https://oktelugu.com/

Surya Kumar Yadav: ఓ సూరీడు ఏమైందీ నీకు.. మైదానంలో భగభగ మండి ఎన్ని రోజులైందో తెలుసా?

ఎలాంటి బంతులు వేసినా.. బలంగా కొడతాడు.. ఎక్కడ వేసినా గట్టిగా కొడతాడు.. ఎటువైపు సంధించినా సూటిగా కొడతాడు.. ఇంతటి ఉపోద్ఘాతంలో వేయడం కామన్ కాదు.. కొట్టడం కామన్.. అందువల్లే సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) టీమ్ ఇండియాలో తిరుగులేని స్టార్ ఆటగాడిగా మారిపోయాడు. మిస్టర్ 360 డిగ్రీస్ బిరుదాంకితుడయ్యాడు.. అయితే అటువంటి ఆటగాడు నేడు ఫామ్ కోల్పోయి.. తీవ్ర విమర్శలు పాలవుతున్నాడు.

Written By: , Updated On : January 29, 2025 / 07:00 PM IST
Surya Kumar Yadav

Surya Kumar Yadav

Follow us on

Surya Kumar Yadav: ఒకసారి గట్టిగా ఆడుతాడు.. మరోసారి సులువుగా తేలిపోతాడు.. అసలు ఇతడు జట్టులోకి ఎలా వచ్చాడు? స్థిరత్వం లేకుండా ఎన్ని రోజులపాటు ఎలా ఉండగలుగుతున్నాడు? పైగా కెప్టెన్ గా ఎలా వ్యవహరించ గలుగుతున్నాడు” ఇవీ రాజ్ కోట్ లో సూర్య కుమార్ యాదవ్ విఫలమైన తర్వాత ఓ స్పోర్ట్స్ ఛానల్ లో ఎనలిస్ట్ నోటి ద్వారా వినిపించిన మాటలు. ఆ మాటలకు తగ్గట్టుగానే సూర్య కుమార్ యాదవ్ ఆటతీరు కొనసాగుతోంది. వాస్తవానికి సూర్య కుమార్ యాదవ్ గడచిన 5 ఇన్నింగ్స్ లలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. 1, 0, 0, 12, 14 పరుగులు మాత్రమే చేశాడు. వాస్తవానికి టీమిండియాలో ప్రతి స్థానానికి విపరీతమైన పోటీ ఉంటుంది.. కానీ ఇంత చెత్త ఆట ఆడుతున్నప్పటికీ.. ఇంత దారుణమైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఎలా కొనసాగుతున్నాడనేది ఇప్పటికీ అంతు పట్టని ప్రశ్న.

అతడు ఆడక పోవడం వల్లే..

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. కోల్ కతా లో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ వీర విహారం చేశాడు. తద్వారా భారత్ విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చివరికి ఆ మ్యాచ్ లోనూ గెలుపు ముందు ఇంగ్లాండ్ జట్టు బోల్తా పడింది. కానీ మూడవ మ్యాచ్ విషయానికి వచ్చేసరికి పరిస్థితి ఒకసారిగా మారిపోయింది. అభిషేక్ శర్మ వేగంగా ఆడే క్రమంలో అవుట్ కావడం.. తిలక్ వర్మ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కావడంతో పరిస్థితి ఒకసారి గా మారిపోయింది. ఈ దశలో జట్టు కెప్టెన్ గా.. కీలకమైన ఆటగాడిగా సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడాల్సిన సూర్య కుమార్ యాదవ్ చేతులెత్తేశాడు. షార్ట్ పిచ్ బంతికి బోల్తాపడ్డాడు. వ్యూహాత్మకంగా ఆడాల్సిన చోట.. బలంగా బ్యాటింగ్ చేయాల్సిన చోట సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యాడు. పదేపదే విఫల షాట్లు ఆడి ప్రత్యర్థి బౌలర్లకు దొరికిపోయాడు.. వాస్తవానికి మూడవ మ్యాచ్ లోనూ సూర్య కుమార్ యాదవ్ ను లక్ష్యంగా చేసుకొని ఇంగ్లాండ్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులను వేశారు. వాటిని ఆడటంలో సూర్య కుమార్ యాదవ్ విఫలమయ్యాడు..

గత టి20 ప్రపంచ కప్ ను టీమిండియా గెలిచింది. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma) వైదొలిగాడు. గత ఏడాది జింబాబ్వే జట్టుతో జరిగిన టీ 20 సిరీస్ కు గిల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా, గిల్ ను కాదని కోచ్ గౌతమ్ గంభీర్ సూర్య కుమార్ యాదవ్ కు బాధ్యతలు అప్పగించాడు. ఆ తర్వాత సూర్య ఆధ్వర్యంలో టీమిండియా శ్రీలంక, బంగ్లా, సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ లను గెలుచుకుంది.. కానీ బ్యాటింగ్ పరంగానే సూర్యకుమార్ యాదవ్ విఫలమవుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టి20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ వరల్డ్ కప్ నాటికైనా సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లోకి రాకపోతే నాయకుడిగా, ఆటగాడిగా తన స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు.