IND Vs PAK: ఛాంపియన్ ట్రోఫీ (Champions trophy 2025) లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ (IND vs PAK) తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ టచ్ లోకి వచ్చాడు. సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఇటీవల స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. సుదీర్ఘకాలం తర్వాత అర్థ సెంచరీ చేయడంతో విరాట్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అదే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం విరాట్ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కానీ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై మాత్రం అదరగొట్టాడు. 242 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన భారత జట్టుకు మూల స్తంభం లాగా నిలిచాడు. సూపర్ సెంచరీ చేసి అదరగొట్టాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తన కెరియర్లో విరాట్ కోహ్లీ 51 సెంచరీ చేశాడు. పిచ్ వాతావరణాన్ని పూర్తిగా అర్థం చేసుకొని.. విరాట్ కోహ్లీ పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ పాకిస్తాన్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. శ్రేయస్ అయ్యర్ (56) కూడా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు.. ఇక పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో దాయాది జట్టు ఆటగాడి షూ లేస్ ఊడిపోతే.. విరాట్ కోహ్లీ కట్టాడు.. ఆ దృశ్యం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి.. భారత గెలుపులో ముఖ్యపాత్ర పోషించాడు.
సెంచరీల రికార్డ్
విరాట్ కోహ్లీ సెంచరీ ద్వారా.. అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ఏకంగా 51 సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు వన్డే క్రికెట్ చరిత్రలో 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. 2008లో శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ టీమిండియాలోకి ప్రవేశించాడు. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), కుమార సంగక్కర(Kumar Sangakkara) తర్వాత ఆ స్థాయిలో పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. విరాట్ తన కెరియర్లో 298 వన్డే మ్యాచ్లు ఆడాడు. 73 హాఫ్ సెంచరీలు చేశాడు. 36 సంవత్సరాల వయసు ఉన్న విరాట్ కోహ్లీ.. తిరుగులేని శరీర సామర్థ్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఆధునిక క్రికెట్లో పరుగుల యంత్రంలాగా పేరు సంపాదించుకున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. అందువల్లే అతడిని అభిమానులు రన్ మిషన్ అని పిలుస్తున్నారు. పాకిస్తాన్ పై సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది.