. టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ శైలిని తలపించడంతోపాటు బ్యాటింగ్‌లోనూ పఠాన్ లాగానే భారీ షాట్లు ఆడగలడు.
ఏడారి ఇసుకలో ప్రాక్టీస్..
తమది ఎడారి ప్రాంతమని, కఠిన వాతావరణంలోనూ రాజ్ లింబానీ ప్రాక్టిస్ చేసేవాడని అతని తండ్రి సంపత్ తెలిపాడు. ఇసుకలో, తీవ్ర ఎండలో గంటల కొద్ది క్రికెట్ ఆడేవాడని పేర్కొన్నాడు. టెన్నిస్ బాల్‌తో ఆడడం మొదటు పెట్టిన లింబానీ తర్వాత కార్క్ బాల్.. ఇప్పుడు గ్రేస్ బాల్‌తో క్రికెట్ ఆడుతున్నాడని వివరించాడు. ఇక రాజ్ లింబానీ టాలెంట్ కాకుండా అతని బ్యాక్ గ్రౌండ్ చూసి చేరదీశానని కోచ్ దిగ్విజయ్ సింగ్ రత్వా తెలిపాడు. తొలిసారి రాజ్ లింబానీని అండర్-16 క్యాంప్‌లో చూశానన్నారు. క్రికెట్ నేర్చుకునే కుర్రాళ్లను ఎవరిని ఏం అవుతావని ప్రశ్నిస్తే అందరూ భారత జట్టుకు ఆడుతానని సమాధానం చెప్పేవారని, రాజ్ మాత్రం తన డైరీ చూపించాడని తెలిపారు.
టార్గెట్‌పై క్లారిటీ..
ముందుగా అండర్ – 16కు ఎంపిక కావాలని, తర్వాత అండర్ – 19కు ఆడాలని, తర్వాత ఎన్‌సీఏ క్యాంప్‌కు హాజరై అండర్ – 19 ప్రపంచకప్ ఆడాలని రాసుకున్నాడు. ఆ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసి బరోడా తరఫున ఫస్ట్‌క్లాక్ క్రికెట్ ఆడి.. ఆ తర్వాత భారత్ ఏ తరఫున బరిలోకి దిగి సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేయాలని స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నాడని దిగ్విజయ్ సింగ్ రత్వా వివరించాడు.