India Vs Ireland: ఐర్లాండే కదా అని రోహిత్ సేన తీసి పారేయొద్దు.. టి20 లో ఏదైనా జరగొచ్చు..

భారత జట్టు గ్రూపు - ఏ లో ఉంది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే రోహిత్ సేన గ్రూప్ దశ అధిగమించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.. ఈ గ్రూపులో భారత్ తో పాటు పాకిస్తాన్ కూడా ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 5, 2024 6:56 pm

India Vs Ireland

Follow us on

India Vs Ireland: టి20 వరల్డ్ కప్ ప్రారంభమై మూడు రోజులవుతున్నప్పటికీ.. ఒమన్ – నమీబియా మధ్య సూపర్ ఓవర్ పోరు మినహా.. ఇంతవరకు ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే క్రికెట్ మ్యాచ్ లు జరగలేదు. అయితే బుధవారం నుంచి అసలు సిసలైన టి20 మజా ప్రేక్షకులకు దక్కనుంది. ఎందుకంటే టి20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా బుధవారం నుంచి తన టి20 వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్ లో ఐర్లాండ్ జట్టుతో తల పడనుంది.

భారత జట్టు గ్రూపు – ఏ లో ఉంది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే రోహిత్ సేన గ్రూప్ దశ అధిగమించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.. ఈ గ్రూపులో భారత్ తో పాటు పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ ను ఓడిస్తే.. అగ్రస్థానానికి చేరుకొని.. సూపర్ – 8 కు అర్హత సాధిస్తుంది. పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ కు ఇంకా నాలుగు రోజుల గడువు ఉంది. ఈ లోపు ఐర్లాండ్ జట్టుతో జరిగే మ్యాచ్ భారత క్రీడాకారులకు ఒక మంచి అవకాశం. దీని ద్వారా వారు అమెరికన్ మైదానాలకు అలవాటు పడేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.

టి20 లో భారత జట్టుకు, ఐర్లాండ్ జట్టుకు పెద్దగా పోలికలు లేకపోయినప్పటికీ.. పొట్టి క్రికెట్లో ఏదైనా జరుగుతుంది. ఇటీవల నమీబియా – ఒమన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు ఒక ఉదాహరణ. ఐర్లాండ్ ను చిన్న జట్టల్లో పెద్దదానిగా పేర్కొనవచ్చు. అసోసియేట్ దేశాలపై ఐర్లాండ్ జట్టు పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పెద్ద జట్లకు ఝలక్ ఇస్తుంటుంది. గత ఏడాది బుమ్రా ఆధ్వర్యంలో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ఐర్లాండ్ ఒక రకంగా షాక్ ఇచ్చింది.

ఐర్లాండ్ జట్టులో స్టెర్లింగ్, లిటిల్, క్యాంపైర్, అడయిర్ వంటి ఆటగాళ్లు కీలకంగా ఉన్నారు. వీరు ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్ లలో ఆడుతుంటారు. కాబట్టి భారత ఆటగాళ్లు చిన్న జట్టు అని ఐర్లాండ్ ను తీసి పారేయకుండా.. జాగ్రత్తగా ఆడితేనే విజయం సాధించే అవకాశం ఉంది.

రోహిత్ శర్మ చెప్పిన దాని ప్రకారం ఆల్ రౌండర్ శివం దుబేకు ఈ మ్యాచ్ లో చోటు దక్కే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. యశస్వి జైస్వాల్ ను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా భారత్ ఇన్నింగ్స్ మొదలుపెడతారు. మూడో స్థానంలో సూర్య కుమార్ యాదవ్, నాలుగో స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ కు దిగొచ్చు. మరో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వీరి తర్వాతి స్థానంలో వస్తాడు. జడేజాకు బదులు అక్షర్ పటేల్ ను ఆడించే అవకాశం ఉంది.. ఒకవేళ రోహిత్ స్పెషలిస్ట్ స్పిన్నర్ వైపు మొగ్గు చూపితే కులదీప్ కు అవకాశం లభించవచ్చు. పేస్ బాధ్యతను బుమ్రా తో కలిసి సిరాజ్ పంచుకుంటాడు. ఒకవేళ మైదానం స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తే.. సిరాజ్ స్థానంలో చాహల్ ఆడతాడు.

వేదిక: న్యూయార్క్, మ్యాచ్ ప్రారంభం: భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకి..

తుది జట్లు ఇలా

భారత్

రోహిత్ శర్మ (కెప్టెన్), సిరాజ్, అర్ష్ దీప్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా/ అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, బుమ్రా, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివం దుబే.

ఐర్లాండ్

బాల్ బిర్నీ(కెప్టెన్), యంగ్, వైట్, టెక్టార్, టకర్, డాక్రెల్, డెలానీ, క్యాంఫర్, అడైర్, మెకార్తి.