https://oktelugu.com/

India Vs Zimbabwe: ఉక్కు నరాలు, ఉడుకు నెత్తురు కు తొలి పరీక్ష.. నేటినుంచి జింబాబ్వేతో టి20 సిరీస్..

టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో యావత్ దేశం మొత్తం మధుర క్షణాల్లో మునిగిపోయింది. విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు జాతి మొత్తం ఘన స్వాగతం పలికింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 6, 2024 / 10:28 AM IST

    India Vs Zimbabwe

    Follow us on

    India Vs Zimbabwe: ఐపీఎల్ లో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు సువర్ణావకాశం లభించింది.. విరాట్, రోహిత్, రవీంద్ర జడేజా వంటి వారు పొట్టి ఫార్మాట్ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో.. “జనరేషన్ జెడ్ కిడ్స్” తమ సత్తా చాటే సమయం దక్కింది.. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో.. యంగ్ ప్లేయర్లు తమను తాము నిరూపించుకునేందుకు అదును లభించింది. 2026లో నిర్వహించే టి20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని సీనియర్ స్థానాలను భర్తీ చేయాలని భావిస్తున్న బీసీసీఐని.. యువ ఆటగాళ్లు ఏ మేరకు ఆకట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

    టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో యావత్ దేశం మొత్తం మధుర క్షణాల్లో మునిగిపోయింది. విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు జాతి మొత్తం ఘన స్వాగతం పలికింది. ఈ క్రమంలో భారత క్రికెట్ అభిమానులను మరింత ఆనందింపజేసేందుకు మరో ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు యువ భారత్ జింబాబ్వే వెళ్ళింది. శనివారం జింబాబ్వే నుంచి యంగ్ ప్లేయర్లకు తొలి పరీక్ష ఎదురనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన కుర్రాళ్ళు, లోగడ భారత జట్టులో అప్పుడప్పుడు ఆడిన ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు ఇదే సదావకాశం. గిల్ ఆధ్వర్యంలో.. భారత యువ జట్టు బరిలోకి దిగనుంది. ఈ సిరీస్ ద్వారా తదుపరి టి20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ సన్నాహకాలు కూడా మొదలుపెట్టింది. ఇక గత 15 సంవత్సరాలుగా టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మోసిన రోహిత్, కోహ్లీ.. టి20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. అయితే వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్ల కసరత్తు సైతం ఈ సిరీస్ తో మొదలవుతుందని తెలుస్తోంది.

    అదిరిపోయే అవకాశం

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ జట్టు తరఫున అభిషేక్ శర్మ, రాజస్థాన్ జట్టు తరఫున రియాన్ పరాగ్, తుషార్ దేశ్ పాండే, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లకు జాతీయ జట్టు నుంచి పిలుపు రావడం ఇదే తొలిసారి. అయితే వీరిలో తుషార్ మినహా మిగతావారు మొత్తం అంతర్జాతీయ టీ – 20 లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది..ఈ సిరీస్ లో గిల్ తన బాల్యమిత్రుడు అభిషేక్ తో ఓపెనింగ్ బాధ్యతను భుజాలకు ఎత్తుకోనున్నాడు. దీంతో భారత జట్టుకు మెరుపు ఆరంభం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక మూడవ స్థానంలో రుతు రాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్ వంటి హిట్ బ్యాటర్లతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. జితేష్ శర్మ ఉన్నప్పటికీ ధృవ్ జూరెల్ కీపింగ్ చేపట్టే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో ఆల్ రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్ ఉండడంతో ఎనిమిదో స్థానం దాకా టీమిండియా కు బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు.. ప్రత్యేకమైన స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ ఉన్నాడు. పేస్ బౌలర్ గా ఆవేశ్ ఖాన్ సిద్ధంగా ఉన్నాడు. అతడికి తోడుగా ఎవర్ని ఆడిస్తారనేది తెలియాల్సి ఉంది.. ఖలీల్, ముఖేష్ లో ఎవరో ఒకరికి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది.

    ఇక జింబాబ్వే జట్టు గత మూడు నాలుగు సంవత్సరాలుగా పర్వాలేదనే స్థాయిలో ఆటను ప్రదర్శిస్తోంది. సికిందర్ రజా కెప్టెన్ అయిన తర్వాత.. ఆ జట్టు బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక దేశాల తో జరిగిన మ్యాచ్లలో స్థిరంగా రాణించింది. భారత యువ జట్టుతో జరుగుతున్న సిరీస్ లో జింబాబ్వే తిరిగి పుంజుకునేందుకు గొప్ప అవకాశం. దీనిని జింబాబ్వే ఎంతవరకు ఉపయోగించుకుంటుందనేది చూడాలి.

    జట్ల అంచనా ఇలా

    టీమిండియా

    గిల్(కెప్టెన్), అభిషేక్ , రుతు రాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, జురెల్, జితేష్, వాషింగ్టన్ సుందర్, ఆవేష్ ఖాన్, తుషార్ దేశ్ పాండే, ఖలీల్.

    జింబాబ్వే

    సికిందర్ (కెప్టెన్), బెన్నెట్, మరుమని, క్యాంప్ బెల్, నక్వి, మదాండే, మాదేవేరే, లూక్ జ్వొంగే, ఫరాజ్ అక్రమ్, మసకద్జ, ముజర్బనీ.