HomeతెలంగాణCM Revanth Reddy : రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళింది పెట్టుబడుల కోసం కాదా?.. తెరపైకి...

CM Revanth Reddy : రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళింది పెట్టుబడుల కోసం కాదా?.. తెరపైకి షాకింగ్ వీడియో..

CM Revanth Reddy :  గత కొద్దిరోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వంటి వారు ఉన్నారు. రేవంత్ పర్యటనలో భాగంగా అనేక కంపెనీలు ఎంవోయూ లు కుదుర్చుకుంటున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.. ఈ క్రమంలో పలు సదస్సుల్లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. పలు బహుళ జాతి సంస్థలకు చెందిన సీఈఓ లతో సమావేశం అవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణ పునర్నిర్మాణం లో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు.. ఈ క్రమంలో తన పర్యటనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో ఆయన పంచుకుంటున్నారు. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం, ఆ పార్టీ అనుబంధ పత్రిక, ఛానల్, సోషల్ మీడియా ఛానల్స్ రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా ప్రచారం చేపడుతున్నాయి. ఆయన అమెరికా వెళ్ళింది షెల్ కంపెనీల కోసమేనని మండిపడుతున్నాయి. ఇదే సమయంలో తెరపైకి సంచలన విషయాలను తీసుకొస్తున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీకి ఎటువంటి గొప్ప నేపథ్యం లేదని.. అటువంటి కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తెరపైకి అనేక విషయాలను తీసుకొస్తున్నారు. “స్వయంగా ముఖ్యమంత్రి సోదరుడు ఎనుముల జగదీశ్వర్ రెడ్డి స్వచ్ఛగ్రీన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. సరిగా 15 రోజుల క్రితం ఏర్పాటుచేసిన ఆ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. ఇది ముమ్మాటికి బోగస్ కంపెనీ. అలాంటి కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం పెద్ద స్కాం” అంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు ఆధారాలతో వీడియోలు విడుదల చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ నాయకులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

“కేటీఆర్ హయాంలో అమెరికా చాలాసార్లు వెళ్లారు.. దావోస్ చాలాసార్లు వెళ్లారు. ఎన్నో కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందులో ఎన్ని కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి? చివరికి మా హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును లీజుకి ఇచ్చారు. ఐ అండ్ఎం అనే ఫ్రాడ్ కంపెనీకి గుంప గుత్తగా దోచిపెట్టారు. మేము అలాంటి పనులు చేయలేదు కదా. ప్రతి విషయంలోనూ పారదర్శకతను పాటిస్తున్నాం కదా. చివరికి పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా క్లారిటీ ఇచ్చారు కదా. ఇంతకంటే మీకు ఏం కావాలి.. ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోవాలని” కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.

మొత్తానికి ముఖ్యమంత్రి అమెరికా పర్యటన అటు భారత రాష్ట్ర సమితి, ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య సోషల్ మీడియా యుద్ధానికి దారి తీసింది. ఏ పార్టీ మీడియా ఆ పార్టీకి ఉండడంతో.. ఇందులో ఎవరి వాదన సరైనదో అర్థం కావడం లేదని సామాన్య జనం చర్చించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకునేవారని.. కానీ ఇప్పుడు ఎన్నికలు లేకపోయినప్పటికీ రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వాపోతున్నారు. ఇలాంటి రాజకీయాల వల్ల వాస్తవాల కంటే విమర్శలే ఎక్కువగా వ్యాప్తిలో ఉంటున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular