India Vs Sri Lanka 1st ODI: అదేం పెద్ద స్కోర్ కాదు. అలాగని ప్రత్యర్థి జట్టు అరి వీర భయంకరమైనది కాదు. బంతులు భారీగా ఉన్నాయి. స్కోర్ స్వల్పంగా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే 14 బంతుల్లో ఒక్క పరుగు చేయాలి. ఇలాంటి సమయంలో ఎవరైనా సరే ఆచితూచి ఆడుతుంటారు. ఎలాగూ చేయాల్సింది ఒక్క పరుగే కాబట్టి జాగ్రత్తగా ఆడుతుంటారు. చివరగా ఆ ఒక్క పరుగు తీసి జట్టును గెలిపిస్తారు. తమ పరువు కూడా కాపాడుకుంటారు. కానీ ఇదే సోయి టీమిండియా యువ ఆటగాడు అర్ష్ దీప్ సింగ్ కు లేకుండా పోయింది.. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు, భావి బుమ్రా అవుతాడని అందరూ అనుకుంటుంటే.. శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో నిరాశ జనకమైన ఆటతీరుతో విమర్శలను మూట కట్టుకున్నాడు. ముఖ్యంగా ఒక్క పరుగు చేయాల్సిన దశలో దరిద్రమైన షాట్ ఆడి టీమిండియా కు విజయాన్ని దూరం చేశాడు, తన పరువు కూడా పోగొట్టుకున్నాడు. దీంతో నెట్టింట అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్వల్ప స్కోర్ అయినప్పటికీ..
కొలంబోలో ప్రేమ దాస స్టేడియంలో శ్రీలంక – భారత జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 రన్స్ చేసింది. శ్రీలంక ప్లేయర్లు వెల్లలాగే 67, నిస్సాంక 56 పరుగులు చేసి శ్రీలంక పరువును కాపాడారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడటంతో శ్రీలంక 230 పరుగులు చేయగలిగింది. ఇక భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. సిరాజ్, శివం దుబే, కులదీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ సాధించారు.
పెద్ద లెక్కలోది కాకపోయినప్పటికీ
231 రన్స్ టార్గెట్ టీం ఇండియాకు పెద్ద లెక్కలోది కాకపోయినప్పటికీ.. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ లక్ష్యం కూడా కఠినంగా మారింది. తొలి వికెట్ కు రోహిత్ శర్మ (58), గిల్(16) కలిసి 75 పరుగులు జోడించారు. 75 పరుగుల వద్ద గిల్ అవుట్ కావడం, 80 పరుగుల వద్ద రోహిత్ అవుట్ కావడంతో టీమిండియా కాస్త తడబాటుకు గురయింది. ఇదే దశలో విరాట్ కోహ్లీ (24), కేఎల్ రాహుల్ (31), అయ్యర్ (23) కీలక సమయాల్లో అవుట్ కావడంతో టీమిండియా ఓడి దుడుకులకు గురైంది.. ఇదే సమయంలో అక్షర్ పటేల్ (33), శివం దుబే (25) మెరుగ్గా ఆడినప్పటికీ అది టీమిండియా విజయానికి కారణం కాలేదు. వీరిద్దరూ జట్టు విజయం సాధించే ముంగిట అవుట్ కావడంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. ముఖ్యంగా శివం దుబే క్రీజ్ లో ఉన్నప్పుడు టీం ఇండియా విజయం పై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. అంతేకాదు దూబే చివర్లో ఒక ఫోర్, 6 కొట్టి సత్తా చాటాడు. ఫలితంగా టీమ్ ఇండియా స్కోర్ సమం అయ్యింది. అప్పటికి టీమిండియా విజయ సమీకరణం 15 బంతుల్లో ఒక్క పరుగుకు చేరుకుంది. ఈ క్రమంలో దూబే అసలంక బౌలింగ్లో క్రికెట్ల ముందు దొరికిపోయాడు. ఫలితంగా టీమిండియా విజయ సమీకరణం 14 బంతుల్లో ఒక పరుగుగా మారింది. అప్పటికే టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయింది.
ఆ ఒక్క పరుగు తీస్తాడనుకుంటే..
చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన అర్ష్ దీప్ సింగ్ సింగిల్ రన్ తీసి భారత జట్టుకు విజయాన్ని అందిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అతడు భారీ షాట్ కు యట్నుంచి అవుట్ అయ్యాడు. తొలి బంతికే వెనుతిరిగాడు. దీంతో టీమిండియా విజయం ముందు బోల్తా పడింది. చివర్లో అద్భుతమైన బౌలింగ్ చేసి శ్రీలంక సత్తా చాటింది. 14 బంతులకు ఒక్క పరుగు సాధించలేక చేతులెత్తేసిన టీమ్ ఇండియా బ్యాటర్ అర్ష్ దీప్ సింగ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ” 14 బంతులు మిగిలి ఉన్నాయి కదా.. ఆ స్థాయిలో భారీ షాట్ కొట్టకుంటే ఏమైంది? నిదానంగా ఆడితే జట్టు గెలిచేది కదా.. ఇలాంటప్పుడు కొంచెం బుద్ధిని ఉపయోగించాలి. అప్పుడే జట్టు గెలుస్తుందని” నెటిజన్లు అర్ష్ దీప్ సింగ్ పై ఫైర్ అవుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More