India Vs New Zealand 5th T20I: టి20 లలో టీమిండియా నెంబర్ వన్ గా కొనసాగుతోంది. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క సిరీస్ కూడా టీమిండియా కోల్పోలేదు. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా అద్భుతమైన విజయాలను అందుకుంటూ.. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టును ఓడించుకుంటూ.. సిరీస్ లు సొంతం చేసుకుంటూ వస్తోంది.
స్వదేశంలోనే కాదు.. విదేశాలలో కూడా అద్భుతమైన గెలుపులను అందుకుంటున్నది. టి20 లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న టీమ్ ఇండియా.. తన స్థాయికి తగ్గట్టుగానే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పాత రికార్డులను బద్దలు కొడుతోంది. తన పేరు మీద సరికొత్త చరిత్రలను రాసుకుంటున్నది.
స్వదేశం వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఐదు టి20 మ్యాచ్ల సిరీస్లో.. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. నాలుగో మ్యాచ్ లో గెలుపుకు దగ్గరగా వచ్చి ఓడిపోయింది. తర్వాత చివరి మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ, ఇషాన్ కిషన్ సెంచరీ తోడు కావడంతో భారత్ ఏకంగా 271 పరుగులు చేసింది.. న్యూజిలాండ్ జట్టును 225 పరుగులకు ఆల్ అవుట్ చేసి.. 46 పరుగుల తేడాతో గెలుపును దక్కించుకుంది.
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఐదో మ్యాచ్లో భారత బ్యాటర్లు ఏకంగా 23 సిక్సర్లు కొట్టారు. ఇందులో కిషన్ బ్యాట్ నుంచి పది సిక్సర్లు నమోదు అయ్యాయి. తద్వారా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ బ్యాటర్లు 13 సిక్సర్లు కొట్టారు. ఇందులో ఆలెన్ 6 సిక్సర్లు కొట్టాడు. అంతర్జాతీయ టి20 లలో ఒక ఇన్నింగ్స్ లో హైయెస్ట్ సిక్సర్లు కొట్టిన రికార్డు టీమిండియా పై ఇప్పటికే ఉంది. 2024లో జోహన్ నెస్ బర్గ్ లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో భారత్ ప్లేయర్లు 23 సిక్సర్లు కొట్టారు. నాటి మ్యాచ్లో తిలక్ వర్మ 10, సంజు శాంసన్ 9, అభిషేక్ శర్మ నాలుగు సిక్సర్లు కొట్టడం విశేష. అయితే ఈ రికార్డును భారత్ మరోసారి రిపీట్ చేసింది.
అంతేకాదు ఒక ద్వైపాక్షిక సిరీస్లో హైయెస్ట్ సిక్సర్లు కొట్టిన జట్టుగా కూడా భారత్ రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఈ ఐదు మ్యాచ్లలో కలిపి భారత ప్లేయర్లు మొత్తం 69 సిక్సర్లు కొట్టారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పేరు మీద ఉన్న 64 సిక్సర్ల రికార్డును భారత్ ప్లేయర్లు అధిగమించారు. 2023 లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో ఇంగ్లాండ్ ప్లేయర్లు 64 సిక్సర్లు కొట్టారు. ఇక గత ఎడాది వెస్టిండీస్ జట్టుతో జరిగిన సిరీస్లో ఆస్ట్రేలియా ప్లేయర్లు కూడా 64 సిక్సర్లు కొట్టారు. ఇండోనేషియా పై కంబోడియా 62 సిక్సర్లు కొట్టి నాలుగో స్థానంలో ఉంది. టెస్ట్ హోదా కలిగిన జట్ల మీద హైయెస్ట్ పరుగులు చేయడంలో టీమిండియా సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ 304 పరుగులతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 297 పరుగులతో టీమిండియా సెకండ్ ప్లేస్ లో ఉంది. త్రివేండ్రంలో శనివారం న్యూజిలాండ్ జట్టుపై భారత్ చేసిన 271 పరుగులు ఐదో స్థానంలో ఉన్నాయి.