IND Vs PAK: ఆదివారం.. మధ్యాహ్నం .. రవి శాస్త్రి వచ్చాడు.. తన సమక్షంలో టాస్ వేయించాడు. పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ టాస్ గెలిచాడు. పక్కనే ఉన్న రోహిత్ లో ఒకటే ఆందోళన. ఎక్కడ బౌలింగ్ ఎంచుకుంటాడోనని.. కానీ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంకేముంది సగం మ్యాచ్ గెలిచినట్టేనని అక్కడే ఫిక్స్ అయ్యాడు రోహిత్ శర్మ.. బయటికి కనిపించకుండా లోపల తనలో తాను నవ్వుకున్నాడు. అంతేకాదు మెరుగైన బౌలింగ్ ప్రదర్శన చేస్తామని కూడా చెప్పాడు.
సీన్ కట్ చేస్తే పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ కు వచ్చింది. ఓపెనర్లు మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పలేదు. త్వర త్వరగానే అవుట్ అయ్యారు.. ప్లాట్ పిచ్ పై రోహిత్ శర్మ మార్చి మార్చి బౌలర్లను ప్రయోగించడంతో ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు కనిపించాయి. షకీల్ 62, రిజ్వాన్ 46 మినహా మిగతా ఆటగాళ్లు తేలిపోయారు. కనీసం భారతీయ బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు. తన అద్భుతమైన బంతులతో మాయాజాలం ప్రదర్శించే కులదీప్ యాదవ్.. ఈ మ్యాచ్లో అద్భుతాన్ని సృష్టించాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ ఓటమిలో తన వంతు పాత్ర పోషించాడు. హార్థిక్ పాండ్యా కూడా రెండు వికెట్లు పడగొట్టి తన సత్తా నిరూపించాడు.. మహమ్మద్ షమీ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయినప్పటికీ.. పరుగులు ఇవ్వకుండా పాకిస్తాన్ ఆటగాళ్ళను కట్టడి చేశాడు. దీంతో పాకిస్తాన్ 241 పరుగులకు ఆల్ అవుట్ కావాల్సి వచ్చింది. బౌలర్లను సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో రోహిత్ శర్మ విజయవంతమయ్యాడు. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా సెట్ చేసి పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
అదే కారణమా..
దుబాయ్ మైదానం ప్లాట్ వికెట్ మాదిరిగా ఉంటుంది. అందువల్లే ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంటుంది. కానీ మహమ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచినప్పటికీ.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతడు తీసుకున్న ఆ నిర్ణయం ఆ జట్టు కొంపముంచింది. ఎందుకంటే ప్లాట్ మైదానంపై టీమిండియా స్పిన్ బౌలర్లు అద్భుతమైన గ్రిప్ రాబడతారు. మెలికలు తిప్పే విధంగా బంతులు వేస్తారు. పాకిస్తాన్ ఆటగాళ్లు కులదీప్ యాదవ్ కు దాసోహం అయిపోయారు. మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ ప్లేయర్లు తట్టుకోలేకపోయారు. రిజ్వాన్, షకీల్ మినహా మిగతా ఆటగాళ్లు భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. అందువల్లే పాకిస్తాన్ అంత తక్కువ స్కోరు చేయగలిగింది. వాస్తవానికి టాస్ గెలిచిన రిజ్వాన్ ఒకవేళ బౌలింగ్ గనుక తీసుకొని ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది..”రిజ్వాన్ బుర్ర సరిగా పనిచేయలేదు అనుకుంటా. అందుగురించే ఆ నిర్ణయం తీసుకున్నాడు. దుబాయ్ మైదానం ఎలా ఉంటుందో తెలిసినప్పటికీ కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడం అతడి తెలివి తక్కువ స్థితికి నిదర్శనం. ఒకవేళ అతడి గనుక బౌలింగ్ తీసుకొని ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ రిజ్వాన్ అలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. దీంతో పాకిస్తాన్ స్వదేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నప్పటికీ.. లీగ్ దశ దాటలేకపోయిందని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.