India Vs USA: భారత్ గెలిచింది.. పాకిస్తాన్ ఖుషి.. ఎందుకంటే?

ఇప్పటివరకు అమెరికా జట్టు మూడు మ్యాచ్లు ఆడింది.. రెండు విజయాలు, ఒక పరాజయంతో కొనసాగుతోంది. +0.127 నెట్ రన్ రేట్ తో రెండవ స్థానంలో కొనసాగుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 13, 2024 3:25 pm

India Vs USA

Follow us on

India Vs USA: టి20 వరల్డ్ కప్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. ముఖ్యంగా సూపర్ -8 రేసు రసవత్తరంగా మారింది. ఐసీసీ ఏర్పాటుచేసిన నాలుగు గ్రూపులలో, ప్రతి గ్రూప్ నుంచి టాప్ -2 లో నిలిచే జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి. గ్రూప్ – ఏ నుంచి భారత్ సూపర్ -8 కు వెళ్లిపోయింది. ఇక ఈ గ్రూపులో మరో బెర్త్ కోసం అమెరికా, పాకిస్తాన్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి..బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్లో అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా భారత్ సూపర్ -8 కు చేరుకుంది. ఈ విజయం భారత్ కంటే పాకిస్థాన్ కు ఎక్కువ లాభం చేకూర్చింది.

ఇప్పటివరకు అమెరికా జట్టు మూడు మ్యాచ్లు ఆడింది.. రెండు విజయాలు, ఒక పరాజయంతో కొనసాగుతోంది. +0.127 నెట్ రన్ రేట్ తో రెండవ స్థానంలో కొనసాగుతోంది.. మరో వైపు పాకిస్తాన్ 3 మ్యాచులు ఆడగా, ఒకదాంట్లో మాత్రమే నెగ్గింది. +0.191 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో కొనసాగుతోంది. బుధవారం భారత జట్టు చేతిలో అమెరికా ఓడిపోవడంతో, నెట్ రన్ రేట్ ను కోల్పోయింది. ఈ ప్రకారం అమెరికా కంటే పాకిస్తాన్ పటిష్ట స్థితిలో కనిపిస్తోంది. ఫలితంగా సూపర్ -8 కు వెళ్లేందుకు పాకిస్తాన్ జట్టుకు లైన్ క్లియర్ అయింది.. అలాగని పాకిస్తాన్ సూపర్ -8 కు వెళ్లడం అంత ఈజీ కాదు. భారత్ పరోక్షంగా సహాయం చేసినప్పటికీ.. మిగిలిన ఫలితాలపై పాక్ ఆధారపడాల్సి ఉంది. పాకిస్తాన్ సూపర్ -8 కు అర్హత సాధించాలంటే తన చివరి మ్యాచ్లో ఐర్లాండ్ పై తప్పకుండా గెలవాలి. మరోవైపు ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోవాలి.

ఇలా జరిగితేనే నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా పాకిస్తాన్ సూపర్ -8 కు వెళ్ళిపోతుంది. కానీ, రోహిత్ సేనకు బుధవారం గట్టి పోటీ ఇచ్చిన అమెరికా.. ఐర్లాండ్ ముందు తలవంచడం అంత ఈజీ కాదు. మరోవైపు పాకిస్తాన్ – ఐర్లాండ్ మ్యాచ్ కు వర్షం ఆటంకం కల్పించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అమెరికా – ఐర్లాండ్, పాకిస్తాన్ – ఐర్లాండ్ మ్యాచ్ లకు వర్షం అడ్డంకిగా మారుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు మ్యాచ్లలో ఏ ఒక్కటి రద్దయినా పాకిస్తాన్ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.

శుక్రవారం అమెరికా – ఐర్లాండ్ జట్లు తలపడే మ్యాచ్ రద్దయితే.. రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.. అప్పుడు అమెరికా ఖాతాలో ఐదు పాయింట్లు ఉంటాయి. ఆ తర్వాత ఐర్లాండ్ పై పాకిస్తాన్ విజయం సాధించినప్పటికీ, ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. దీంతో పాయింట్లు పరంగా అమెరికా ను పాకిస్తాన్ బీట్ చేసే అవకాశం లేదు. ఒకవేళ అమెరికా ఐర్లాండ్ చేతిలో ఓడిపోతే.. ఐర్లాండ్ జట్టుతో ఆడే మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే.. పాకిస్తాన్ జట్టుకు తీవ్ర నష్టమే.. అప్పుడు అమెరికా 4, పాకిస్తాన్ 3 పాయింట్లతో లీగ్ దశను ముగిస్తాయి.