India vs New Zealand 3rd Test : దారుణం.. ఘోరం.. ఇండియాలో ఇండియాను కొట్టి వైట్ వాష్ చేసిన న్యూజిలాండ్

బెంగళూరు టెస్ట్ లో ఓటమి. పూణేలో ఓటమి. చివరికి ముంబైలోని ఓటమి. మొత్తంగా న్యూజిలాండ్ చేతిలో భారత జట్టుకు వైట్ వాష్. స్వదేశం వేదికగా 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా తర్వాత.. మళ్లీ వైట్ వాష్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీ ముందు భారత జట్టుకు ఇది కోలుకోలేని షాక్.

Written By: Anabothula Bhaskar, Updated On : November 3, 2024 1:47 pm

India vs New Zealand 3rd Test

Follow us on

India vs New Zealand 3rd Test :ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ లో భారత్ ఓటమిపాలైంది. 25 పరుగుల తేడాతో దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకుంది. 147 రన్స్ టార్గెట్ తో దిగిన టీమిండియా 121 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. రిషబ్ పంత్ (64) ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ ఆరు వికెట్లు సాధించి టీమిండియా పతనాన్ని శాసించాడు. గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. హెన్రీ ఒక వికెట్ సాధించాడు. ఈ విజయం ద్వారా మూడు టెస్టుల సిరీస్ ను న్యూజిలాండ్ 3-0 తేడాతో గెలుచుకుంది. స్వదేశంలో 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో తొలిసారి టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కు టీమిండియా గురైంది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకు వైట్ వాష్ బారిన పడింది.. న్యూజిలాండ్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని చేదించడంలో టీమిండియా ప్రారంభించి తడబాటుకు గురైంది. ఒకానొక దశలో 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. టీ దశలో రవీంద్ర జడేజా (6) తో కలిసి రిషబ్ పంత్ ఆరో వికెట్ కు ఏకంగా 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వాస్తవానికి రిషబ్ పంత్ మైదానంలో ఉన్నంతవరకు టీమిండియా వైపు విజయం మొగ్గుచూపింది. కానీ ఆ తర్వాత మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. అంతకుముందు 171/9 తో మూడో రోజు ఆట మొదలు పెట్టిన న్యూజిలాండ్ మూడు పరుగులు మాత్రమే చేసి చివరి వికెట్ కోల్పోయింది. అజాజ్ పటేల్ (8) రవీంద్ర జడేజా బౌలింగ్ అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టిన జడేజా.. రెండవ ఇన్నింగ్స్ లోనూ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక న్యూజిలాండ్ రెండోవైన్నింగ్స్ లో విల్ యంగ్ (51), ఫిలిప్స్(26), కాన్వే(22), మిచెల్(21) రన్స్ చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్ల సాధించాడు. ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.

తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 235 రన్స్ చేసింది. మిచెల్(82), యంగ్(71) పరుగులు చేశారు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు సాధించాడు. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 263 రన్స్ చేసింది. గిల్(90), రిషబ్ పంత్ (60) సత్తా చాటారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇష్ సోది, హెన్రీ, ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు. స్వదేశంలో క్లీన్ స్వీప్ ఓటమితో టీమ్ ఇండియా పరువు తీసుకుంది. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. సర్ఫరాజ్ ఖాన్ రెండు ఇన్నింగ్స్ లలోనూ చేతులెత్తేశాడు. అశ్విన్ సత్తా చాట లేకపోయాడు. మొత్తంగా చూస్తే బ్యాటింగ్ వైఫల్యం మరొకసారి కొట్టొచ్చినట్టు కనిపించింది.