India Vs Pakistan Asia Cup 2023: సాకర్ లో బ్రెజిల్, అర్జెంటీనా, క్రికెట్ లో భారత్, పాక్..ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లు అంటే అభిమానులకు ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది.. చిరకాల ప్రత్యర్థులు కావడంతో అభిమానుల్లో ఆనందం తారస్థాయికి చేరుతుంది. ముఖ్యంగా మన దాయాది పాక్ జట్టుతో క్రికెట్ మ్యాచ్ అంటే ఛానెల్స్ కు కూడా పండగే. కోట్లు పోసి మరీ రైట్స్ కొంటాయి. నిర్వాహకులు కూడా భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తారు. ఇక మీడియా ఇచ్చే హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెస్ట్, వన్డే, టీ_20 ఇలా ఫార్మాట్ అయినా భారత్_ పాక్ మధ్య మ్యాచ్ ఉందంటే చాలు అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పుడు సోషల్ మీడియా రోజులు కాబట్టి.. టీ_20 జమానా నడుస్తోంది కాబట్టి. వ్యూస్ కోట్లను దాటుతాయి. ఆసియా కప్ లో భాగంగా సోమవారం శ్రీలంక వేదికగా పాకిస్తాన్ _ భారత్ మ్యాచ్ కొత్త రికార్డులను సృష్టించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో భారత బ్యాట్స్ మెన్ వీర విహారం చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం చేజింగ్ కు దిగిన పాకిస్తాన్ జట్టు 32 ఓవర్లలో 128 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. ఇందులో భారత బౌలర్లు ఎక్స్ ట్రాల రూపంలో 17 పరుగులు ఇవ్వడం విశేషం.. అవి కూడా లేకుంటే పాకిస్తాన్ స్కోర్ 111 కే పరిమితమయ్యేది.
అయితే పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ సరికొత్త రికార్డులను సృష్టించింది. అత్యధిక వ్యూస్ రాబట్టిన మ్యాచ్ గా చరిత్రకెక్కింది. దాయాదీ దేశాల మధ్య జరిగిన మ్యాచ్ కు రెండు కోట్ల 80 లక్షల రియల్ టైం వ్యూస్ వచ్చాయి. ప్రస్తుత టి20 జమానాలో ఈ స్థాయిలో రియల్ టైం వ్యూస్ రావడం అంటే మాటలు కాదు. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలు చేసిన సమయంలో ఈ బ్లాక్ బస్టర్ వ్యూస్ నమోదయ్యాయి.. ఇప్పటివరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇదే అత్యధిక రికార్డు. 2019 వన్డే ప్రపంచ కప్ లో భాగంగా భారత్_ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు గరిష్ఠంగా 2.53 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు ఇదే ఒక రికార్డుగా ఉండగా.. దానిని సోమవారం భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అధిగమించింది.
అయితే డిస్నీ ఈసారి ఎటువంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా మ్యాచ్ లు చూసే అవకాశం కల్పించింది. దీంతో ఈసారి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఆసియా కప్ ఫైనల్, ప్రపంచ కప్ మ్యాచ్ లను కూడా ఫ్రీ గా చూసే అవకాశాన్ని కూడా కల్పించడంతో ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం ఉందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వర్గాలు అంటున్నాయి.. అయితే విరాట్ కోహ్లీ సెంచరీ చేయగానే డిస్నీ వ్యూస్ అమాంతం 80 లక్షలకు పెరగడం విశేషం. కాగా, ప్రస్తుతం టి20 జమానా నడుస్తున్న రోజుల్లో.. జనం 50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ ను కూడా ఈ స్థాయిలో చూడటం గొప్ప విషయమని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. చాలామంది టి20 మ్యాచ్ లు జరుగుతున్న రోజుల్లో.. వన్డే మ్యాచ్ లు ఇక ఎవరూ చూడరు అంటున్నారని.. అది తప్పని భారత్ & పాక్ మ్యాచ్ చూపించిందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా,
ఆసియా కప్ లో భాగంగా శ్రీలంక వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి 356 పరుగులు చేసింది.. రోహిత్ (56), గిల్(58) రాణించారు. విరాట్ కోహ్లీ (122), కే ఎల్ రాహుల్(111) వీరోచిత బ్యాటింగ్ చేశారు. కడ వరకూ అడి నాట్ అవుట్ గా నిలిచారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇక అప్పటినుంచి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ పరుగులు తీయలేక చేతులెత్తేశారు. 32 ఓవర్లలో 128 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు.