India vs Pakistan: ఆసియాకప్ 2023 అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన పాకిస్తాన్ జట్టు బలహీనమైన నేపాల్‌కు చుక్కలు చూపించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్‌తోపాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇఫ్తికార్ సెంచరీలతో విరుచుకుపడిన వేళ పసికూన నేపాల్ చేతులెత్తేసింది. దీంతో ఏకంగా 238 పరుగుల భారీ తేడాతో నేపాల్ ఘోర పరాజయం చవి చూసింది. పాకిస్తాన్ ఆసియాకప్‌లో ఘనంగా బోణీ చేసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న సవాల్ భారత్. ఈ శనివారం ఇరుజట్ల మధ్య శ్రీలంకలోని కాండీలో జరిగే మ్యాచ్‌పై భారీ అంచనాలున్నాయి.
వర్షం కురిసే చాన్స్..
అయితే కాండీలోని కల్లెపల్లె స్టేడియంలో జరిగే భారత్–పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. అదీ చిన్నా చితకా జల్లులు కాదు ఏకంగా భారీ వర్షాలే పడతాయట. అసలే ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్‌ను కాదని తటస్ధ వేదిక పేరుతో శ్రీలంకలో ఈ మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకున్న బీసీసీఐకి ఇప్పుడు ఈ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. శ్రీలంకలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శనివారం ఈ మ్యాచ్‌కు వేదికైన కాండీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం చేసిన ప్రకటన అభిమానులను టెన్షన్ పెడుతోంది.
వెదర్ రిపోర్టు ఇలా..
కాండీలో శనివారం 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ విభాగం ప్రకటించింది. ఇప్పటికే అక్కడ కురుస్తున్న వర్షాలతో ప్రాస్టీస్ కూడా కష్టం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్–పాక్ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకులు సృష్టిస్తే రద్దయ్యే అవకాశాలూ లేకపోలేదు. వర్షం మధ్యలో తెరిపినిస్తే మాత్రం మ్యాచ్ ఫలితం డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కూడా నిర్ణయించే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కాండీ వెదర్ రిపోర్ట్ భారత్–పాక్ జట్లను చికాకు పెట్టబోతోంది.
ఎవరు గెలిచినా ప్రభావం ఉండదు..
ఇక ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో గెలిచినా గెలవకున్నా భారత్, పాకిస్తాన్ అవకాశాలపై అంతగా ప్రభావం పడకపోవచ్చు. టోర్నీలో రెండు బలమైన జట్లు కావడం, మిగతా జట్లపై తప్పనిసరిగా గెలిచే పరిస్థితులే ఉండటంతో ఆ మేరకు పాయింట్లపై ప్రభావం ఉండదు. కానీ భారత్–పాక్ మ్యాచ్ చూడాలన్న అభిమానుల ఆశలపై వర్షం నీళ్లు చల్లే ప్రమాదం కనిపిస్తోంది. అయితే వరుణుడు శాంతిస్తే మాత్రం మ్యాచ్ సజావుగా సాగుతుంది. అదే జరగాలని అభిమానులతోపాటు ఇరు జట్లూ, ఆసియాకప్ నిర్వాహకులూ కోరుకుంటున్నారు.