* ఇంగ్లాండ్ పై గెలుపుతో కొత్త ఊపు
* భారత్ క్రికెట్ జట్టులో పరవళ్ళు తొక్కుతున్న కొత్త రక్తం
Indian Test cricket : బ్రదర్ కొన్ని విషయాలు కుల్లమ్.. కుల్లంగా మాట్లాడుకుంటేనే అందరికీ మంచిది. ఏమంటిరి.. ఏమంటిరి.. కోహ్లి లేకుండా ఇండియా టీం పరిస్థితి ఏంది..? అయ్యయ్యో రోహిత్ శర్మ లేకుండా టెస్ట్ మ్యాచ్ లు ఎలా ఆడుతారో..? ఇవండీ మన సోకాల్డ్ క్రికెట్ విశ్లేషకుల మాటతీరు..
ఇండియా టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా శుభమన్ గిల్ తో పాటు జట్టు సభ్యులను ఎంపిక చేసిన తరువాత కూడా క్రిటిక్స్ గా ఎవరికివారే స్వయం ప్రకటిత క్రికెట్ విశ్లేషక మేధావులుగా చెప్పుకునే కొంతమంది ఎవరికి తోచినవిధంగా అడ్డదిడ్డంగా మాట్లాడడం చూశాం.
శుభమన్ గిల్ ఏం చేస్తాడు.. టెస్ట్ కెప్టెన్సీ అంటే మాటలా.. అనుభవం లేని వారికి కెప్టెన్సీ అంటగట్టారు.. అంటూ వివిధ రకాల కామెంట్స్ చేశారు. అయితే నిజమే గిల్ కు ఇదివరకు ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్సీ చేసిన అనుభవం లేకపోవచ్చు, కానీ ఆ పరిణతి రెండో టెస్టులోనే చూపించాడు. కెప్టెన్సీ కి ఉండాల్సిన నాయకత్వ లక్షణాలకు కొదువ ఏమీలేదని, తనకు ఉన్న ఓపిక, రెస్పాన్సిబిలిటీ, వ్యూహరచన, కలుపుగోలుతనం భారత్ జట్టును గెలుపుతీరాలకు తీసుకువెళ్తుందని ప్రగాఢ విశ్వాసం నిజం చేసింది. ఇంగ్లాండ్ తో టెస్ట్ క్రికెట్ లో తాము ఆడమని ఒకరి తర్వాత ఒకరు రిటైర్మెంట్ ప్రకటించిన వీరాధివీరులుగా కీర్తించబడే వారు ఆడకుంటే, జట్టు పగ్గాలు పట్టుకునేందుకు ఎవరుండరు అనీ అనుకుంటే పొరపాటే. అవకాశం వస్తే సత్తా చూపేందుకు కేవలం గిల్ మాత్రమే కాదు, ఇంకా భారత జట్టులో సభ్యులుగా ఎంపికైన వారిలో జట్టును నడిపే నాయకత్వ లక్షణాలు ఉన్న వారెందరో
ఉన్నారు. వీరు కాకపోతే ఇంకొకరు, వాళ్ళు కూడా కాకపోతే ఇంకా చాలా మంది ఆరితేరిన వాళ్ళు బయటికి వస్తారు.
గతంలో కెప్టెన్ ఎంపిక విషయంలో కూడా బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ప్రతినిధులు కూడా తాటిచెట్టంత ఎదిగి కూర్చున్న పెద్ద మనుషులను కాదని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి చూశాం. ఆ కాలంలో వయసుడిగి, వరసగా ఫెయిల్యూర్ అవుతున్న వారిని జట్టు నుంచి తీసివేయాలంటే వెనుకాడే వారు. వారు లేకుంటే ఇండియన్ టీమ్ లేదనే భావన కలిగించారు. అదే తరహాలో జట్టులో వేళ్ళూనుకొనిపోయి తాము రిటైర్మెంట్ ప్రకటించుకునే వరకు తమను కదిపే ధైర్యం ఎవరికి లేదనే ధీమాతో సీజన్లకు, సీజన్లు పరుగులేమి చేయకుండా ఉన్న వారిపట్ల బోర్డు ఉదాసీనంగా వ్యవహరిస్తూ వస్తోంది. వారిని మాత్రమే ఆకాశానికి ఎత్తుతూ, మిగతా వారిలో అందుకు తగిన ప్రావీణ్యం ఉన్న వారికి అవకాశాలు ఇవ్వకుండా నిరుత్సాహానికి గురిచేశారు. బలమైన జట్టుకు కావాల్సింది నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు కానీ, ఆటగాళ్ళ ఎంపికకు ప్రాంతీయత, భాష ప్రాతిపదిక కాకూడదు.
ఎక్కడ టాలెంట్ ఉన్నా వెతికి పట్టుకోవాలి
టాలెంట్ ఉన్న వారెవరైనా వారిని వెతికి పట్టుకొని అవకాశం కల్పించాలి. భారత్ కు మొదటిసారి ప్రపంచ కప్ అందించిన జట్టుకు కెప్టెన్ గా బాధ్యత నిర్వహించిన లెజెండ్ కపిల్ దేవ్ నికంజ్ కు భారత జట్టులో అవకాశం వచ్చిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక చిన్న కౌంటీ మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్న కపిల్ దేవ్ యాక్షన్, ఆయన చేయి నుంచి మెరుపులా దూసుకువెళ్తున్న బంతులు చూసిన అప్పటి ఇండియన్ క్రికెటర్, సెలెక్టర్ బిషన్ సింగ్ బేడీ సెలెక్షన్ కమిటీ కి రికమెండ్ చేశారు. అయితే అదే సమయంలో కపిల్ కన్నా ఎంతో వేగంగా బంతులు విసిరే బరుణ్ బర్మన్ అనే ఆటగాడు పోటీలో ఉన్నాడు. ఆయన వేగంగా బౌలింగ్ చేస్తున్నా, ఎక్యురసీ లేకపోవడం, లైన్ అండ్ లెన్త్ సమస్యతో కపిల్ కు పోటీగా నిలబడలేక తప్పుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని అనుకూలంగా చేసుకొని బౌలింగ్ లో రోజు, రోజుకు కొత్తదనంతో రాణిస్తూ, ఒకవైపు బౌలింగ్, మరోవైపు బ్యాటింగ్లో ఆల్ రౌండర్ గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. 1983 వరల్డ్ కప్ కు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని ఇండియా గెలుపుకు ప్రధాన భూమిక పోషించాడు. అదేవిధంగా జట్టులో స్థానం పొందిన వారెందరో ఉన్నా, ఎక్కువ మంది క్రికెటర్లు తమ రికార్డులు, రివార్డులు, అవార్డులు కోసం తప్ప దేశం కోసం ఆడేవారు తక్కువ అయ్యారు.
నవశకానికి నాంది
మళ్లీ కొత్త రక్తం భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశం గర్వంగా తలెత్తి చూసేలా తమదైన ఆటతీరుతో మన క్రికెటర్లు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. చాలా సంవత్సరాల తరువాత పూర్తిగా వండే మ్యాచులకు, 20-20 ఫార్మెట్ లను మాత్రమే వీక్షించేందుకు అలవాటుపడ్డ క్రికెట్ అభిమానులకు టెస్ట్ మ్యాచ్ లో ఉండే మజా ఏంటో మనవాళ్ళు రుచి చూపించారు. ఒకసారి గెలుపు రుచి చూస్తే, ఆ గెలుపుకు అలవాటు పడితే ఓటమి మన దగ్గరికి వచ్చేందుకు భయపడుతుంది, ఆ గెలుపును అలవాటు చేసుకోవాలని.. లిటిల్ మాస్టర్ గవాస్కర్ ఒక ఇంటర్వ్యూలో అంటారు. మొదటి టెస్టు ఓడిన ఇండియన్ టెస్ట్ జట్టు రెండో మ్యాచ్ లో గెలుపుకు బార్మింగ్ హామ్ వేదికైంది. ఈ గెలుపే వరుస గెలుపులకు శుభారంభం కావాలి. జట్టులో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ లో పొరపాట్లు సరిదిద్దుకోవాలి. ఒకరిద్దరు కొన్ని పరిస్థితుల కారణంగా రాణించలేకపోయినా, కొత్తవారికి అవకాశం కల్పించడం వల్ల జట్టు బలమైనదిగా రూపుదిద్దుకుంటుంది. భారత్ జట్టు మరింత బలమైన జట్టుగా మూడో టెస్టు మ్యాచ్ బరిలోకి దిగాలని ఆకాంక్షిద్దాం..
– దహెగాం శ్రీనివాస్