TS Government Schools: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షాక్‌.. పుస్తకాలన్నీ వెనక్కి!

విద్యాశాఖ పుస్తకాలు వాసస్‌ తీసుకోవడానికి ప్రధాన కారణం.. పుస్తకాల్లో ముందు మాట మార్చకపోవడమే అని తెలుస్తోంది. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌.. ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో ముద్రించి పంపిణీ చేసింది.

Written By: Raj Shekar, Updated On : June 13, 2024 3:29 pm

TS Government Schools:

Follow us on

TS Government Schools: తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు బుధవారం(జూన్‌ 12న) తెరుచుకున్నాయి. పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తొలి రోజే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈమేరకు ఇప్పటికే పాఠశాలకు టర్మ్‌ – 1కు సంబంధించిన పాఠ్య పుస్తకాలను చేర్చింది. యూనిఫాం స్టిచ్చింగ్‌ చాలాచోట్ల పూర్తయింది. కొన్ని చోట్ల కొనసాగుతోంది. దీంతో మొదటి రోజే అన్ని పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. దీంతో తొలి రోజు పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు కొత్త పుస్తకాలను చూసి మురిసిపోయారు.

అంతలోనే షాక్‌..
పుస్తకాలు చూసుకుని విద్యార్థులు సంతోషంగా ఉన్న సమయంలోనే ప్రభుత్వం షాకింగ్‌ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలన్నీ వాపస్‌ తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయులు పంపిణీ చేసి పుస్తకాలన్నీ తిరిగి తీసుకునే పనిలో ఉన్నారు.

ఎందుకంటే…
విద్యాశాఖ పుస్తకాలు వాసస్‌ తీసుకోవడానికి ప్రధాన కారణం.. పుస్తకాల్లో ముందు మాట మార్చకపోవడమే అని తెలుస్తోంది. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌.. ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో ముద్రించి పంపిణీ చేసింది. ఈసారి పుస్తకాలు ముద్రించిన తెలుగు అకాడమీ.. ముందు మాట మార్చలేదు. దీంతో అన్ని పుస్తకాల్లో పాత ముందుమాటనే ముద్రించింది. ఇందులో పొరపాట్లు ఉన్నాయి. పొరపాటును గుర్తించిన ఉపాధ్యాయులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

పుస్తకాలపై వారి ఫొటోలు..
మరోవైపు పుస్తకాలపై మాజీ సీఎం కేసీఆర్‌ ఫొటోతోపాటు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, సంజాలకులు జగదీశ్వర్‌ పేర్లు కూడా ఉన్నాయి. దీంతో అలర్ట్‌ అయిన విద్యాశాఖ అన్ని పాఠ్య పుస్తకాలను వాపస్‌ తీసుకోవాలని ఆదేశించింది.

కొత్తవి ఎప్పడో..
పాఠ్య పుస్తకాలు వాపస్‌ తీసుకున్న విద్యా శాఖ, కొత్తవి ఎప్పుడు పంపిణీ చేస్తారు.. పుస్తకాల్లో ముందు మాట మార్చడానికి ఎంత సమయం పడుతుంది.. అప్పటి వరకు పాఠాలు ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటామనే విషయంలో ప్రభుత్వం నుంచిగానీ, విద్యా శాఖ నుంచిగానీ ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.