Indian Sports Tragedies : అన్నేసి ప్రాణాలు పోయిన తర్వాత.. లెక్కకు మిక్కిలి జనం గాయపడ్డ తర్వాత.. అటు కర్ణాటక క్రికెట్ సంఘం, ఇటు కన్నడ క్రికెట్ జట్టు క్షమాపణలు చెప్పాయి. అటు ప్రభుత్వం కూడా మన్నించాలని వేడుకున్నాయి. మన దేశ క్రీడా చరిత్రలో రెండవ అత్యంత దారుణమైన విషాదం ఇది. దీనికంటే ముందు 1980 లో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రెండు ఫుట్ బాల్ జట్లకు చెందిన అభిమానుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఏకంగా 16 మంది చనిపోయారు. ఆరోజు కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్ల మధ్య కోల్ కతా ఫుట్ బాల్ డర్బీ మ్యాచ్ జరిగింది. అందరిలోనూ ఎంతో ఆసక్తి కలిగించిన ఈ మ్యాచ్ చూసేందుకు ఏకంగా 70 వేల మంది హాజరయ్యారు. మ్యాచ్ ప్రారంభమైన కొంతసేపటికి మోహన్ బగాన్ ప్లేయర్ బిదేష్ బసు ను ఉత్తర బెంగాల్ ఫుట్ బాల్ క్రీడాకారుడు దిలీప్ పాలిత్ ఒక్కసారిగా నెట్టేసాడు. దీంతో స్టేడియంలో గలాటా మొదలైంది. రెండు జట్ల అభిమానులు పరస్పరం తిట్టుకున్నారు. అవి కాస్త బూతులుగా మారిపోయాయి. ఆ తర్వాత ఘర్షణకు దిగారు.. ఒకరిని ఒకరు తోసేసుకున్నారు. మైదానంలో తమ చేతికి దొరికిన వాటితో పరస్పరం భీకరంగా దాడులు చేసుకున్నారు. పోలీసులు రెస్పాండ్ అయ్యేలోపే అక్కడ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ దారుణమైన ఘటనలో ఏకంగా నాడు 16 మంది చనిపోయారు. చనిపోయిన వారంతా కూడా మంచి వయసులో ఉన్నవారు కావడం గమనార్హం.
Also Read : విక్టరీ పరేడ్ పై బిసిసిఐ, ఐపీఎల్ నిర్వాహక కమిటీ భిన్న స్వరాలు..ఆ మృతులకు దిక్కెవరు?
ఈ దారుణం జరిగి 45 ఏళ్లు పూర్తయింది. ఇప్పటికీ ఆ ఘటన గుర్తు చేసుకుంటే గుండె ద్రవించిపోతుందని బెంగాల్ వాసులు చెబుతుంటారు.. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత కన్నడ జట్టు విక్టరీ పరేడ్ లో మాటలకందని విషాదం.. ఊహకందని దిగ్బ్రాంతి చోటుచేసుకున్నాయి. స్టేడియానికి వచ్చిన అభిమానుల్లో 11మంది చూస్తుండగానే కన్నుమూయడం కలచివేస్తోంది. సరిగ్గా 45 సంవత్సరాల ఈడెన్ గార్డెన్స్ ఉదంతం తర్వాత.. మన దేశ క్రీడా చరిత్రలో అత్యంత దారుణమైన విషాదంగా కన్నడ జట్టు విక్టరీ పరేడ్ మిగిలిపోయింది.. ఇప్పటివరకు కేవలం ఫుట్ బాల్ మ్యాచ్ లు జరుగుతుండగా.. ఇలాంటి దారుణాలు చోటుచేసుకోగా.. ఒక క్రికెట్ ఈవెంట్ నిర్వహిస్తున్నప్పుడు ఇలాంటి దారుణం జరగడం ఇదే ప్రథమం.
ప్రపంచ క్రీడా చరిత్రలో చూసుకుంటే..
ఇక మన దేశాన్ని పక్కన పెడితే ప్రపంచ క్రీడా చరిత్రలో విషాదలన ఒకసారి పరిశీలిస్తే.. 2022 అక్టోబర్ నెలలో ఇండోనేషియా ప్రాంతంలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్ ప్రాంతంలోని ఖంజురుహన్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన దుర్ఘటనలో 174 మంది కన్నుమూశారు. స్థానికంగా పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా జట్టు ఓటమిపాలైంది. ఇది జీర్ణించుకోలేని అరెమా జట్టు అభిమానులు పెర్సెబాయ సురబాయ జట్టు అభిమానులతో గొడవ పడ్డారు. ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. రెండు జట్టకు సంబంధించిన అభిమానులు పరస్పరం దాడులు చేసుకున్నారు. గొడవను అదుపు చేయడానికి పోలీసులు టియర్ర్ గ్యాస్ ఉపయోగించారు. తమ లాఠీలకు పని చెప్పారు. దీంతో భారీ ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది.. ఏకంగా 174 మంది చనిపోయారు. 320 మంది గాయపడ్డారు.
ఇక ఆఫ్రికా ఖండంలో అత్యంత దారుణమైన ఘటన 2001 ఘనా ప్రాంతంలో జరిగింది. ఘనాలోని అక్రా స్టేడియం వద్ద అభిమానులు పరస్పరం ఘర్షణకు దిగడంతో పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించాల్సి వచ్చింది. తొక్కిసలాట చోటుచేసుకుని 126 మంది చనిపోయారు.