Harmanpreet Kaur Captaincy: స్వదేశంలో మహిళల వన్డే వరల్డ్ కప్ ను ఐసీసీ నిర్వహిస్తోంది. భారత జట్టుతో పాటు శ్రీలంక కూడా సహా ఆతిథ్యం ఇస్తోంది. భారత్ పాకిస్తాన్ తో మినహా.. మిగతా మ్యాచ్లను దాదాపు స్వదేశం వేదికగానే ఆడుతోంది. మనదేశంలోని మైదానాలు మహిళ క్రికెటర్లకు కొట్టినపిండి. ఇలాంటి దశలో దూకుడుగా ఆడాల్సింది పోయి మన క్రికెటర్లు చేతులెత్తేస్తున్నారు. బ్యాటింగ్ విషయంలో కాస్త పరవాలేదు అనుకున్నప్పటికీ.. బౌలింగ్ విషయంలో మాత్రం దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నారు. అందువల్లే టీమిండియా వరుస ఓటములను ఎదుర్కొంటోంది.
వన్డే వరల్డ్ కప్ లో ప్రారంభ మ్యాచ్ శ్రీలంకతో ఆడిన టీమిండియా విజయం సాధించింది. అదే ఊపును పాకిస్తాన్ జట్టుపై కూడా కొనసాగించింది. అయితే ఆ తదుపరి రెండు మ్యాచ్లలో మాత్రం తీవ్ర ఒత్తిడికి గురైంది. మెరుగ్గా ఆడాల్సిన సమయంలో ప్రత్యర్థుల ఎదుట తలవంచింది. తద్వారా ఊహించని ఓటములను ఎదుర్కొంది. దీంతో పాయింట్లు పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుత వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ వెళ్ళిపోవాలంటే తదుపరి మూడు మ్యాచ్లను గెలవాల్సి ఉంటుంది. అది కూడా భారీ అంతరంతో నెగ్గాల్సి ఉంటుంది. అది జరగాలంటే టీమిండియా వైఫల్యాలను పక్కన పెట్టాలి. మెరుగైన ఆట తీరును కొనసాగించాలి. ముఖ్యంగా విఫలమవుతున్న బౌలింగ్ విభాగంలో సమర్థతను చూపించాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 330 పరుగులు చేసినప్పటికీ ఓడిపోయింది. ఈ ఓటమిని భారత అభిమానులు అంత త్వరగా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇలా టీమ్ ఇండియా వరుసగా ఓటములు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అని అభిమానులు ఆరోపిస్తున్నారు. గెలవాల్సిన మ్యాచ్లలో ఆమె వల్లే ఓడిపోయామని బాధపడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్లలో హర్మన్ 21, 19, 9, 22 పరుగులు మాత్రమే చేయడానికి వారు ఉదహరిస్తున్నారు. ఆమెను కెప్టెన్సీ నుంచి తొలగించి ఇతర ప్లేయర్లకు అవకాశం కల్పించాలని బీసీసీఐ ని డిమాండ్ చేస్తున్నారు.
టీమిండియా ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లను టీమిండియా ఎదుర్కోవాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్లలో కూడా టీమిండియా భారీ తేడాతో గెలుపును సొంతం చేసుకోవాలి. అలా చేస్తేనే సెమీస్ వెళ్లిపోవడానికి అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో మిగతా జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. మిగతా జట్ల మీద ఆధారపడదానికంటే టీమిండియా వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి సెమీస్ బెర్త్ సిద్ధం చేసుకోవడం మంచిదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.