India Vs South Africa Final: 1983 లో కపిల్ దేవ్.. 2024లో సూర్య.. వీరిద్దరి క్యాచ్ లే భారత్ ను విశ్వ విజేతలను చేశాయి

1983 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్ - భారత్ మధ్య జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 183 పరుగులు చేసింది. శ్రీకాంత్ - అమర్ నాథ్ ఆడిన డేరింగ్ షాట్స్ అప్పట్లో ఓ సంచలనంగా మారాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : June 30, 2024 11:23 am

India Vs South Africa Final

Follow us on

India Vs South Africa Final: క్రికెట్ లో అద్భుతాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్ లో బంతి బంతికి సమీకరణాలు మారుతుంటాయి. అయితే 1983 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో అద్భుతం జరిగితే, 2024 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో అది పునరావృతమైంది. ఈ అద్భుతాలను ఆవిష్కరించింది టీమిండియా క్రికెటర్లైతే.. ఆ రెండుసార్లు కూడా టీమ్ ఇండియానే విశ్వవిజేతగా నిలిచింది.

కపిల్ దేవ్ పట్టుకున్నాడు

1983 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్ – భారత్ మధ్య జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 183 పరుగులు చేసింది. శ్రీకాంత్ – అమర్ నాథ్ ఆడిన డేరింగ్ షాట్స్ అప్పట్లో ఓ సంచలనంగా మారాయి. అయితే ఈ స్కోరును చేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు.. సాంధు వేసిన అద్భుతమైన బంతికి గ్రినిడ్జ్ ఔట్ కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తర్వాత వివిఎన్ రిచర్డ్స్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. వెస్టిండీస్ జట్టును గెలుపు తీరాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈలోగా మదన్ లాల్ వేసిన ఓ బంతిని రిచర్డ్స్ బలంగా కొట్టాడు. ఆ బంతి బౌండరీ లైన్ కు దూసుకెళ్తున్న క్రమంలో.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కపిల్ దేవ్.. అంతే వేగంగా వెనక్కి వెళ్లి క్యాచ్ అందుకున్నాడు. అంతే ఒక్కసారిగా రిచర్డ్స్ షాక్ కు గురయ్యాడు. ఆ తర్వాత డుజాన్, మార్షల్ ధీటుగానే ఆడినప్పటికీ.. వెస్టిండీస్ 143 కే ఆల్ అవుట్ అయింది. దీంతో తొలిసారి టీమిండియా విశ్వ విజేతగా ఆవిర్భవించింది. కపిల్ దేవ్ పట్టిన ఆ క్యాచ్ ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేసింది.

మదన్ లాల్ కీలక వ్యాఖ్యలు

కపిల్ దేవ్ క్యాచ్ అందుకున్న తర్వాత బౌలర్ మదన్ లాల్ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశాడు. ” రిచర్డ్స్ కొట్టిన బంతి నా దగ్గర ఉంది. నేను అడిగితే కపిల్ దేవ్ ఇచ్చాడు. వాస్తవానికి నేను వివియన్ రిచర్డ్స్ కు షార్ట్ పిచ్ బంతివేయాలని అనుకున్నా. అప్పటికే నేను మూడు ఓవర్లు వేసి 21 పరుగులు సమర్పించుకున్నా. షార్ట్ పిచ్ బంతి వేసే కంటే ముందు.. కాస్త వేగంగా బంతిని విసిరా. దాన్ని వివియన్ రిచర్డ్స్ అనుకున్న దానికంటే గొప్పగా కొట్టలేకపోయాడు. గాల్లోకి ఎగిరిన ఆ బంతిని కపిల్ దేవ్ వెనక్కి వెళ్ళకుంటూ అనుకున్నాడు. కొన వేళ్ళలో బంతిని పట్టుకున్నాడని” మదన్ లాల్ వివరించాడు

41 సంవత్సరాల తర్వాత

1983లో కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ భారత జట్టును విశ్వవిజేతగా మార్చితే.. 2024 t20 వరల్డ్ కప్ లో బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో.. సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మరోసారి భారత జట్టుకు పొట్టి ప్రపంచ కప్ అందించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చివరి ఓవర్ ను హార్దిక్ పాండ్యా వేశాడు. తొలి బంతిని స్ట్రైకర్ గా ఉన్న డేవిడ్ మిల్లర్ గట్టిగా కొట్టాడు. ఆ బంతి అమాంతం గాల్లో లేచింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న సూర్య కుమార్ యాదవ్ వెంటనే ఆ బంతి గమనాన్ని అంచనా వేస్తూ క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ లైన్ కు వెంట్రుక వాసి దూరంలో ఉండటంతో.. తన శరీర గమనాన్ని అదుపు చేసుకుంటూనే.. బౌండరీ లైన్ అవతలకు బంతిని మైదానంలోకి విసిరి.. ఒక్క ఉదుటున జంప్ చేసి క్యాచ్ అందుకున్నాడు.. దీంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది.. అప్పటికి దక్షిణాఫ్రికా విజయానికి ఆరు బంతుల్లో 16 పరుగులు కావాలి. మిల్లర్ అవుట్ కావడంతో.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఆ ఓవర్లో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి మరో వికెట్ కూడా తీసి.. ఇండియా విజయాన్ని హార్దిక్ పాండ్యా ఖాయం చేశాడు.