India Vs South Africa Final: భారత్ vs సౌత్ ఆఫ్రికా.. వర్షం కురిసి.. ఫైనల్ మ్యాచ్ ను రద్దు చేస్తే.. ఏంటి పరిస్థితి?

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. సెమి ఫైనల్ మ్యాచ్ తరహాలోనే.. ఈ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. కరేబియన్ ఐలాండ్లో ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 29, 2024 2:25 pm

India Vs South Africa Final

Follow us on

India Vs South Africa Final: మరికొద్ది గంటల్లో టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.. భారత్ – సౌత్ ఆఫ్రికా జట్లు టైటిల్ పోరు కోసం తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఓటమి అనేది ఎరగకుండా ఫైనల్ దాకా వచ్చాయి. ఓవైపు రెండవ సారి టి20 వరల్డ్ కప్ దక్కించుకోవాలని టీమ్ ఇండియా.. మరోవైపు తొలిసారి ఐసీసీ టైటిల్ అందుకోవాలని సౌతాఫ్రికా.. పట్టుదలతో ఉన్నాయి. రెండు జట్లు సమ వుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ.. స్పిన్, బ్యాటింగ్ విభాగాలలో టీమిండియా కాస్త బలంగా ఉంది.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. సెమి ఫైనల్ మ్యాచ్ తరహాలోనే.. ఈ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. కరేబియన్ ఐలాండ్లో ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది. ఇక్కడ ప్రతిరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ జరిగే ప్రాంతంలోనూ వానలు పడుతున్నాయి. అయితే శనివారం అక్కడ వర్షం కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉందని ఐసీసీ ముందుగానే వెల్లడించింది. ఒకవేళ వర్షం విపరీతంగా కురిసి శనివారం మ్యాచ్ జరగకపోతే.. ఆదివారం నిర్వహిస్తారు. అయితే అక్కడ ఆదివారం కూడా వర్షం కురిసే అవకాశాలున్నాయట. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణ కోసం 190 నిమిషాల పాటు అదనపు సమయాన్నీ రెండు రోజులకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ఐసీసీ నాకౌట్ రూల్స్ ప్రకారం రెండు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడితేనే ఫలితాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

ఇక రిజర్వ్ డే ను కలుపుకొని కట్ ఆఫ్ సమయంలో రెండు జట్లు 10 ఓవర్ల పాటు మ్యాచ్ ఆడకుంటే.. మ్యాచ్ ను రద్దు చేస్తారు. అప్పుడు రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. శనివారం వర్షం వల్ల మ్యాచ్ మధ్యలో ఆగిపోతే.. రిజర్వ్ డే అయిన ఆదివారం నాడు అక్కడి నుంచే మ్యాచ్ మొదలుపెడతారు.

ఇక బ్రిడ్జ్ టౌన్ లో గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఆటగాళ్లు తమ ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ మైదానంపై ఇప్పటివరకు 9 మ్యాచులు జరిగాయి. ఒమన్ – నమిబియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. మిగతా ఏడు మ్యాచ్లలో నాలుగు సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఈ మైదానంపై స్పిన్నర్లు ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ మైదానంపై ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మైదానంపై సౌత్ ఆఫ్రికా ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అయితే టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.