Homeక్రీడలుParis Olympics 2024: వినేశ్ ఫొగాట్ ఉదంతం నుంచి కాస్త ఉపశమనం.. భారత హాకీ జట్టు...

Paris Olympics 2024: వినేశ్ ఫొగాట్ ఉదంతం నుంచి కాస్త ఉపశమనం.. భారత హాకీ జట్టు సంచలనం..

Paris Olympics 2024 : రెజ్లింగ్ పోటీ ఫైనల్స్ లో వినేశ్ ఫొగాట్ బరువు సమస్య వల్ల పోటీ పడలేకపోయింది. చివరికి మెడల్ సాధించకుండానే నిరాశతో వెను తిరిగింది. దీంతో నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ఒకటే చర్చ మొదలైంది. అటు మీడియాలో తామరతంపరగా కథనాలు ప్రసారమవుతున్నాయి. సోషల్ మీడియాలో లక్షలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నిరాశలో ఉన్న భారత్ కు గుడ్ న్యూస్ చెప్పింది హాకీ జట్టు. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1 తేడాతో స్పెయిన్ పై విజయాన్ని సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (మ్యాచ్ 30, 33వ నిమిషాలలో) రెండు గోల్స్ చేసి.. భారత జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. ఫలితంగా ఒలింపిక్స్ లో భారత్ సాధించిన మెడల్స్ సంఖ్య నాలుగు కు చేరుకొంది.

ఈ మ్యాచ్ లో తొలి క్వార్టర్స్ లో రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఈ క్రమంలో రెండవ క్వార్టర్ ప్రారంభంలో (ఆట 18వ నిమిషం) స్పెయిన్ ప్లేయర్ మిరల్లెస్ పెనాల్టీ స్ట్రోక్ ను అత్యంత చాకచక్యంగా గోల్ గా మలిచాడు. దీంతో స్పెయిన్ లీడ్ లోకి వెళ్ళింది. ఆట 29వ నిమిషంలో భారత జట్టుకు పెనాల్టీ కార్నర్ లభించింది. దానిని హర్మన్ ప్రీత్ గోల్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే దానిని స్పెయిన్ గోల్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఇదే సమయంలో మరో పెనాల్టీ కార్నర్ భారత జట్టుకు లభించింది. అయితే ఈసారి ఎలాంటి పొరపాటుకు తావు ఇవ్వకుండా గోల్ చేసింది. హర్మన్ ప్రీత్ తిరుగులేని షాట్ కొట్టడంతో బంతి గోల్డ్ పోస్ట్ లోకి దూసుకెళ్లింది. దీంతో 1-1 తో స్కోర్ లు సమం అయ్యాయి. ఈ క్రమంలోనే మూడో క్వార్టర్ లో భారత జట్టుకు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. దీనిని హార్మన్ ప్రీత్ గోల్ గా మలిచాడు. ఫలితంగా భారత్ 2-1 లీడ్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత మూడు పెనాల్టీ కార్నర్లు పొందిన భారత్.. వాటిని గోల్స్ చేయలేకపోయింది. మరో నిమిషంలో మ్యాచ్ ముగుస్తుందనగా స్పెయిన్ కు పెనాల్టీ కార్నర్ దక్కింది. భారత్ దాన్ని అత్యంత చాకచక్యంగా అడ్డుకుంది. ఇక భారత జట్టు 52 సంవత్సరాల అనంతరం ఒలింపిక్స్ లో వరుసగా 2 కాంస్య పతకాలు సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్ లోనూ భారత్ కాంస్యం దక్కించుకుంది. అంతకుముందు 1968, 1972 లో కంచు పతకాలు సాధించింది.

భారత్ సాధించిన ఈ విజయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. “హాకీ మన జాతీయ క్రీడ. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా ఒలింపిక్స్ లో భారత జట్టు ప్రదర్శన ఆశాజనకంగా లేదు. రియో ఒలింపిక్స్ లో అత్యంత దారుణంగా ఇంటిదారి పట్టింది. కానీ ఈసారి సత్తా చాటింది. బెల్జియం చేతిలో అనూహ్యమైన స్థితిలో ఓడిపోయింది గాని.. లేకుంటే భారత్ స్వర్ణం గెలిచేది. ఏది ఏమైనప్పటికీ మన జట్టు ఆటగాళ్ల ప్రదర్శన బాగుంది. మొత్తానికి మెడల్ సాధించారు. కొడిగడుతున్న హాకీలో సరికొత్త ఆశలను రేకెత్తించారు. ఆటగాళ్లకు మా శుభాకాంక్షలు” అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. భారత జట్టు ఇలానే మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు హాకీకి పూర్వ వైభవం తీసుకురావాలని అభిలాషిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందించాలని విన్నవిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular