South Africa Vs Bangladesh: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం న్యూయార్క్ వేదికగా బంగ్లాదేశ్ తో తలపడిన సౌతాఫ్రికా జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎంపైర్ తప్పిదం వల్ల గెలిచే మ్యాచ్ బంగ్లాదేశ్ ఓడిపోయింది. ఈ గెలుపు ద్వారా సౌత్ ఆఫ్రికా సూపర్ -8 కు దాదాపు దగ్గరయింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 113 రన్స్ చేసింది.. క్లాసెన్(46; 44 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ (3/18), తస్కిన్ అహ్మద్ (2/19) ఆకట్టుకున్నారు. అనంతరం చేజింగ్ లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 109 రన్స్ కే పరిమితమైంది.. తౌహీద్ హృదోయ్(37; 34 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) వీరోచితంగా ఆడాడు. కేశవ్ మహారాజ్ (3/27), నోకియా (2/17), రబాడా(2/19) బౌలింగ్ లో ఆకట్టుకున్నారు.
114 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని దక్షిణఫ్రికా అనేక ఘనతలను తన సొంతం చేస్తుంది. టి20 వరల్డ్ కప్ చరిత్రలో అతి తక్కువ స్కోరును కాపాడుకున్న జట్టుగా సౌత్ ఆఫ్రికా రికార్డు సృష్టించింది. అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక, భారత జట్ల పేరు మీద సంయుక్తంగా ఉండేది. 2014లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక, ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 120 రన్స్ టార్గెట్ ను కాపాడుకున్నాయి.. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ తర్వాత స్థానాలలో ఉన్నాయి. వెస్టిండీస్ తో జరిగిన ఓ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 124 రన్స్ చేసింది. ఆ టార్గెట్ ను కాపాడుకుంది. టీమిండియా తో జరిగిన ఓ మ్యాచ్లో న్యూజిలాండ్ 127 రన్స్ చేసింది. ఆ లక్ష్యాన్ని చివరి వరకు కాపాడుకుంది.
ఇక టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఐదు కంటే తక్కువ పరుగుల తేడాతో ఎక్కువసార్లు గెలిచిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. 2009లో న్యూజిలాండ్ జట్టుపై ఒక పరుగు, 2014లో న్యూజిలాండ్ జట్టు పై రెండు పరుగులు, 2014లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఒక మ్యాచ్లో మూడు పరుగులు, ఇప్పటి ప్రపంచకప్లో బంగ్లాదేశ్ పై నాలుగు పరుగుల తేడాతో సౌత్ఆఫ్రికా విజయం సాధించింది.
టి20 లలో తక్కువ స్కోరును కాపాడుకోవడంలో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యుత్తమమైన రికార్డు. అంతకుముందు శ్రీలంక జట్టుపై 116 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని.. దక్షిణాఫ్రికా రికార్డు సృష్టించింది. టి20 ఫార్మాట్లో బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా వరుసగా తొమ్మిదో విజయం సాధించింది. ఆ జట్టు పై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో న్యూజిలాండ్ (10), పాకిస్తాన్ (9), సౌత్ ఆఫ్రికా (9), భారత్ (8) ఉన్నాయి.