
ఒలింపిక్స్ లో భారతదేశం ఇప్పటి వరకు కేవలం 9 గోల్డ్ మెడల్స్ సాధించగా.. అందులో 8 బంగారు పతకాలు ఒక్క హాకీలోనే సాధించింది. హాకీ క్రీడలో ఇండియా కెపాసిటీ ఎంత అన్న విషయం చెప్పడానికి ఈ లెక్కలు చాలు. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన భారత హాకీ ప్రాభవం.. కొంతకాలంగా మసకబారిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో టోక్యోలో ప్రారంభమైన ఒలింపిక్స్ లో భారత హాకీజట్టు శుభారంభం చేసింది. తొలి పోరులోనే విజయం సాధించింది.. గ్రాండ్ ఓపెనింగ్ దక్కించుకుంది.
న్యూజిలాండ్ తో జరిగిన పురుషుల హాకీ మ్యాచ్ లో.. 3-2 తేడాతో టీమిండియా జయకేతనం ఎగరేసింది. హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ తో, రేఊపిందర్ పాల్ సింగ్ ఒక గోల్ తో సత్తా చాటగా.. గోల్ కీపర్ శ్రీజేశ్ ప్రత్యర్థులను సమర్థవంతంగా అడ్డుకోవడంతో.. భారత జట్టు గెలుపు జెండా ఎగరేసింది.
మ్యాచ్ మొదలైన ఆరో నిమిషంలోనే న్యూజిలాండ్ జట్టు ఖాతా తెరించింది. పెనాల్టీ కార్నర్ ను సద్వినియోగం చేసుకున్న కేన్ రసెల్.. అద్భుతమైన గోల్ సాధించాడు. అయితే.. మరో నాలుగు నిమిషాల్లోనే భారత్ స్కోరును సమం చేసింది. రూపిందర్ సింగ్ భారత్ తరపున తొలి గోల్ కొట్టాడు. స్కోర్ ఈక్వల్ కావడంతో.. రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
ఈ క్రమంలోనే.. 26వ నిమిషంలో హర్మన్ ప్రీత్ గోల్ సాధించడంతో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లిది. ఆ తర్వాత 33వ నిమిషంలోనూ హర్మన్ ప్రీత్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచడంతో భారత్ 3-1తో మరింత ఆధిక్యాన్ని చాటింది. కాగా.. మరో 10 నిమిషాల వ్యవధిలో కివీస్ ఆటగాడు జోసెఫ్ గోల్ తో స్కోరు 2-3గా మారింది.
మ్యాచ్ ముగుస్తున్నకొద్దీ.. న్యూజిలాండ్ దూకుడు ప్రదర్శించింది. పెనాల్టీ కార్నర్లు సాధించినప్పటికీ.. భారత గోల్ కీపర్ శ్రీజేశ్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఆ విధంగా.. భారత్ విజయం సాధించింది. ఇదిలాఉంటే.. ఆదివారం టాప్ జట్టు ఆస్ట్రేలియాలో తలపడనుంది.