Homeక్రీడలుIndia Vs Pakistan: రోహిత్‌కు జతగా అతడే.. తెలుగోడికి చోటు దక్కుతుందా? పాక్‌తో తలపడే జట్టులో...

India Vs Pakistan: రోహిత్‌కు జతగా అతడే.. తెలుగోడికి చోటు దక్కుతుందా? పాక్‌తో తలపడే జట్టులో 11 మంది వీరే?

India Vs Pakistan: ఆసియాకప్‌ –2023 అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రెండు మ్యాచ్‌లలో పసికూలపై ప్రధాన జట్టు ప్రతాపం చూపాయి. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను పాకిస్తాన్‌ చిత్తు చేసింది. రెండో మ్యాచ్‌లో శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సమ ఉజ్జీలుగా ఉన్న ఇండియా, పాక్‌ మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది. ఈనెల 2న ఈ మ్యాచ్‌ జరుగనుంది. పాకిస్తా¯Œ తో మ్యాచ్‌కు టీమిండియాలో 11 మంది ఎవరెవరు ఉంటారనేది కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రోహిత్‌కు జతగా ఓపెనింగ్‌లో ఎవరు ఆడబోతున్నారనే దానిపై సందిగ్ధం నెలకొంది.

కొన్ని గంటల్లో దాయాదుల పోరు..
క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా శనివారం రెండు జట్ల మధ్య పోరు జరగనుంది. ఇప్పటికే ఆరంభ మ్యాచ్‌లో నేపాల్‌పై ఘనవిజయం సాధించిన పాకిస్తాన్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది. అదే జోష్‌లో టీమిండియాను కూడా ఓడించాలని భావిస్తోంది. ఇటు టీమిండియా ఆసియా కప్‌లో తమ ప్రయాణాన్ని పాక్‌తో మ్యాచ్‌తోనే ఆరంభించనుంది. దీంతో పాక్‌పై గెలిచి టోర్నీలో అదిరిపోయే బోణీ కొట్టాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది.

పొంచి ఉన్న వరుణ గండం..
అయితే ఈ మ్యాచ్‌కు వరుణ గండం కూడా ఉంది. స్థానిక వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్‌ జరిగే సమయంలో 90 శాతం వర్షం పడే అవకాశాలున్నాయి. దీంతో పూర్తి ఆట సాధ్యం కాకపోవచ్చు. మ్యాచ్‌ పూర్తిగా రద్దయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఆ 11 మంది ఎవరో..
వర్షం సంగతి కాస్త పక్కన పెడితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్‌ 11 ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రోహిత్‌కు జతగా ఓపెనింగ్‌లో ఎవరు ఆడబోతున్నారనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఈ మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌లోకి తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ అరంగేట్రం ఉంటుందా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టు ఎలా ఉండే అవకాశాలున్నాయో ఒక సారి పరిశీలిద్దాం.

బ్యాటింగ్‌ పిచ్‌..
ముందుగా పిచ్‌ రిపోర్టు విషయానికొస్తే.. మ్యాచ్‌ జరగనున్న క్యాండీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. బంతి చక్కగా బ్యాట్‌ మీదకు వస్తుంది. ఉపరితలం కొద్దిగా పొడిగా ఉండనుంది. దీంతో ఈ పిచ్‌పై స్పిన్నర్లు సత్తా చాటగలరు. ఈ పిచ్‌పై సగటు స్కోర్‌ 250గా ఉంది. ఇక టీమిండియా ప్లేయింగ్‌ 11లో ఓపెనర్‌గా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఖాయం కాగా.. అతనికి జతగా శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌లలో ఎవరు బరిలోకి దిగుతారనేది చూడాలి. రోహిత్, గిల్‌ ఇప్పటికే పలు మ్యాచ్‌ల్లో టీమిండియాకు మంచి ఆరంభాలను ఇచ్చారు. అయితే రైట్, లెఫ్ట్‌ కాంబినేషన్‌ కావాలనుకుంటే రోహిత్‌కు జతగా కిషన్‌నే పంపించొచ్చు. అప్పుడు గిల్‌ మూడో స్థానంలో, కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తారు. కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే మిడిలార్డర్‌ కూడా పటిష్టంగా మారే అవకాశాలుంటాయి. మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్‌ కూడా ఇదే చెప్పాడు. కానీ ఇది జరగకపోవచ్చు. గతంలో మంచి రికార్డున్న రోహిత్, గిల్‌నే ఓపెనర్లుగా ఆడించొచ్చు. మూడో స్థానంలో కోహ్లీ, నాలుగో స్థానంలో కిషన్‌ ఆడే అవకాశాలున్నాయి. వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలను కూడా కిషనే చేపట్టనున్నాడు. ఇక ఐదో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ ఆడతాడు. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా ఆడడం ఖాయమే. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మకు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాకపోవచ్చు.

బౌలింగ్‌లో కూర్పు ఇలా..
ఇక బౌలింగ్‌ యూనిట్‌ విషయానికొస్తే ప్రధాన స్పిన్నర్‌గా చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌యాదవ్‌ బరిలోకి దిగడం ఖాయం. జడేజా, కుల్దీప్‌కు తోడు మరో స్పిన్నర్‌ కావాలనుకుంటే ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కుతుంది. అప్పుడు ఇద్దరు ప్రధాన పేసర్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. కానీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగడానికి మొగ్గు చూపొచ్చు. పేసర్లుగా జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ ఖాయం కాగా.. వీరికి జతగా హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు చోటు దక్కనుంది. అయితే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే సిరాజ్‌కు చోటు కష్టమనే చెప్పుకోవాలి.

టీమిండియా తుది జట్టు(అంచనా)
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్, హార్దిక్‌ పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్, మహ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌/అక్షర్‌ పటేల్‌.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version