India Vs USA T20 World Cup: టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు గ్రూప్ – ఏ లో టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో విజయాన్ని సాధించి అదరగొట్టింది.. ఐర్లాండ్ జట్టుపై సునాయాసంగా నెగ్గిన రోహిత్ సేన.. పాకిస్తాన్ పై మాత్రం చివరిదాకా పోరాడింది. బౌలర్ల అద్భుతమైన ప్రదర్శనతో విజయతీరాలకు చేరింది. రెండు మ్యాచ్లలో భారత్ గెలిచినప్పటికీ అభిమానుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది.
పాక్ తో జరిగిన మ్యాచ్లో మైదానం నుంచి అత్యంత క్లిష్టమైన సవాల్ ఎదుర్కొన్న టీం ఇండియా.. 119 పరుగులకే ఆల్ అవుట్ అయింది. మందకొడి మైదానంపై పరుగులు చేయడం భారత బ్యాటర్లకు కష్టమైపోయింది. భారత బ్యాటర్లు అత్యంత సులువుగా వికెట్లు సమర్పించుకోవడం అభిమానులను నివ్వెరపరిచింది. 10 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న టీమిండియా.. ఆ తర్వాత 9 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే చేసి.. ఏడు వికెట్ల కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్, శివం దుబే దారుణంగా ఆడారు. సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ జట్టుపై తన పేలవ రికార్డును కొనసాగించాడు. 8 బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసి హరీస్ రౌఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.. పాకిస్తాన్ తో జరిగిన టి20 లలో వరుసగా 11, 18, 15, 7 పరుగులు చేశాడు.. ఇక వరల్డ్ కప్ లో స్థానం సంపాదించిన తర్వాత శివం దూబే ఆట తీరు దారుణంగా మారింది. అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు.. పైగా ఫీల్డింగ్ లోనూ అంత చురుకుగా కనిపించలేకపోతున్నాడు.
టీమిండియా కు సెలెక్ట్ అయిన తర్వాత ఐపీఎల్లో వరుసగా రెండుసార్లు గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మూడుసార్లు మాత్రమే పర్వాలేదనిపించాడు. ఆ మూడు మ్యాచ్లలో అతడి అత్యధిక స్కోరు 21 మాత్రమే. ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. స్పిన్నర్ల బౌలింగ్లో అద్భుతంగా ఆడతాడని భావించి శివం దూబేను ఎంపిక చేస్తే.. సింగిల్స్ తీయడానికే తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మహమ్మద్ రిజ్వాన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ ను మిస్ చేశాడు..
ఇన్ని వైఫల్యాలు ఉన్న నేపథ్యంలో ధోని శిష్యుడైన శివం దూబేను అమెరికాతో జరిగే మ్యాచ్ కు పక్కన పెడతారని ప్రచారం జరుగుతుంది. అతని స్థానంలో రింకూ సింగ్ కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.. వాస్తవానికి టీమిండియాకు ఎంపికైనప్పటికీ రింకూ సింగ్ జట్టులో సభ్యుడు కాదు. అతడు కేవలం రిజర్వ్ ఆటగాడిగా మాత్రమే ఎంపికయ్యాడు. అనుకోకుండా ఎవరైనా ఆటగాళ్లు గాయపడితే వారి స్థానంలో ఆడించేందుకు రింకూ, శుభ్ మన్ గిల్, ఆవేష్ ఖాన్ ను ఎంపిక చేశారు. ఒకవేళ దూబే ఇలాగే పేలవమైన ఆట తీరు కొనసాగించినప్పటికీ రింకూ సింగ్ కు అవకాశం లభించదు. బ్యాటింగ్ కు అత్యంత కఠినంగా ఉండే మైదానాలలో దూబే కంటే రింకూ బాగా ఆడతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.