India Vs South Africa 5th T20 Tilak Varma: టీమిండియాలో నెంబర్ 3 స్థానానికి చాలా విలువ ఉంటుంది. ఎందుకంటే టీమిండియా స్కోరును డిసైడ్ చేసే స్థానం ఇది. ఒకప్పుడు ఈ స్థానంలో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడేవాడు. ఒకానొక సందర్భంలో తన కోసమే ఈ స్థానం ఉంది అన్నట్టుగా వ్యవహరించేవాడు. విరాట్ కోహ్లీ టెస్ట్, టి20 నుంచి తప్పుకున్నాడు. టెస్ట్ లు మినహాయిస్తే టి20లో ఈ స్థానంలో గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత అనేక ప్రయోగాలు చేశాడు. అయితే ఈ ప్రయోగాలలో ఒక తిలక్ వర్మ మాత్రమే సఫలమయ్యాడు.
తిలక్ వర్మ ఆ స్థానంలో స్థిరంగా ఉన్నప్పటికీ.. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ.. గౌతమ్ గంభీర్ ఎందుకో ఇంకా ప్రయోగాలను మానుకోవడం లేదు. ఆ స్థానంలో గౌతమ్ గంభీర్ ప్రయోగం చేసిన ప్రతి సందర్భంలోనూ టీమిండియా కు వ్యతిరేక ఫలితమే వచ్చింది. వాస్తవానికి ఈ విషయాన్ని గౌతమ్ గంభీర్ ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. అనవసరమైన ప్రయోగాలు చేసి జట్టును ఇబ్బందుల్లో నెడుతున్నాడు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరికి 20 మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై తిలక్ వర్మ 73 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ ఔట్ అయిన తర్వాత మైదానంలోకి వచ్చిన తిలక్ వర్మ.. తొలి బంతినే ఫోర్ కొట్టాడు. తిలక్ వర్మ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. సంజు తో కలిసి రెండో వికెట్ కు 34 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ తో కలిసి మూడో వికెట్ కు 18 పరుగులు, హార్దిక్ పాండ్యాతో కలిసి నాలుగో వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యాలను తిలక్ వర్మ నమోదు చేశాడు. తాజా సిరీస్లో తొలి మ్యాచ్లో 26, రెండో మ్యాచ్లో 62, మూడో మ్యాచ్లో 25, ఐదో మ్యాచ్లో 73 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సిరీస్ లో అతడు 186 పరుగులు చేశాడు. దూకుడుగానే కాదు, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అతడు సమర్థవంతంగా బ్యాటింగ్ చేయగలడు.
ఈ సిరీస్ లోనే కాదు.. టి20లలో దక్షిణాఫ్రికా మీద తిలక్ వర్మకు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. రెండు సెంచరీలు కూడా దక్షిణాఫ్రికా జట్టు మీద అతడు నమోదు చేశాడు. అది కూడా వారి దేశంలోనే కావడం విశేషం. ఒక మ్యాచ్లో 56 బంతుల్లో 107*, మరో మ్యాచ్లో 47 బంతుల్లో 120* పరుగులు చేశాడు. తాజా సిరీస్ లో రెండో టి20 మ్యాచ్లో జట్టు తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు అతడు సమర్థవంతమైన బ్యాటింగ్ చేశాడు. సమయోచితంగా ఆడి టీమిండియా కు మెరుగైన స్కోర్ అందించాడు. మూడో స్థానంలో ఈ స్థాయిలో సత్తా చూపించి.. సరికొత్త రికార్డు సృష్టించాడు తిలక్ వర్మ. మరి కొద్ది రోజుల్లో టీమిండియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మూడో స్థానంలో తిలక్ వర్మ ను కొనసాగించాలని.. అతడి స్థానంతో ఆటలాటకూడదని గంభీర్ కు టీమిండియా అభిమానులు సూచిస్తున్నారు.