India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా అనామకమైన వారా.. గొప్ప రికార్డులు లేనివారా అంటే.. అన్ని ఉన్నాయి. కానీ ఉపయోగం లేదు. సమయానికి నిలబడి కొట్టేవాడు లేడు. అవసరానికి భుజం కాసేవాడు లేడు. అందువల్లే వరుస ఓటములు. పొట్టి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఇలా రెండు సిరీస్ లు కోల్పోవడం అంటే మామూలు దారుణం కాదు.
నాయకుడిగా వరుసగా ఆరు ఓటములు.. రెండు సిరీస్ లు కోల్పోయిన తర్వాత.. ఇక చాలా బాబు నీ సేవలు అంటూ అందరూ అయ్యర్ మీద దుమ్ము ఎత్తిపోయడం మొదలుపెట్టారు. ఇటువంటి ఆటగాడిని సారధిగా ఎలా చేశారు రా బాబు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలు మొదలుపెట్టారు. గంభీర్ ను ఘోరంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇదంతా కూడా అయ్యర్ మీద ఒత్తిడి తెచ్చింది. దీంతో జింబాబ్వే టూర్ లో తాను ఏమిటో నిరూపించుకోవాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే జింబాబ్ మీద మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ టీమ్ ఇండియా సొంతమయ్యేలా చేశాడు.
ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన టీమ్ ఇండియా.. శనివారం జరిగిన రెండో మ్యాచ్లో ఏకంగా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎప్పటి మాదిరిగానే అభిషేక్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. వైభవ్ సూర్య వంశీ 20 పరుగులు చేసి వెళ్లిపోయాడు. ఈ దశలో ఇషాన్ కిషన్ 81.. తిలక్ వర్మ 60 పరుగులతో ఆకట్టుకున్నారు. వీరిద్దరి దూకుడు వల్ల టీమిండియా స్కోర్ రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది. కెప్టెన్ అయ్యర్ 25 పరుగులు చేశాడు. రింకు సింగ్ 12 పరుగులు.. శివం దుబే 6* పరుగులు చేశారు. జింబాబ్వే బౌలింగ్ సరిగా లేకపోవడంతో టీమ్ ఇండియా ప్లేయర్లు ఆటాడుకున్నారు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేశారు.
220 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లను ఎదుర్కోలేక జింబాబ్వే ప్లేయర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.. జింబాబ్వే జట్టులో మరుమని 24.. బర్ల్ 20 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు.. అభిషేక్ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు. యశ్ ఠాగూర్, ప్రిన్స్ యాదవ్ చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. టీమిండియా సిరీస్ గెలిచినప్పటికీ.. అభిమానులలో పెద్దగా ఆనందం లేదు. ఎందుకంటే టీమిండియా స్థాయికి కొట్టాల్సింది కుంభస్థలాన్ని.. జింబాబ్వేలాంటి పిల్ల బాతు బచ్చాలను కాదు..







