T20 Worldcup: భారత జట్టుకు దారుణ పరాభవం.. కారణం అదేనా?

T20 Worldcup: 90వ దశకంలో క్రికెట్ అభిమానులు టీవీల ముందు కూర్చునే తీరు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మ్యాచ్ చూస్తున్నామన్న ఆనందం కన్నా.. భయమే వారి గుండెల్లో ఎక్కువగా కనిపించేది. ముఖంలో సంతోషం కన్నా.. టెన్షనే ఎక్కువగా కనిపించేది. అంతే మరి, సచిన్, గంగూలి, సెహ్వాగ్ వంటి ఓపెనర్లు ఔట్ అయితే.. మ్యాచ్ కష్టాల్లో పడ్డట్టే అనేది ప్రేక్షకుల నమ్మకం. ఆ తర్వాత ఇద్దరో, ముగ్గురో మిడిలార్ బ్యాటర్లు వికెట్ పారేసుకుంటే.. మ్యాచ్ గోవిందా గో..విందా […]

Written By: Bhaskar, Updated On : November 1, 2021 12:29 pm
Follow us on

T20 Worldcup: 90వ దశకంలో క్రికెట్ అభిమానులు టీవీల ముందు కూర్చునే తీరు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మ్యాచ్ చూస్తున్నామన్న ఆనందం కన్నా.. భయమే వారి గుండెల్లో ఎక్కువగా కనిపించేది. ముఖంలో సంతోషం కన్నా.. టెన్షనే ఎక్కువగా కనిపించేది. అంతే మరి, సచిన్, గంగూలి, సెహ్వాగ్ వంటి ఓపెనర్లు ఔట్ అయితే.. మ్యాచ్ కష్టాల్లో పడ్డట్టే అనేది ప్రేక్షకుల నమ్మకం. ఆ తర్వాత ఇద్దరో, ముగ్గురో మిడిలార్ బ్యాటర్లు వికెట్ పారేసుకుంటే.. మ్యాచ్ గోవిందా గో..విందా అనుకునేవారు. నిన్న న్యూజిలాండ్ తో మ్యాచ్ చూసిన తర్వాత అందరికీ.. అలనాటి మ్యాచులు గుర్తొచ్చాయంటే అతిశయోక్తి కాదు. అసలు ఇది మన జట్టేనా? అనే డౌట్ వచ్చింది చాలా మందికి. మరి, ఈ పరిస్థితికి కారణమేంటి?

india vs new zealand

తమ పేలవ ఆటతీరుకు.. మన ఆటగాళ్లు పిచ్ ను నిదించొచ్చు. నిజానికి పిచ్ ప్రభావం ప్రముఖంగానే ఉంది. కానీ.. మొత్తం తప్పును పిచ్ పైనే నెట్టేసే పరిస్థితి లేదు. ఎందుకంటే.. మొదటగా ఈ పిచ్ లతో మనోళ్లకు పరిచయం ఉంది. ఐపీఎల్ సగం ఇక్కడే జరిగింది. కాబట్టి ఇతర జట్లతో పోలిస్తే.. భారత ఆటగాళ్లు పిచ్ స్వభావాన్ని ఆకళింపు చేసుకొనే అవకాశం ఉంది. కాబట్టి పిచ్ ను పూర్తిగా నిదించడానికి లేదు. రెండోది.. మన బ్యాటర్ల షాట్ సెలక్షన్ దారుణంగా ఉంది. అసలు, క్రీజులో నిలబడదామనే ఆలోచన ఉన్నట్టు ఎవరూ కనిపించలేదు. ఒకరి తరాత ఒకరుగా వచ్చి వెళ్లిపోయారు.

ఎంత టీ20 అయితే మాత్రం.. గ్రౌంద్ షాట్లు ఆడరా? బంతిని గాల్లో లేపితేనే పొట్టి ఫార్మాట్ అవుతుందా? అవుటైన వాళ్లలో మెజారిటీ షాట్లకు యత్నించి వెనుదిరిగిన వాళ్లే. బంతి బ్యాట్ మీదకు రాకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు అలా గాల్లోకి లేపాల్సిన అవసరం ఉందా? ఇక, సింగిల్స్, డబుల్స్ గురించి మరిచే పోయారు. పరిస్థితికి అనుగుణంగా ఆడటం కాకుండా.. బంతిని పెవిలియన్ కు పంపించడమే లెక్క అన్నట్టుగా ఆడారు.. వెళ్లి పెవిలియన్ లో కూర్చున్నారు.

ఈ వీధమైన ఆట తీరు ద్వారా.. మరోసారి అభిమానులను నిరాశ పరిచారు. ఎప్పుడో 2007లో తొలి కప్పు గెలుచుకున్న జ్ఞాపకాలనే మిగిల్చే పని చేశారు. ఆటగాళ్ల ఆటతీరు ఒకెత్తయితే.. జట్టు కూర్పు కూడా సరిగా లేదనే అభిప్రాయం ఉంది. ఓపెనర్ గా ఇషాన్ కిషన్ ఎందుకు వచ్చాడో తెలియలేదు. రోహిత్ తర్వాత రావడం వల్ల ఉపయోగమూ లేదు. బౌలింగ్ లో భువీని కాదని, శార్దూల్ ను తీసుకుంటే.. అతను ఓటమిని త్వరగా తెచ్చాడు. ఇక, హార్దిక్ పాంఢ్య మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. స్పిన్నర్ వరుణ్ కూడా తేలిపోయాడు. మొత్తంగా.. ఓపిక అనేదే లేకుండా.. బండ బాదుడే సరైనదనే తీరును అనుసరించి తగిన మూల్యం చెల్లించుకున్నారు.