IND Vs PAK: భారీ ఆశలు పెట్టుకున్న బాబర్ 23 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యాకు దొరికిపోయాడు. సంచలనాలు సృష్టిస్తాడు అనుకున్న ఇమామ్ ఉల్ హక్ పది పరుగులకే అక్షర్ పటేల్ చేతిలో రనౌట్ అయ్యాడు. స్థూలంగా 47 పరుగులకే ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ చేరుకున్నారు. 8.2 ఓవర్ లో 41 పరుగుల వద్ద బాబర్ అజామ్, 9.2 ఓవర్ లో 47 పరుగుల వద్ద ఇమామ్ ఉల్ హక్ అవుట్ అయ్యారు. వరుస ఓవర్లలో ఇద్దరు ఓపెనర్లు అవుట్ కావడం పాకిస్తాన్ జట్టు స్కోర్ పై తీవ్ర ప్రభావం చూపించింది.
ఆ తర్వాత వచ్చిన సౌద్ షకీల్ (62), కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ (46) పాకిస్తాన్ జట్టుకు రిపేర్లు చేయడం మొదలుపెట్టారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. మొదట్లో పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కుదురుకున్న అనంతరం చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఎక్కువగా సింగిల్స్, డబుల్స్ మీద దృష్టి సారించారు. చేప కింద నీరు లాగా విస్తరించుకుంటూ పాకిస్తాన్ స్కోర్ ను నెమ్మదిగా కదిలించారు. 77 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ మూడు ఫోర్ల సహాయంతో 46 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న అతనిని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సౌద్ షకీల్ 76 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సహాయంతో 62 పరుగులు చేశాడు.
104 పరుగులు జోడించారు
వరుస ఓవర్లలో ఓపెనర్లు అవుట్ కావడంతో.. రిజ్వాన్, షకీల్ మూడో వికెట్ కు 104 పరుగులు జోడించారు. 144 బంతులు ఎదుర్కొన్న వీరిద్దరూ 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అత్యంత ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అక్షర్ పటేల్ విడదీశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన తయ్యాబ్ తాహిర్(4) రవీంద్ర జడేజా బౌలింగ్ అవుట్ అయ్యాడు. సల్మాన్ ఆఘా(19) కూడా ఎంతసేపో మైదానంలో ఉండలేకపోయాడు. కులదీప్ యాదవ్ బౌలింగ్లో అఘా అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన షాహిన్ అఫ్రీది(0) కులదీప్ యాదవ్ వేసిన మరుసటి బంతికే అవుట్ అయ్యాడు. ప్రస్తుతం రౌఫ్(0) ఖుష్ దిల్ షా(27) క్రీజ్ లో ఉన్నారు. ఈ కథనం రాసే సమయానికి 47 ఓవర్లు పూర్తయ్యాయి. పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. కులదీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టారు.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్లో భారత పేస్ బౌలర్లు మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా వికెట్లు తీయకపోయినప్పటికీ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ మైదానంపై బౌలర్లు పండగ చేసుకుంటారని.. ముందుగా బౌలింగ్ చేసిన జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుందని తెలిసినప్పటికీ పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ బ్యాటింగ్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే అతడు తీసుకున్న నిర్ణయం తప్పని టీమ్ ఇండియా బౌలర్లు నిరూపించారు.